మళ్లీ జ్వాల

23 Mar, 2016 02:27 IST|Sakshi
మళ్లీ జ్వాల

వీసీ అప్పారావుకు వ్యతిరేకంగా
ఆందోళనకు దిగిన విద్యార్థులు
పోలీసుల లాఠీచార్జి

 
కొద్ది రోజులుగా ప్రశాంతంగా ఉన్న హెచ్‌సీయూ మరోసారి భగ్గుమంది.  రణరంగంగా మారింది. వీసీ ప్రొఫెసర్ అప్పారావు మళ్లీ బాధ్యతలు చేపట్టడం వివాదానికి దారి తీసింది. విద్యార్థుల్లో ఆగ్రహావేశాలు పెల్లుబికాయి.  విధ్వంసానికి పాల్పడ్డారు. పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. ఆందోళనకారులపై పోలీసులు లాఠీచార్జి చేశారు. విద్యార్థులు వారిపై రాళ్ల దాడికి దిగారు. ఈ క్రమంలో కొందరు విద్యార్థులు గాయపడ్డారు. మంగళవారం రోజంతా వర్సిటీలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.  

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ మరోసారి భగ్గుమంది. సుదీర్ఘ సెలవుల తర్వాత వీసీ అప్పారావు  బాధ్యతలు చేపట్టడం పట్ల పలు విద్యార్థి సంఘాలు భగ్గుమంటున్నాయి. వీసీ అప్పారావును తొలగించే వరకు పోరాటాలు కొనసాగిస్తామని వారు స్పష్టం చేశారు. రోహిత్ ఆత్మహత్యకు కారణమైన కేంద్ర మంత్రులు స్మృతి ఇరానీ, బండారు దత్తాత్రేయ, ఎమ్మెల్సీ రాంచందర్‌రావు తదితరులు తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఇందులో భాగంగా బుధవారం జేఏసీ వర్సిటీ బంద్‌కు పిలుపునిచ్చింది. దీనికి ఎస్‌ఎఫ్‌ఐ, ఏఎస్‌ఎఫ్‌ఐ, పీడీఎస్‌యూ, ఏఎస్‌ఏ తదితర సంఘాలు మద్ధతు పలుకుతూ రాష్ట్రవ్యాప్తంగా అన్ని వర్సిటీలు, జిల్లా కేంద్రాల్లో వీసీ అప్పారావు దిష్టిబొమ్మలు దహనం చేసేందుకు పిలుపునిచ్చాయి. హెచ్‌సీయూకు కన్హయ్యకుమార్ రానున్న నేపథ్యంలో.. ఆయన సమక్షంలోనే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని వెల్లడించాయి.
 
నేడు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు
హైదరాబాద్ వర్సిటీ ఘటన వెనుక బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్, ఏబీవీపీ కుట్ర ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఇన్ని రోజులు శాంతియుతంగా ఆందోళనలు జరగగా.. ఒక్కసారిగా వర్సిటీ రణరంగం కావడం వారి ప్రోద్భలమే. తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న అప్పారావును తిరిగి వీసీగా పంపడమూ వారి పనే. అప్పారావును వెంటనే వీసీ పదవి నుంచి తొలగించి క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. ఎట్టిపరిస్థితుల్లో హైదరాబాద్ వర్సిటీలో బహిరంగ సభ నిర్వహిస్తాం. అన్ని వర్సిటీలతోపాటు జిల్లా కేంద్రాల్లో వీసీ అప్పారావు దిష్టిబొమ్మలను దహనం చేస్తాం. నల్లజెండాలతో నిరసన తెలుపుతాం.
 - శివరామకృష్ణ,  ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి

 వీసీపై చర్యలు తీసుకోవాలి
 రోహిత్ ఆత్మహత్యకు కారకులైన వీసీ అప్పారావుపై చర్యలు తీసుకునే వరకు ఆందోళనలు కొనసాగిస్తాం. ఏకసభ్య కమిషన్ విచారణ  నివేదిక అందజేయకముందే వీసీ అప్పారావు బాధ్యతలు చేపట్టడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. బహిష్కరణకు గురైన ఐదుగురు విద్యార్థులను ఒక్కసారి కూడా పరామర్శించని అప్పారావు.. వీసీగా అనర్హుడు.
 - వెంకటేష్ చౌహాన్,  హెచ్‌సీయూ జేఏసీ చైర్మన్
 
‘రోహిత్ చట్టం’ సాధిస్తాం

పార్లమెంట్‌లో రోహిత్ చట్టం ఆమోదించే వరకు ఆందోళనలు నిర్వహిస్తాం. ఒక వైపు విచారణ జరగుతున్న సమయంలో విచారణను ఎదుర్కొనే వ్యక్తే వీసీ బాధ్యతలు అప్పగించడం దారుణం. దీనిపై ఐక్య పోరాటాలు నిర్వహిస్తాం. తన కొడుకును ఎందుకు బహిష్కరించావో చెప్పాలని రోహిత్ తల్లి రాధిక అడిగిన ప్రశ్నకు జవాబు ఇవ్వని వీసీ అప్పారావు ఆ కుర్చీలో కూర్చోవడం సిగ్గుచేటు.
 - దొంత ప్రశాంత్, జేఏసీ నేత
 
 వీసీని తొలగించాల్సిందే
 రోహిత్ ఆత్మహత్య ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న అప్పారావుకు తిరిగి వీసీ బాధ్యతలు అప్పగించడం దారుణం. ఆ పదవి నుంచి శాశ్వతంగా తొలగించే వరకు వర్సిటీలో తరగతులు కొనసాగనివ్వం. రోహిత్ ఆత్మహత్యకు కారకులైన వారిపై కేసులు నమోదు చేసి వదిలేశారు. రెండు నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు వారిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. వర్సిటీలో నిరసన తెలుపుతున్న విద్యార్థులపై పోలీసులు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. దీనికి నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేస్తాం. అరెస్టయిన విద్యార్థులను విడుదల చేయాలి.
 - నాగేశ్వరరావు,  ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు
 

>
మరిన్ని వార్తలు