ఆ దిబ్బలో ఏముంది..?

8 Jan, 2018 02:18 IST|Sakshi

జనగామకు చేరువలోని కొన్నె–రామచంద్రాపురం మధ్య అన్వేషణ

త్వరలో  కేంబ్రిడ్జి వర్సిటీతో కలసి హెచ్‌సీయూ బృహత్తర పరిశోధన

గజగిరిగుట్ట చేరువలో వేల ఏళ్ల పాటు మానవ ఆవాసం

నాటి జీవన విధానం, ఆహార పదార్థాలు, ఉపద్రవాలపై వెతుకులాట

మట్టి దిబ్బలో చెట్ల పుప్పొడి, ధాన్యాల అవశేషాల సేకరణ

యాక్సలేటర్‌ మాస్‌ స్పెక్ట్రోమిట్రీ విధానం వినియోగం

సాక్షి, హైదరాబాద్‌:  వేల ఏళ్ల మానవ మనుగడ.. తొలి చారి త్రక యుగం, బృహత్‌శిలా యుగం, కొత్త రాతి యుగం.. ఇలా వివిధ కాలాల్లో మనిషి వర్ధిల్లా డు. ఇప్పుడు మిగిలింది ‘బూడిద’. వేల ఏళ్ల మా నవ ఆవాసం కొనసాగిందనేందుకు నిదర్శనంగా బూడిద కుప్ప తరహాలో దిబ్బ ఏర్ప డింది. మరి వేల ఏళ్ల కాల ప్రవాహంలో అక్కడ మనిషి జాడ  ఎందుకు కనుమరుగైంది..? ఇప్పు డు ఇక్కడి మర్మం కనుక్కునేందుకు బృహత్తర అన్వేషణకు తెర లేవబోతోంది.

మానవ మనుగడలో కీలక భూమిక పోషించిన అంశాలు.. అక్కడ వినియోగించిన ధాన్యం.. మనిషితో పెనవేసుకున్న వృక్ష సంపద.. నాటి పర్యావరణం.. ఉపద్రవాలేమైనా సంభవించాయా.. అక్కడ మనిషి మనుగడ లేకుండా అదృశ్యమవటానికి కారణమైన అంశాలేంటి..? ఇంగ్లండ్‌ లోని కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయం, హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం(హెచ్‌సీయూ) నేతృత్వంలో ఈ అన్వేషణ కొనసాగ నుంది. ఈ బృహత్తర కార్యక్రమానికి జనగా మకు దగ్గర లోని కొన్నె–రామచంద్రాపురం ప్రాంతా ల్లోని గజగిరిగుట్ట కేంద్రం కాబోతోంది.

ముందు జాగ్రత్తకు..
సాధారణంగా పురావస్తు అన్వేషణలు చరిత్రను కళ్ల ముందుంచుతాయి. గతించిన కాలానికి చెందిన వైభవాన్ని ప్రస్ఫుటిస్తాయి. తాజాగా జరగబోయే అన్వేషణ మాత్రం చరిత్రతో పాటు భవిష్యత్తు సవాళ్లను ఎదుర్కొనేందుకు సమాయత్తం చేసేందుకు దోహదపడనుండటం విశేషం. ప్రకృతి ఉపద్రవాలను ముందే ఊహించి వాటి నుంచి బయటపడేందుకు పద్ధతులను అన్వేషించటం, అసలు ఉపద్రవాలు ఎందుకొచ్చాయో తెలుసుకోవటం చాలా అవసరం.

పర్యావరణానికి పెను ముప్పుగా మారుతున్న మానవ తప్పిదాలు భవిష్యత్తును ఆందోళనకరంగా మారుస్తున్నాయి. ఈ క్రమంలో గత అనుభవాలను స్పష్టంగా తెలుసుకుంటే భవిష్యత్తులో ఉపద్రవాల నుంచి బయటపడేందుకు మార్గం సుగమమవుతుందని నిపుణులు భావిస్తున్నారు. ఇటీవల కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయం ఆర్కియాలజీ విభాగం ప్రొఫెసర్‌ డోరియన్‌ ఫుల్లర్‌ హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయాన్ని సంప్రదించారు. ఈ పరిశోధనల్లో ఫుల్లర్, హెచ్‌సీయూ ప్రొఫెసర్‌ కె.పుల్లారావు ముందుకొచ్చారు.

అత్యాధునిక పద్ధతిలో..
గతంలో కొన్ని ప్రాంతాల్లో ఈ తరహా పరిశోధన జరిగినా అది పూర్తిగా సంప్రదాయ పద్ధతిలో సాగింది. తొలిసారి ఆధునిక పద్ధతిలో అధ్యయనానికి సిద్ధమవుతున్నారు. ఆ ప్రాంతంలో తవ్వకాలు జరిపి మానవ మనుగడ సాగిన కాలాన్ని కచ్చితంగా నిర్ధారిస్తారు. ప్రస్తుతం బూడిద మట్టి పేరుకుపోయిన ప్రాంతంలో కొన్ని మీటర్ల లోతు తవ్వి నాటి మనుషులు ఆహారంగా వినియోగించిన ధాన్యపు గింజలు, ఇతర పదార్థాల అవశేషాలను గుర్తిస్తారు.

మట్టి పొరల్లో నిక్షిప్తమైన పుప్పొడి అవశేషాలనూ సేకరిస్తారు. దీనివల్ల నాటి ఆహార పదార్థాలు, సేకరణ తీరు, పుప్పొడి ఆధారంగా నాటి వృక్ష జాతి, పర్యావరణం తీరును కచ్చితంగా అంచనా వేస్తారు. ఇందుకు ‘యాక్సలేటర్‌ మాస్‌ స్పెక్ట్రోమిట్రీ (ఏఎంఎస్‌)’అనే ఆధునిక విధానాన్ని అనుసరించనున్నారు. దీని ద్వారా సేకరించిన అతి సూక్ష్మ నమూనాలను అత్యాధునిక పరిశోధన శాలలున్న ఆక్స్‌ఫర్డ్, ఆరిజోనా యూనివర్సిటీ ల్యాబ్‌ల్లో పరిశోధిస్తారు.


జనగామ ప్రాంతమే ఎందుకు?
జనగామ సమీపంలోని కొన్నె–రామచంద్రాపురం ప్రాంతాల్లో వేల ఏళ్లనాటి మానవ నివాస జాడలున్నాయి. ఇక్కడి గజగిరిగుట్ట వద్ద పెద్ద ఆవాసం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక్కడ ప్రొఫెసర్‌ పుల్లారావు ఆధ్వర్యంలో అధ్యయనం జరిగింది. అక్క డ తొలి చారిత్రక యుగం, బృహత్‌ శిలా యుగం, కొత్తరాతియుగం కాలాల్లో మాన వులు నివాసాలు ఏర్పాటు చేసుకున్న ఆధారాలు వెలుగు చూశాయి.

ఆయా కాలాల్లో వినియోగించిన పనిముట్లు, ఆయుధాలు, పాత్రలు కనిపించాయి. అలాగే చుట్టుపక్కల ప్రాంతాల్లో మానవ సమాధులకు చిహ్నాలైన రాక్షస గుళ్లు కూడా ఉన్నాయి. ఈ విషయాన్ని డోరియర్‌ ఫుల్లర్‌ దృష్టికి తేవటంతో ఆయన ఇక్కడికొచ్చి పరిశీలించారు. పరిశోధనలకు అనుమతి కావాలంటూ గతంలో హెచ్‌సీయూ కేంద్రాన్ని కోరింది. తాజాగా కేంద్ర పురావస్తు సర్వేక్షణ సంస్థ అనుమతి మంజూరు చేసింది.


ఈ పరిశోధన చాలా కీలకం: ప్రొఫెసర్‌ పుల్లారావు
‘ఈ పరిశోధనల వల్ల ప్రకృతితో మానవుడి అనుబంధం, పర్యావరణ పరంగా వచ్చిన మార్పులు, మనిషి చెల్లాచెదురయ్యేందుకు కారణాలను కనుక్కొనే అవకాశముంది. ఇలాంటి పరిస్థితులు ప్రపంచ వ్యాప్తంగా చాలాచోట్ల వచ్చాయి. అయితే కారణాలు కనుక్కుంటే భవిష్యత్తు ఉపద్రవాలను ఎదుర్కోవచ్చు. ఇదే దిశగా మా పరిశోధన ఉండనుంది. కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంతో ఒప్పందం చేసుకోవాల్సి ఉంది’.

మరిన్ని వార్తలు