బ్యాంక్ అధికారినంటూ బకరా చేశాడు..!

28 Nov, 2016 18:58 IST|Sakshi
బ్యాంక్ అధికారినంటూ బకరా చేశాడు..!

"హలో.. నేను బ్యాంకు నుంచి మాట్లాడుతున్నాను. మీకు వచ్చిన వన్ టైం పాస్ వర్డ్ చెప్పండి' అంటూ ఓ మోసగాడు చిరు ఉద్యోగిని నమ్మించి కుచ్చుటోపీ పెట్టాడు. ఉద్యోగి బ్యాంకు అకౌంట్ నుంచి రూ.51 వేలు వేరే ఖాతాకు మళ్లించాడు. బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఫిలింనగర్‌లోని జ్ఞానిజైల్‌సింగ్ నగర్‌లో నివసించే ఎం.గిరి ప్రైవేటు ఉద్యోగి. ఆదివారం ఉదయం ఫిలింనగర్‌లోని పంజాబ్ నేషనల్ బ్యాంకు నుంచి మాట్లాడుతున్నానంటూ ఓ అపరిచితుడు ఫోన్ చేశాడు. మీ అకౌంట్ ఇక్కడే ఉందని, కాబట్టి 'వన్ టైమ్ పాస్‌వర్డ్' చెప్పాలని కోరాడు. ఆ తర్వాత మెసేజ్ కూడా పెట్టాడు. దీంతో అతను బ్యాంకు ఉద్యోగి అని నమ్మిన గిరి పాస్‌వర్డ్ ను తెలిపాడు.

కొద్దిసేపట్లోనే వరుసగా మూడుసార్లు అతని అకౌంట్ నుంచి రూ.51 వేలు డ్రా అయ్యాయి. డ్రా చేసిన వ్యక్తి జార్ఖండ్ నుంచి లావాదేవీలు నిర్వహించినట్లు తేలింది. మోసపోయానని తెలుసుకున్న బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎట్టిపరిస్థితుల్లోనూ ఫోన్ కాల్స్‌లో, ఈమెయిళ్లలో, మెసేజ్‌లలో అగంతకులకు వన్‌ టైమ్‌ పాస్‌వర్డ్‌, ఇతర బ్యాంకు వివరాలు తెలుపకూడదని నిత్యం బ్యాంకులు ఖాతాదారులను అప్రమత్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు పెద్దనోట్ల రద్దు నేపథ్యం డిజిటల్‌ మోసాలు పెరిగిపోయే అవకాశముండటంతో బ్యాంకు ఖాతాదారులు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరముంది.
 

మరిన్ని వార్తలు