సాగర మథనం..మరింత దూరం!

23 Feb, 2016 23:41 IST|Sakshi
సాగర మథనం..మరింత దూరం!

హుస్సేన్ సాగర్ ప్రక్షాళన పనులు వాయిదా?
మళ్లీ పూర్తిగా నిండిన జలాశయం
ఈ వేసవిలో పూడికతీత పనులు లేనట్లే
‘ఆస్ట్రియా టెక్నాలజీ’పై తేల్చని ప్రభుత్వం

 
సిటీబ్యూరో ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హుస్సేన్‌సాగర్ ప్రక్షాళన ప్రాజెక్టు మరికొంత కాలం వాయిదా పడనుంది. తొలుత నాలాల దారి మళ్లింపు తర్వాతే హుస్సేన్‌సాగర్‌లో పూడికతీత పనులు చేపట్టే అవకాశం కన్పిస్తోంది. గత ఏడాది మొత్తం రిజర్వాయర్‌లోని నీటిని ఖాళీ చేసిన యంత్రాంగం.. ఒక దశలో పూడికతీత పనులను ప్రారంభించాలని భావించింది. కానీ పర్యావరణవేత్తల నుండి వచ్చిన అభ్యంతరాలతో సాధ్యం కాలేదు. అయితే ప్రస్తుతం హుస్సేన్‌సాగర్‌లోకి విష రసాయనాలను మోసుకొస్తున్న కూకట్‌పల్లి నాలా మళ్లింపు పనులు దాదాపు పూర్తయ్యాయి. ముందుగా అనుకున్న పథకం ప్రకారమైతే ఈ వేసవిలో పూడికతీత ప్రారంభం కావాలి. అందుకు హుస్సేన్‌సాగర్ నీటిని ఇప్పటి నుండే ఖాళీ చేస్తే వచ్చే ఏప్రిల్ మాసంలో పూడిక తీసే పనులు ప్రారంభించే ఛాన్స్ ఉంటుంది. కానీ బోట్ల రాకపోకలకు అనువుగా ఉండేందుకు టూరిజం శాఖ సూచన మేరకు హుస్సేన్‌సాగర్‌లో పూర్తి నీటిమట్టం కొనసాగించా లని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ప్రస్తుతం రిజర్వాయర్ పూర్తి నీటిమట్టంతో ఉంది. దీనికి తోడు పూడికతీతకు సన్నాహాలు చేసిన నీటిపారుదల శాఖకు కూడా ఎలాంటి ఆదేశాలు లేకపోవటంతో వారు ఇతర పనులపై దృష్టి సారించారు.
 
‘ఆస్ట్రియా టెక్నాలజీ’పై స్పష్టత లేదు...
హుస్సేన్‌సాగర్‌లో పూడిక తీయకుండానే నీటిని ఏరియేషన్ చేయటం ద్వారా శుద్ధి చేస్తామని ముందుకు వచ్చిన ఆస్ట్రియా కంపెనీ ప్రతిపాదనలపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఆస్ట్రియాలో డాన్యూబ్ నదిని శుద్ధి చేసిన తరహాలో రూ.370 కోట్ల వ్యయంతో తాము పనులు చేస్తామని ఆస్ట్రియా ప్రతినిధులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు ఇచ్చారు. ఆ ప్రతిపాదలను సైతం ప్రభుత్వం ప్రస్తుతానికి
పక్కన పెట్టింది.
 
సాగర్‌లో మట్టి ప్రతిమలకే అనుమతి
ఈ యేడాది నుండి హుస్సేన్‌సాగర్‌లో మట్టి వినాయక ప్రతిమలనే నిమజ్జనానికి అనుమతించే దిశగా సర్కార్ సన్నాహాలు చేస్తోంది. రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి సోమవారం హైకోర్టుకు సమర్పించిన యాక్షన్‌ప్లాన్‌లో సహజసిద్ధ రంగుల వాడకాన్ని ప్రోత్సహించేందుకు పీసీబీ తరపున ఆర్థిక సహాయాన్ని కూడా అందజేయనున్నట్లు కోర్టుకు ఇచ్చిన లేఖలో పేర్కొంది. ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో శారదాదేవి అనే మహిళ నేచురల్ (సహజసిద్ధ) కలర్స్ తయారు చేస్తోందని, ఈ రంగుల తయారీకి గాను ఆమె ఐదు కోట్ల రూపాయల ఆర్థిక సహాయం కోరగా, పీసీబీ తరుపున కోటి రూపాయలు అందించనున్నట్లు పేర్కొన్నారు. ఆ మొత్తాన్ని రంగుల తయారీకి వాడే రా మెటీరియల్, మిషనరీ కొనుగోలుకు వెచ్చించేందుకు కేటాయించనున్నారు. ఆమె కోరిన మిగిలిన మొత్తాన్ని ఇతర ప్రభుత్వ విభాగాలు సహాయం చేసేవిధంగా పీసీబీ అధికారులు కోరారు. వినాయకప్రతిమలు తయారు చేసే రాజస్థానీలను సైతం మట్టి వినాయకుల తయారీ దిశగా మళ్లించేందుకు త్వరలో ఐదు చోట్ల శిక్షణా శిబిరాలను ఏర్పాటు చేయనున్నారు.
 

మరిన్ని వార్తలు