సిటీ యాప్.. సూపర్ కాప్..

19 Apr, 2016 02:49 IST|Sakshi
సిటీ యాప్.. సూపర్ కాప్..

పోలీసులకు అందుబాటులోకి ‘హైదరాబాద్ కాప్ యాప్
సాక్షి, హైదరాబాద్
: నిఘా.. దర్యాప్తు.. పర్యవేక్షణ.. ప్రజా భద్రతలో ఇవే కీలకాంశాలు. వీటన్నింటినీ ఒకేసారి సమన్వయపరచడం కష్టంతో కూడుకున్న వ్యవహారం. దీనిని దృష్టిలో ఉంచుకుని పోలీసుల కోసం ఓ ప్రత్యేక యాప్‌ను రూపొందించింది నగర పోలీసు విభాగం. హైదరాబాద్ కాప్ పేరుతో అందుబాటులోకి వచ్చిన ఈ యాప్‌ను రాష్ట్ర డీజీపీ అనురాగ్ శర్మ, నగర పోలీస్ కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి సోమవారం కమిషనరేట్‌లో ఆవిష్కరించారు.

దర్యాప్తు అధికారులు క్షేత్రస్థాయి నుంచే కీలక వివరాలు సేకరించడానికి, నేరగాళ్లు, అనుమానితుల వివరాలు తెలుసుకోవడానికి ఈ యాప్ ఉపకరించనుంది. అలాగే నగరవ్యాప్తంగా ఉన్న సీసీ కెమెరాల ద్వారా రికార్డవుతున్న దృశ్యాలను ప్రతి పోలీసు అధికారి తన సెల్‌ఫోన్ ద్వారానే పర్యవేక్షించే అవకాశం ‘హైదరాబాద్ కాప్’ యాప్ ద్వారా లభించనుంది. హైదరాబాద్ పోలీసులను సూపర్ కాప్‌లుగా మార్చే ఈ యాప్‌లో ఉండే ప్రధానాంశాలు ఏమిటంటే..                                                       
 
ఈ-బీట్ వ్యవస్థ..
ఠాణాల పరిధిలోని సమస్యాత్మక ప్రాంతాలు, కీలక ప్రదేశాలకు గస్తీ సిబ్బంది కచ్చితంగా వెళ్లిరావడం కోసం ఆయా చోట్ల బీట్ పుస్తకాలు ఏర్పాటు చేస్తారు. ఈ యాప్ ద్వారా ఈ-బీట్ వ్యవస్థ అందుబాటులోకి వచ్చింది. జీపీఎస్ పరిజ్ఞానం ఆధారంగా పని చేసే ఈ యాప్ అక్షాంశ, రేఖాంశాలను సంగ్రహించడం ద్వారా పక్కాగా, కచ్చితంగా ఆయా ప్రాంతాలకు వెళ్లేలా చేస్తుంది.
 
క్రైమ్ స్పాట్స్..

గడిచిన నాలుగేళ్ల గణాంకాల ఆధారంగా పోలీసుస్టేషన్ల వారీగా క్రైమ్ ప్రోన్ ఏరియాలను గుర్తించి, జీపీఎస్ మ్యాపింగ్ రూపంలో అందుబాటులోకి తెచ్చారు. గస్తీ సిబ్బంది ఆ ప్రాంతానికి చేరుకున్న వెంటనే అప్రమత్తం చేసే ప్రత్యేక వ్యవస్థ ఈ యాప్‌లో ఉంది.
 
వెహికల్ డేటాబేస్
ఓ వాహనచోదకుడు వాహనానికి చెందిన పత్రాలను పోలీసులకు తనిఖీ సమయంలో చూపినప్పుడు ఆ జిరాక్సు ప్రతులు అసలో కాదో యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. మరోవైపు చోరీ వాహనాల జాబితా కూడా ఈ యాప్‌కు అనుసంధానిస్తున్నారు.
 
ఎంవో క్రిమినల్స్..

సిటీకి చెందిన 3,600 మంది పాత నేరగాళ్లు నివసిస్తున్న తాజా చిరునామాలను జీపీఎస్ ఆధారంగా ట్యాగిం గ్ చేశారు. దీంతో పాటు జైలు నుంచి విడుదలవుతున్న వారి వివరాలనూ పొందుపరిచారు. ఫలితంగా క్షేత్రస్థాయి సిబ్బంది కచ్చితంగా వారి ఇళ్లకు వెళ్లి తనిఖీ చేయడంతో పాటు ఏదైనా నేరం జరిగిన వెంటనే అలాంటి నేరాలు చేసే వాళ్లు ఎవరున్నారు? వారు ప్రస్తుతం ఎక్కడున్నారు? అనేవి తక్షణం తెలుసుకునే అవకాశం ఉంటుంది.
 
మిస్సింగ్కు చెక్..
సిటీలో నిత్యం తప్పిపోయిన, గుర్తుతెలియని శవాల కేసులు నమోదవుతుంటాయి. ఈ యాప్ సర్వర్‌లో ఎప్పటికప్పుడు మిస్సింగ్ కేసులు, లభించిన గుర్తుతెలియని మృతదేహాల పూర్తి వివరాలను అప్‌లోడ్ చేస్తారు. ఇవి అన్ని స్థాయిల అధికారులకు అందుబాటులో ఉండటంతో ఫిర్యాదు వచ్చిన మరుక్షణమే సరిచూడటానికి అవకాశం ఏర్పడుతోంది.
 
పరిరక్షణ విధివిధానాలు

నేర స్థలాల్లో లభించే ఆధారాలు దర్యాప్తునకు కీలకం. అధికారులు, సిబ్బందికి వీటిని ఎలా పరిరక్షించాలి? తదితర అంశాలపై పట్టుండట్లేదు. దీనికోసం క్రైం సీన్ మేనేజ్‌మెంట్‌ను యాప్‌లో అందించారు. దీని ద్వారా ఆధారాల సేకరణ, దర్యాప్తు విధివిధానాలు, నిబంధనలు అన్ని స్థాయిల సిబ్బందికీ అందుబాటులోకి వస్తున్నాయి.
 
క్షణాల్లో చిరునామాలు

వివిధ కేసుల దర్యాప్తులో వాహనాలు, సెల్‌ఫోన్, పాస్‌పోర్ట్ నంబర్లు తదితరాల ఆధారంగా సేకరించే ఆయా వ్యక్తుల చిరునామాలు కీలకంగా మారతాయి. ఇవి ఎంత త్వరగా తెలుసుకోగలిగితే దర్యాప్తు అంత వేగవంతం అవుతుంది. ఈ డేటాబేస్‌ను యాప్ సర్వర్‌కు అనుసంధానించారు. దీంతో కొన్ని రకాలైన ఫిర్యాదుల విచారణ, కేసుల దర్యాప్తుల్లో జాప్యాన్ని నివారించడానికి ఆస్కారం ఏర్పడనుంది.

మరిన్ని వార్తలు