కదంతొక్కిన ఎర్రజొన్న రైతులు

16 Feb, 2018 03:26 IST|Sakshi

ఆర్మూర్‌లో భారీ ర్యాలీ..

గిట్టుబాటు ధర కోసం నిరాహార దీక్ష

సాక్షి ప్రతినిధి, నిజామాబాద్‌: ఎర్రజొన్న రైతులు కదంతొక్కారు.. గిట్టుబాటు ధర కోసం రోడ్డెక్కారు.. ఎర్రజొన్న కొనుగోలుపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్‌ చేస్తూ గురువారం రైతు ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనకు శ్రీకారం చుట్టారు. బాల్కొండ, ఆర్మూర్, నిజామాబాద్‌ రూరల్‌ నియోజకవర్గాల నుంచి తరలివచ్చిన సుమారు రెండు వేలమంది రైతులు నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌ పట్టణంలో ఆందోళన చేపట్టారు. ముందుగా మామిడిపల్లి చౌరస్తాకు చేరుకున్న రైతులు రోడ్డుపై బైటాయించారు.

ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు రాస్తారోకో నిర్వహించారు. అనంతరం స్థానిక తహసీల్దార్‌ కార్యాలయం వరకు భారీ ర్యాలీ చేపట్టారు. అక్కడ నిరవధిక నిరాహార దీక్షను ప్రారంభించారు. రైతుల ఆందోళనకు మద్దతు పలికేందుకు వచ్చిన వివిధ పార్టీల నేతలను అక్కడి నుంచి పంపించేశారు. నేతలు గో బ్యాక్‌ అంటూ నినాదాలు చేశారు.

ఈ సందర్భంగా ఐక్య కార్యాచరణ కమిటీ నాయకులు మాట్లాడుతూ ఎర్రజొన్న కొనుగోలుకు ప్రభుత్వం స్పష్టమైన కార్యాచరణ ప్రకటించాలని పేర్కొన్నారు. ఎర్రజొన్నకు క్వింటాలుకు రూ.4,500, పసుపునకు క్వింటాలుకు రూ.15 వేల చొప్పున చెల్లించి కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో ఉద్యమం కొనసాగిస్తామని హెచ్చరించారు.  

144 సెక్షన్‌ విధించినప్పటికీ..
పోలీసులు రైతుల నిరాహార దీక్షకు అనుమతి మంజూరు చేయలేదు. గురువారం ఆర్మూర్‌ పట్టణంలో నిషేధాజ్ఞలు జారీ చేసి, 144 సెక్షన్‌ విధించారు. గురువారం ఉదయం 6 గంటల నుంచి శుక్రవారం ఉదయం వరకు 144 సెక్షన్‌ అమలులో ఉంటుందని, ఐదుగురి కంటే ఎక్కువ మంది గుమిగూడరాదని నిజామాబాద్‌ సీపీ కార్తికేయ ప్రకటించారు.

అయితే ఇవేవీ లెక్కచేయని రైతులు తమ ఆందోళనను కొనసాగించారు. ప్రకటించిన కార్యాచరణ మేరకు రాస్తారోకో, ర్యాలీ, నిరాహార దీక్ష చేపట్టారు. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రైతుల దీక్ష నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కామారెడ్డి, నిజామాబాద్‌ జిల్లాలకు చెందిన పోలీసు ఉన్నతాధికారులను    ఆర్మూర్‌కు తరలించి పరిస్థితిని సమీక్షించారు.

ఎమ్మెల్యే నివాసాల వద్ద భద్రత..
రైతుల దీక్ష నేపథ్యంలో ఆర్మూర్‌ పట్టణంలోని స్థానిక ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి ఇంటి వద్ద పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. అలాగే సమీపంలోని పెర్కిట్‌లో ఉన్న బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి నివాసం వద్ద కూడా పోలీసు బలగాలను మోహరించారు. ప్రభుత్వం స్పందించని పక్షంలో అవసరమైతే ఎమ్మెల్యేల ఇళ్లను ముట్టడిస్తామని రైతులు హెచ్చరించడంతో పోలీసులు ముందస్తు జాగ్రత్తగా బందోబస్తును పెంచారు. వీరి నివాసాల ముందు బారికేడ్లను ఏర్పాటు చేశారు. 

మరిన్ని వార్తలు