విశ్వమంత విజన్

18 Mar, 2016 03:19 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: రాజధాని అభివృద్ధికి రూ.83,950 కోట్లు..  వచ్చే 30 ఏళ్లకోసం భారీ ప్రణాళికలు

అందమైన, ట్రాఫిక్ జంఝాటం లేని సువిశాలమైన రోడ్లు. సుఖమయ ప్రయాణానికి కావాల్సిన సర్వ సదుపాయాలు. పేదలకు చూడచక్కని డబుల్ బెడ్రూం ఇళ్లు, ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు, హుస్సేన్‌సాగర్ ప్రక్షాళన, మూసీ సుందరీకరణ, పరిసర జిల్లాలకు శరవేగంగా చేరుకునేందుకు అత్యాధునిక రహదారులు, స్కైవేలు... హైదరాబాద్‌ను ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దేందుకు, నగర జీవనాన్ని సాఫీగా మార్చేందుకు ఉద్దేశించిన బృహత్తర ‘విశ్వనగర’ ప్రాజెక్టు లక్ష్యాలివి. రానున్న 30 ఏళ్లను దృష్టిలో ఉంచుకుని సిద్ధం చేసిన ఈ ప్రాజెక్టులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టనున్న గ్రేటర్ మౌలిక సదుపాయాల అభివృద్ధి పనుల విలువెంతో తెలుసా..? అక్షరాలా రూ.83,950 కోట్లు! వీటిలో తెలంగాణలోని 35 స్థానిక సంస్థల్లో తాగునీటి సరఫరాకు రూ.2,300 కోట్లు మినహాయిస్తే మిగతా నిధులన్నీ గ్రేటర్‌పై వెచ్చించబోయేవే!! ఈ భారీ నిధులను హడ్కో, పలు అంతర్జాతీయ సంస్థలు తదితర మార్గాల ద్వారా సేకరించనున్నారు. ఈ నిధులతో చేపట్టే పనుల్లో ముఖ్యమైనవి...    

 
► మిషన్ హుస్సేన్‌సాగర్
► కూకట్‌పల్లి,సనత్‌నగర్ ప్రాంతాల నుంచి రోజూ సాగర్‌లోకి వచ్చి చేరుతున్న400 మిలియన్ లీటర్ల పారిశ్రామిక వ్యర్థజలాలను   అంబర్‌పేట్ ఎస్టీపీకి దారి మళ్లించడం. ఈ పనులు దాదాపు పూర్తయ్యాయి.
► జలాశయం నీటి నాణ్యతను మెరుగుపరచడం, ఘన వ్యర్థాలు చేరకుండా చూడటం
► నాలుగు నాలాల నుంచి వచ్చి చేరుతున్న మురుగునీటిని మళ్లించడం
► జలాశయంలో జీవవైవిధ్యాన్ని పరిరక్షించడం
► నీటిని ల్యాండ్ స్కేపింగ్,గార్డెనింగ్ అవసరాలకు వాడుకునేలా శుద్ధి చేయడం
► పికెట్ నాలా వద్ద నీటి శుద్ధికి 30 ఎంఎల్‌డీ సామర్థ్యంతో మురుగుశుద్ధి కేంద్రం నిర్మాణం
► హుస్సేన్‌సాగర్ వద్దనున్న 20 ఎంఎల్‌డీ ఎస్టీపీ అధునీకరణ
► రంగధాముని చెరువు వద్ద 5 ఎంఎల్‌డీ సామర్థ్యంతో మినీ ఎస్టీపీ నిర్మాణం
► సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు ప్రాంతంలో ట్రంక్ సీవర్ మెయిన్స్ నిర్మాణం
 
 
విశ్వ’ ప్రణాళిక సమగ్ర స్వరూపం
అంశం            వ్యయం (రూ. కోట్లలో)
1. మొత్తం రహదారులు (ఎస్సార్‌డీపీ+కౌంటర్ మాగ్నెట్స్)    25,783
2 ఈస్ట్ వెస్ట్ మూసీ రోడ్డు (ఫేజ్ 1+ఫేజ్ 2)    7,775
3. హెచ్‌ఎండీఏలో గ్రిడ్ రోడ్లు     6,000
4. టీవోజీసీల్లో మౌలికసదుపాయాలు    13,998
5.పీపీపీ విధానంలో మోడర్న్ ఎఫ్‌ఓబీలు     42
6. మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్‌మెంట్    2,966
7.స్లమ్స్, ఖాలీ ప్రదేశాల్లో డబుల్ బెడ్‌రూమ్‌ఇళ్లు     7,788
8. జీహెచ్‌ఎంసీలో శ్మశానవాటికల అభివృద్ధి    25
9. హుస్సేన్‌సాగర్ శుద్ధి     1,415
10.తాగునీటి సరఫరా, సివరేజి    10,231
11. తెలంగాణలోని 35 యూఎల్‌బీల్లో తాగునీటి సరఫరా    2,300
12. వరద కాలువలు     6,900
 
 
 
అత్యాధునిక రోడ్లు...

 హైదరాబాద్ నుంచి పరిసర జిల్లాల్లో ఏర్పాటయ్యే శాటిలైట్ టౌన్‌షిప్ (కౌంటర్ మాగ్నెట్)లను చేరుకునేందుకు రోడ్లు, వ్యూహాత్మక రోడ్ల అభివృద్ధి పథకం (ఎస్సార్డీపీ)లో భాగంగా సిగ్నల్ ఫ్రీ మార్గాలకు మొత్తం రూ.25,783 కోట్లు వెచ్చిస్తారు. వీటిలో 11 కౌంటర్ మాగ్నెట్ల వరకు రోడ్లు మార్గాలకే రూ.10,629 కోట్లు, ఎస్సార్డీపీ పనులకు రూ.15, 154 కోట్లు కావాలని అంచనా.

బీఆర్‌టీఎస్...
నగరానికి నాలుగు వైపులా బస్సుల కోసం ప్రత్యేకమైన 438 కి.మీ. మేర విశాలమైన బీఆర్‌టీఎస్ రోడ్లు
నర్సాపూర్, తుర్కపల్లి, షామీర్‌పేట, ఇబ్రహీంపట్నం, బొంగులూరు, గుమ్మడిదల, కందుకూరు తదితర మార్గాల్లో వీటి నిర్మాణం
 
దాహార్తి, మురుగు కష్టాలకు10,231 కోట్లు
గ్రేటర్‌తో పాటు రింగ్‌రోడ్డు లోపలున్న 187 గ్రామ పంచాయతీల పరిధిలో దాహార్తిని తీర్చే బాధ్యతలనూ ప్రభుత్వం ఇటీవలే జలమండలికే అప్పజెప్పింది. ఇందుకు రూ.10,231 కోట్లు కావాలంటూ జలమండలి సమగ్ర ప్రతిపాదనలు రూపొందించి ప్రభుత్వానికి నివేదించింది.
కేశవాపూర్, మల్కాపూర్‌లలో భారీ రిజర్వాయర్లు
జీహెచ్‌ఎంసీ, శివార్లలో మురుగునీటి పారుదల, నీటి సరఫరా వ్యవస్థలు
రింగ్‌రోడ్డు లోపలున్న పంచాయతీలకు నీటి సరఫరాకు రూ.606 కోట్లు
 
 
మెట్రో మెరుపులు
మెట్రో రైల్ మార్గాన్ని 2041 నాటికి 417 కిలోమీటర్ల మేరకు అభివృద్ధి చేయాలని  ప్రతిపాదించారు. తొలి దశ కింద ప్రస్తుతం చేపట్టిన 72 కి .మీ.ని పూర్తి రెండో దశలో మరో 83 కి.మీ. మేరకు విస్తరిస్తారు.
సంగారెడ్డి, చౌటుప్పల్, కందుకూర్, మేడ్చల్, కీసర, ఘట్కేసర్, ఉస్మాన్‌సాగర్, శ్రీశైలం రోడ్డు తదితర ప్రాంతాలకు మెట్రోను పొడిగిస్తారు

ఎంఎంటీఎస్....
రెండో దశ కింద ఆరు మార్గాల్లో 84 కి.మీ. మేర చేపట్టిన ఎంఎంటీఎస్‌ను 2041 నాటికి 428 కి.మీ. మేరకు పొడిగింపు
2041 నాటికి తూప్రాన్, మనోహరాబాద్, మేడ్చల్, భువనగరి, బీబీనగర్, రాయగిరి, కొత్తూరు, షాద్‌నగర్ తదితర మార్గాల్లో ఎంఎంటీఎస్ విస్తరణ
 
 
రూ.2965.52 కోట్లతో మూసీకి సొబగులు

మురికికూపంగా మారిన మూసీని ప్రక్షాళించి సుందరీకరిస్తారు. నదికి ఆనుకుని సైకిల్ ట్రాక్‌లు, పాదచారుల కోసం వాక్ వేలు, ఆహ్లాదం పంచేందుకు పచ్చని చె ట్లతో గ్రీన్ స్పేస్‌ను అభివృద్ధి చేస్తారు. తారామతి బారాదరి నుంచి ప్రత్యేకంగా వాక్‌వేను అభివృద్ధి చేయనున్నారు
జంట జలాశయాల నుంచి బాపూఘాట్ వరకు 19 కి.మీ మార్గంలో సుందరీకరణ
బాపూఘాట్ నుంచి నాగోల్ బ్రిడ్జివరకు 21.5 కి.మీ మార్గంలో సుందరీకరణ
నాగోల్ బ్రిడ్జి నుంచి ఔటర్ రింగ్‌రోడ్డు (గౌరెల్లి వరకు) 15 కి.మీ. మార్గంలో సుందరీకరణ
 
 
రెండు దశల్లో మూసీ స్కైవే

ఎస్సార్డీపీ పనుల్ని నాలుగు దశల్లో చేయనున్నారు. తొలి దశలోని కొన్ని పనులకు టెండర్లు పూర్తయ్యాయి. తొలి దశలో 18 జంక్షన్లు, రెండో దశలో మూసీ స్కైవే 2 దశలు, మూడో దశలో ఆరు కారిడార్లు, నాలుగో దశలో 9 కారిడార్లున్నాయి
మూసీ తొలి దశలో నాగోల్ నుంచి రింగ్ రోడ్డు పడమర వరకు స్కైవే (25.5 కి.మీ.), తూర్పు నుంచి నాగోల్ వరకు రేడియల్ రోడ్డు (15.5 కి.మీ)
రెండో దశలో రింగ్ రోడ్డు తూర్పు నుంచి నాగోల్ వరకు స్కైవే (15.5కి.మీ)
తొలి దశకు రూ.5,916 కోట్లు, రెండో దశకు రూ.1,859 కోట్లు... మొత్తం రూ.7,775 కోట్ల వ్యయం

మరిన్ని వార్తలు