హైదరాబాద్ లో గాలివాన బీభత్సం

15 May, 2016 08:47 IST|Sakshi

హైదరాబాద్: వారంరోజుల కిందటి వర్ష బీభత్సం నుంచి నగరం ఇంకా తేరుకోకముందే శనివారం రాత్రి హైదరాబాద్ అంతటా గాలివాన చిన్నపాటి విలయాన్ని సృష్టించింది. ఉదయం నుంచి ఎండ నిప్పులు కురిపించగా, సాయంత్రం వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. రాత్రి 9:30 నుంచి ఉరుములు, మెరుపులతో మొదలై భారీ వర్షం కురిసింది. బలమైన ఈదురు గాలులతో ధాటికి చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. పలు ప్రాంతాల్లో గంటల తరబడి విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. వర్షపు నీటితో రహదారులు జలమయమయ్యాయి.

సెక్రటేరియట్ కు సమీపంలోని ఎన్టీఆర్ గార్డెన్స్ ముందు హైమాస్ లైట్ స్తంభం రోడ్డుకు అడ్డంగా ఒరిగిపోవడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పాడింది. రామంతాపూర్‌లోని ఇందిరానగర్ వద్ద ఓ చెట్టుపై పిడుగుపడి సగానికి కాలిపోయింది. సికింద్రాబాద్ నామాలగుండు వద్ద చెట్లు కూలి విద్యుత్ స్తంభంపై పడడంతో ట్రాన్స్‌ఫార్మర్‌నుంచి మంటలు లేచాయి. ఇక ఎల్‌బీనగర్, ఉప్పల్, అంబర్‌పేట్, ఈసీఐఎల్,తార్నాక, సికింద్రాబాద్, హిమాయత్‌నగర్ , జూబ్లీహిల్స్,బంజారాహిల్స్, అమీర్‌పేట్,కూకట్‌పల్లి, మియాపూర్, గచ్చిబౌలి,తదితర ప్రాంతాల్లో కుంభవృష్టి కురిసింది.

 

రోడ్లు,లోతట్టు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరింది. వంద ఫీడర్ల పరిధిలో కరెంట్ సరఫరా నిలిచిపోయినట్లు విద్యుత్ అధికారులు తెలిపారు. శనివారం వీకెండ్ కావడంతో కాలక్షేపం కోసం బయటకు వెళ్లిన న గరవాసులు తిరిగి ఇళ్లకు చేరుకొనేందుకు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది. ఇలా ఉండగా, శనివారం పగలంతా భానుడు తీవ్ర ప్రతాపం చూపాడు.మధ్యాహ్నం 41.6 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 28.7 డిగ్రీలుగా కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. భానుడి భగభగలతో జనం ఇళ్ల నుంచి బయటకు రాలేకపోయారు.దీంతో మధ్యాహ్నం పలు ప్రాంతాల్లో రోడ్లు నిర్మానుష్యంగా కనిపించాయి.
 

మరిన్ని వార్తలు