పట్టాలు తప్పిన హుస్సేన్‌సాగర్ ఎక్స్‌ప్రెస్

27 Jan, 2016 20:26 IST|Sakshi

 హైదరాబాదు నుంచి ముంబాయికి వెళ్లాల్సిన హుస్సేన్ సాగర్ ఎక్స్‌ప్రెస్ రైలు బుధవారం నాంపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో పట్టాలు తప్పింది. దీంతో పలు ఎక్స్‌ప్రెస్, ప్యాసింజర్, ఎంఎంటిఎస్ రైళ్లకు తీవ్ర అంతరాయం కలిగింది. వివరాలు.. హైదరాబాదు రైల్వే స్టేషన్ నుంచి ప్రతి రోజు మధ్యాహ్నం 2.45 నిమిషాలకు బయలుదేరిన హుస్సేన్ సాగర్ రైలు  ప్లాట్‌ఫారం 4 నుంచి రివర్స్ తీసుకువస్తుండగా.. రెండు బోగీలు పట్టాలు తప్పాయి. బోగీ నంబరు 8, 9లు రెండూ పక్కకు ఒరిగి పోయాయి.  విషయం తెలుసుకున్న రైల్వే ఉన్నతాధికారులు రెస్క్యూ టీమ్‌ను రంగంలోకి దించారు.


 సికింద్రాబాదు నుంచి రైల్వే అధికారులు, సిబ్బంది హుటాహుటిన ప్రత్యేక రైలులో నాంపల్లి స్టేషన్ కు చేరుకున్నారు. మధ్యాహ్నం 2.30 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు మరమ్మత్తులు చేపట్టారు. పట్టాలు తప్పిన రైలును తొలగించేందుకు చాలా సమయంలో పట్టడంతో హైదరాబాదుకు చేరుకోవాల్సిన, హైదరాబాదు నుంచి వెళ్లాల్సిన రైళ్లకు తీవ్ర అంతరాయం కలిగింది. మద్రాసు వెళ్లాల్సిన చెన్నై, విశాఖపట్నం వెళ్లాల్సిన గోదావరి ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఆలస్యంగా నడిచాయి. లింగంపల్లి నుంచి హైదరాబాదు సర్వీసు ఎంఎంటిఎస్ రైలు సైతం ఆలస్యంగా నడిచింది.  రాత్రి 9.30 గంటలకు హుస్సేన్‌సాగర్ రైలు బయలుదేరడంతో ప్రయాణికులు తీవ్ర అసంతప్తికి గురయ్యారు. కాగా.. గత ఐదేళ్లకాలంలో ఇక్కడ రైళ్లు పట్టాలు తప్పడం మూడవసారి.

 

>
మరిన్ని వార్తలు