హైదరాబాద్‌.. హెరిటేజ్‌ నగరం

11 Jul, 2017 02:06 IST|Sakshi
హైదరాబాద్‌.. హెరిటేజ్‌ నగరం
తీర్చిదిద్దుతామన్న మంత్రి కేటీఆర్‌
 
హైదరాబాద్‌: హైదరాబాద్‌ నగరాన్ని హెరిటేజ్‌ సిటీ, లివబుల్‌ సిటీగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర మంత్రి కె.తారక రామారావు అన్నారు. గోల్కొండ కుతుబ్‌షాహీ సమాధుల సమీపంలో ఏర్పాటు చేసిన దక్కన్‌ పార్క్‌ను కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయతో కలసి ఆయన సోమవారం ప్రారంభించారు. నగరానికి వచ్చే పర్యాటకుల సంఖ్య ఏటేటా పెరుగుతున్నదని, దీనికి అనుగుణంగా నగరంలోని చారిత్రక కట్టడాలను సుందరీకరించేందుకు ప్ర యత్నిస్తున్నామని కేటీఆర్‌ అన్నారు. రూ. 100 కోట్లతో కులీ కుతుబ్‌షాహీ సమాధులను సుందరీకరిస్తున్నామన్నారు. 20 ఎకరాల్లో రకరకాల పచ్చని చెట్లతో ఉన్న దక్కన్‌ పార్క్‌లో మంగళవారం నుంచి మార్నింగ్‌ వాకర్స్‌కు అనుమతిస్తున్నామన్నారు.

నిజాం కాలంలో హైదరాబాద్‌ ప్రపంచ ఖ్యాతిగాంచిందని, సీఎం కేసీఆర్‌ హయాంలో మళ్లీ ఇప్పుడు హైదరాబాద్‌ పునర్‌వైభవం పొందుతున్నదని చెప్పారు. కేంద్రమంత్రి దత్తాత్రేయ మాట్లాడుతూ మహబూబ్‌నగర్, ఆదిలాబాద్, వరంగల్‌ను టూరిస్ట్‌ సర్క్యూట్‌గా ఏర్పాటు చేశామని, దీని అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం రూ.500 కోట్లు కేటాయించిందన్నారు. కుతుబ్‌షాహీ సమాధుల సుందరీకరణకు రూ. 99 కోట్లు కేటాయించిందని చెప్పారు. హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ మాట్లాడుతూ హైదరాబాద్‌లో గ్రీన్‌ కవరేజ్‌ను 12 శాతానికి పెంచా లని, హైదరాబాద్‌ను వారసత్వ కట్టడాల నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నించాలని ప్రభుత్వాన్ని కోరారు.

అనంతరం మం త్రులు గోల్కొండ కోట సమీపంలోని కఠోరహౌస్‌ను సందర్శిం చారు. కఠోరహౌస్‌ అభివృద్ధికి తగిన ప్రణాళికను సిద్ధం చేయాలని అధికారులకు కేటీఆర్‌ సూ చించారు. చారిత్రక కట్టడాలు, ప్రదేశాల పరిరక్షణ కోసం కలిసికట్టుగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. దక్కన్‌ పార్క్‌లో మంత్రి కేటీఆర్‌ స్వచ్ఛమైన ఉర్దూలో ప్రసంగించి ఆకట్టుకున్నారు. కార్యక్రమంలో నగర మేయర్‌ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్‌ బాబా ఫసీయుద్దీన్, ఎమ్మెల్యేలు కౌసర్‌ మొహియుద్దీన్, మాగంటి గోపినాథ్, సాయన్న, ఎమ్మెల్సీ ప్రభాకర్, బల్దియా కమిషనర్‌ జనార్దన్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 
 
హైదరాబాద్‌ స్థాయిలో అభివృద్ధి
రాష్ట్రంలోని మునిసిపల్‌ కార్పొరేషన్లను రాజధాని హైదరాబాద్‌ నగర స్థాయికి అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో పనిచేస్తామని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు పేర్కొన్నారు. సీఎం చంద్రశేఖర్‌రావు నిర్దేశించిన మార్గదర్శకాల మేరకు మునిసిపల్‌ కార్పొరేషన్లలో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. పెరుగుతున్న పట్టణీకరణ అవసరాలకు తగ్గట్లు మౌలిక సదుపాయాలు, అభివృద్ధి కార్యక్రమాల అమలు విషయంలో ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. సోమవారం హైదరాబాద్‌ మెట్రో రైల్‌ భవనంలో రాష్ట్రంలోని కార్పొరేషన్ల మేయర్లు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్లు, మునిసిపల్‌ కమిషనర్లతో మంత్రి కేటీఆర్‌ సమీక్ష నిర్వహించారు.

వరంగల్, ఖమ్మం, కరీంనగర్, నిజామాబాద్, రామగుండం నగరాల్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను సమీక్షిం చారు. మార్కెట్లు, పార్కులు, కమ్యూనిటీ హాళ్లు, స్మశానాలు వంటి మౌలిక సదుపాయాల కల్పనతోపాటు రోడ్ల అభివృద్ధి, నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులు, ప్రజాప్రతినిధులకు సూచించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ మునిసిపల్‌ కార్పొరేషన్ల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించారని, నిధులను పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలన్నారు. వరంగల్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌కు రెండు విడతల్లో మొత్తం రూ.600 కోట్లు, ఇతర కార్పొరేషన్లకు రూ.100 కోట్లు చొప్పున కేటాయించామన్నారు. కార్పొరేషన్లలో పారిశుద్ధ్య కార్యక్రమాల నిర్వహణలో లోపాలపై మంత్రి అధికారులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రజలను చైతన్యవంతం చేయాలన్నారు. ఈ సమావేశంలో ఎంపీలు కల్వకుంట్ల కవిత, దయాకర్, బాల్క సుమన్, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యేలు తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని వార్తలు