అడ్డగోలుగా ...ఆటో రేటు

15 Jul, 2013 09:48 IST|Sakshi
అడ్డగోలుగా ...ఆటో రేటు


జూబ్లీ బస్‌స్టేషన్ నుంచి సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రికి వెళ్లేందుకు ప్రకాశ్ ఆటోను పిలిచాడు. వంద రూపాయలు అడిగాడు ఆటోడ్రైవర్. ప్రకాశ్‌కు దిమ్మతిరిగింది. సిటీబస్సులో వెళితే రూ.10 కంటే ఎక్కువ ఉండదు. ఆటోలో వెళ్లినా మీటర్‌పై అయితే రూ. 40 కంటే ఎక్కువ కాదు. అయినా అప్పటికప్పుడు బస్సుల్లేక, మరో గత్యంతరం లేక, చివరకు ఎనభైకి బేరం కుదుర్చుకొని ఆటో ఎక్కాడు.

సిటీ ఆటోవాలాల నిలువుదోపిడీకి ఇదో మచ్చుతునక. ప్రకాశే కాదు గ్రేటర్‌లో ప్రతిరోజు ప్రతిక్షణం లక్షలాది మంది ప్రయాణికులు ఆటోడ్రైవర్ల చేతిలో దోపిడీకి గురవుతూనే ఉన్నారు. ప్రయాణికుల ఆపదలు, అవసరాలను ఆసరా చేసుకొని ఆటోడ్రైవర్‌లు మీటర్ రీడింగ్‌లతో నిమిత్తం లేకుండా ఇష్టారాజ్యంగా వసూళ్లకు దిగుతున్నారు.

మహాత్మాగాంధీ, జూబ్లీ, దిల్‌సుఖ్‌నగర్, తదితర బస్‌స్టేషన్‌లు, కాచిగూడ, నాంపల్లి, సికింద్రాబాద్ వంటి రైల్వేస్టేషన్‌లు, గాంధీ, ఉస్మానియా, నిలోఫర్ వంటి ఆసుపత్రుల్లో ఆటోడ్రైవర్లు వ్యవస్థీకృత దోపిడీకి పాల్పడుతున్నారు. మరోవైపు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ప్రీపెయిడ్ ఆటో ఇంకా ప్రయాణికులకు చే రువ కానేలేదు. ప్రీపెయిడ్ పై సరైన అవగాహన లేకపోవడం వల్ల చాలామంది బయటి ఆటోలను ఆశ్రయిస్తున్నారు. ఈ ఆటోలు యథావిధిగా తమ దోపిడీ కొనసాగిస్తున్నాయి. రాత్రివేళల్లో, తెల్లవారుజామున మోసాలు మరింత దారుణంగా కొనసాగుతున్నాయి.

మీటర్లకు చెల్లుచీటీ..

పెరుగుతున్న నిత్యావసర వస్తువులు, పెట్రోల్ ధరలను దృష్టిలో ఉంచుకొని ఆటోసంఘాల డిమాండ్ మేరకు ప్రభుత్వం మీటర్ చార్జీలను పెంచింది. 1.6 కిలోమీటర్ల కనిష్ట దూరానికి రూ.14 నుంచి రూ.16లకు, ఆ తరువాత ప్రతి కిలోమీటర్‌కు రూ.8 నుంచి రూ.9లకు చార్జీలు పెంచారు. నిబంధనల ప్రకారం ప్రయాణికులు ఎక్కగానే మీటర్ వేయాలి.

 

రీడింగ్ ప్రకారం చార్జీ తీసుకోవాలి. పైగా ప్రయాణికులు కోరిన చోటకు రావాలి. కానీ ఈ నిబంధనలు ఎక్కడా అమలుకు నోచుకోవడం లేదు. తనకు గిట్టుబాటు అనుకుంటేనే డ్రైవర్ కదులుతాడు. పైగా మీటర్‌తో సంబంధం లేకుండా అడిగినంత ఇచ్చేందుకు అంగీకరిస్తేనే ఆటో రోడ్డెక్కుతుంది. ఆపదలో ఉన్న ప్రయాణికులపై ఆటోడ్రైవర్ల జులుం మరింత దారుణంగా ఉంటుంది. ఎంజీబీఎస్, జూబ్లీ వంటి బస్‌స్టేషన్‌ల వద్ద కొందరు రౌడీలు, గూండాలు ఆటోడ్రైవర్‌ల రూపంలో మోహరించి ప్రయాణికులను జలగల్లా పీడిస్తున్నారు.

అదే దారిలో ప్రీపెయిడ్..

ఏడాది కిందట ప్రవేశపెట్టిన ప్రీపెయిడ్ ఆటో ఇప్పటికీ ప్రయాణికులకు చేరువ కాలేదు. ప్రయాణికుల డిమాండ్‌కు తగిన విధంగా ట్రాఫిక్ పోలీసులు ఆటోలను ఏర్పాటు చేయలేకపోవడం ఒక కారణమైతే, ప్రీ పెయిడ్ సేవల కు ఆటోడ్రైవర్లు నిరాకరించడం మరో కార ణం. మరోవైపు ఏళ్లకు ఏళ్లుగా సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌ను అడ్డాగా చేసుకొన్న కొంతమంది ఆటోడ్రైవర్లు ప్రీపెయిడ్‌కు పాతరేసి యథావి దిగా ప్రయాణికులపై నిలువుదోపిడీకి పాల్పడుతున్నారు. అధికారులు ఈ సర్వీసులకు విస్తృత ప్రచారం కల్పిడంలో విఫలమయ్యారు. దీంతో ప్రయాణికులు వీటిని పూర్తిస్థాయిలో వినియోగించుకోలేకపోతున్నారు. రైల్వేస్టేషన్ చుట్టూ ఉన్న 3 కిలోమీటర్ల పరిధిలో సాధారణ ఆటో సర్వీసులను నిలిపివేసి పూర్తిగా ప్రీపెయిడ్ ఆటోలనే అమలు చేయాలనే నిబంధన కూడా అమలుకు నోచుకోవడం లేదు.

యథేచ్ఛగా ట్యాంపరింగ్

రవాణా, ట్రాఫిక్, తూనికలు-కొలతలు శాఖ అధికారుల నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యం లక్షలాదిమంది ప్రయాణికుల పాలిట శాపంగా మారింది. చార్జీలు పెంచిన అనంతరం 3 నెలల్లో ఆటోమీటర్లకు సీళ్లు వేయనున్నట్లు ప్రకటించిన ఆర్టీఏ అధికారులు.. ఇప్పటివరకు ఆ పని పూర్తిచేయలేదు. గ్రేటర్‌లో సుమారు లక్షా 10 వేల ఆటోలు తిరుగుతుండగా ఇప్పటివరకు 50 వేల ఆటోలకు కూడా మీటర్ సీళ్లు వేయలేకపోయినట్లు అంచనా.

మరోవైపు ఆటోవాలాల మీటర్ ట్యాంపరింగ్ కూ అడ్డూఅదుపు లేకుండా పోయింది. వీరి మోసాలపై ప్రయాణికుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తినప్పటికీ ఆర్టీఏ అధికారులు పట్టించుకోవడం లేదు. ట్రాఫిక్ పోలీసులు తరచుగా దాడులు చేసి కేసులు, జరిమానాలు విధించినప్పటికీ.. ఆటోడ్రైవర్లలో మార్పు రావడం లేదు.

మరిన్ని వార్తలు