కాటేసిన కట్నం

8 Dec, 2015 04:06 IST|Sakshi
కాటేసిన కట్నం

వివాహిత సజీవ దహనం
 అనుమానాస్పద మృతిగా కేసు నమోదు
 
 కుత్బుల్లాపూర్:
ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త సంతానం కలగలేదని రాచి రంపాన పెట్టాడు... అదనపు కట్నం తెమ్మని చేయి చేసుకున్నాడు...  చివరకు ఆ అభాగ్యురాలు అనుమానాస్పద స్థితిలో మంటల్లో కాలి మృతి చెందింది. పేట్‌బషీరాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ విషాద ఘటన జరిగింది.  సీఐ రంగారెడ్డి, స్థానికుల కథనం ప్రకారం.. ఈసీఐఎల్‌కు చెందిన సుశీల కుమార్తె శ్రీలత అలియాస్ భాగ్యలక్ష్మి (29) డిగ్రీ చదువుకుంది. దేవరయాంజల్‌లో ఆటో డ్రైవర్‌గా పని చేస్తున్న వరుసకు మేనమామ అయ్యే పోచయ్య(31)ను శ్రీలత 2007లో తన తల్లిదండ్రులను కాదని ఓ గుడిలో ప్రేమ వివాహం చేసుకుంది. అప్పటి నుంచి ఆమె దేవరయాంజల్‌లోని అత్తగారింట్లో ఉంటోంది.
 
 పిల్లలు కలగడం లేదని వేధింపులు..

 పెళ్లి అయ్యాక కొంతకాలం శ్రీలతను పోచయ్య బాగా చూసుకున్నాడు. తర్వాత పిల్లలు కలగలేదని అందరి ముందే అవమానించడంతో పాటు అదనపు కట్నం తేవాలని వేధించసాగాడు. ఈ క్రమంలో శ్రీలత తన పుట్టింటి నుంచి రూ.50 వేలు తెచ్చి ఇవ్వగా బైక్ కొన్నాడు. తర్వాత ఆటో ట్రాలీ కొనేందుకు రూ.లక్ష కావాలని, వార్డు సభ్యుడిగా పోటీ చేసేందుకు రూ.80 వేలు కావాలని, ఈ మొత్తాలను పుట్టింటి నుంచి తీసుకురమ్మని పోచయ్య భార్యను వేధించసాగాడు. అసలే త ల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉండటంతో శ్రీలత నిరాకరించింది.

 దీంతో ఇరువురి మధ్య 10 రోజులుగా రాత్రి సమయంలో గొడవ జరుగుతోంది.  ఇదే క్రమంలో ఆదివారం రాత్రి పోచయ్య భార్యతో గొడవ పెట్టుకుని తీవ్రంగా కొట్టాడు. దీంతో మనస్తాపానికి గురైన శ్రీలత చనిపోతానని అంటే.. చస్తే చావు అంటూ పోచయ్య ఇంటి నుంచి వెళ్లిపోయాడు. సోమవారం తెల్లవారుజామున 4.30కి ఇంట్లో నుంచి మంటలు వచ్చాయి. ఆ మంటల్లో శ్రీలత కాలి అక్కడికక్కడే మృతి చెందింది. ఇంట్లో గ్యాస్ స్టౌ ఉండగా... కిరోసిన్ ఎక్కడి నుంచి వచ్చిందనేది ప్రశ్నగా మారింది. భర్తే కిరోసిన్ పోసి శ్రీలతను హతమార్చాడా? లేదా మనస్తాపంతో శ్రీలతే ఆత్మహత్య చేసుకుందా?  అన్న విషయం విచారణలో తేలాల్సి ఉంది.
  పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు...  ఐపీసీ సెక్షన్లు 306, 498-ఏ, 174  కింద కేసు నమోదు చేసి, పోచయ్య కోసం గాలిస్తున్నారు.
 

మరిన్ని వార్తలు