జీహెచ్‌ఎంసీ తీరుపై హైకోర్టు ఆక్షేపణ...

19 Nov, 2014 02:26 IST|Sakshi
జీహెచ్‌ఎంసీ తీరుపై హైకోర్టు ఆక్షేపణ...

* అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవడంలేదు
* జరిమానా విధించి చేతులు దులుపుకుంటున్నారు
* జీహెచ్‌ఎంసీ డిప్యూటీ కమిషనర్‌పై హైకోర్టు ఆగ్రహం
* రూ.5 వేల జరిమానా.. పిటిషనర్‌కు చెల్లించాలని ఆదేశం

సాక్షి, హైదరాబాద్: ప్రణాళికాబద్ధంగా నగరాన్ని అభివృద్ధి చేస్తామంటూ ప్రకటనలు చేస్తున్న అధికారులు, వాస్తవంగా అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని హైకోర్టు ఆక్షేపించింది. అక్రమ నిర్మాణాల గురించి తెలిసి కూడా... వాటిపై 25 శాతం జరిమానా విధిస్తూ, అక్రమ నిర్మాణాలు యథాతథంగా ఉండేలా చేస్తున్నారంటూ గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) అధికారులపై మండిపడింది. ఓ అక్రమ నిర్మాణం గురించి తెలిసి కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు జీహెచ్‌ఎంసీ డిప్యూటీ కమిషనర్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది.  మంజూరు చేసిన ప్లాన్‌కు విరుద్ధంగా నిర్మించిన కట్టడాన్ని చట్ట ప్రకారం కూల్చి వేయాలని జీహెచ్‌ఎంసీని ఆదేశించింది.

విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు డిప్యూటీ కమిషనర్‌కు, అక్రమ నిర్మాణం చేసిన వ్యక్తికి చెరో రూ.5 వేల జరిమానా విధించింది. ఈ మొత్తాన్ని పిటిషనర్‌కు చెల్లించాలని ఇరువురినీ ఆదేశించింది. అలాగే డిప్యూటీ కమిషనర్‌పై శాఖాపరమైన చర్యలు తీసుకునే విషయాన్ని కూడా పరిశీలించాలని కమిషనర్‌కు స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఎంఎస్ రామచంద్రరావు సోమవారం తీర్పు వెలువరించారు. హైదరాబాద్‌కు చెందిన పి.దేవేందర్ హస్తినాపురం సౌత్ వద్ద పర్వతమ్మ ఎన్‌క్లేవ్‌లో 222 గజాల స్థలాన్ని కొన్నారు. ఈయన స్థలం పక్కనే నర్సింహరావు అనే వ్యక్తికి కూడా 222 గజాల స్థలం ఉంది.

ఈ స్థలంలో గ్రౌండ్ ప్లస్ ఫస్ట్ ఫ్లోర్ నిర్మాణానికి నర్సింహారావు అనుమతులు పొందారు. అయితే మంజూరు చేసిన ప్లాన్‌కు విరుద్ధంగా గ్రౌండ్ ఫ్లోర్‌తో పాటు మరో రెండు అంతస్తులు, దానిపై పెంట్ హౌస్ నిర్మిస్తున్నారని, నిబంధనల ప్రకారం సెట్ బ్యాక్ కూడా వదలడం లేదంటూ దేవేందర్ జీహెచ్‌ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేశారు. పెంట్ హౌస్‌పై సెల్‌టవర్ కూడా ఏర్పాటు చేశారని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే అధికారులు స్పందించకపోవడంతో దేవేందర్ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాక అక్రమ నిర్మాణాలను నిలుపుదల చేయాలని, సెల్ టవర్‌ను తొలగించాలని అధికారులు నర్సింహారావుకు నోటీసులు పంపారు.

పూర్తిస్థాయిలో వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ ఎంఎస్ రామచంద్రరావు ఈ మొత్తం వ్యవహారంలో జీహెచ్‌ఎంసీ డిప్యూటీ కమిషనర్ వ్యవహారశైలిని తప్పుపట్టారు. అక్రమ నిర్మాణాలని తెలిసి కూడా 25 శాతం జరిమానా విధించి చట్టప్రకారం నిర్వర్తించాల్సిన బాధ్యతల నుంచి తప్పుకుంటున్నారని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. అలాగే, ప్లాన్‌కు విరుద్ధంగా నర్సింహారావు అదనపు అంతస్తులు నిర్మించి, సెల్‌టవర్ ఏర్పాటు చేసినా కూడా పట్టించుకోలేదన్నారు. ‘నగరాన్ని ప్రణాళికబద్ధంగా అభివృద్ధి చేస్తామని అధికారులు ఓ వైపు చెబుతూనే, మరోవైపు అక్రమ నిర్మాణాలను జరిమానా విధించి యథాతథంగా ఉంచుతున్నారు.

ఈ కేసులో కూడా నర్సింహారావుతో జీహెచ్‌ఎంసీ అధికారులు కుమ్మక్కు కావడం వల్లే అక్రమ నిర్మాణం వెలిసింది. అందువల్ల నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన అదనపు అంతస్తులను కూల్చివేయాలి. అంతేకాక కేసులో డిప్యూటీ కమిషనర్ వ్యవహరించిన తీరును పరిగణనలోకి తీసుకుంటూ అతనిపై శాఖాపరమైన చర్యలు తీసుకునే విషయాన్ని కమిషనర్ పరిశీలించాలి.’ అని న్యాయమూర్తి తన తీర్పులో పేర్కొన్నారు. డిప్యూటీ కమిషనర్‌కు, నర్సింహారావుకు చెరో రూ.5 వేల జరిమానా విధిస్తూ, ఆ మొత్తాన్ని పిటిషనర్‌కు చెల్లించాలని ఆదేశించారు.

మరిన్ని వార్తలు