స్టేట్‌బ్యాంక్ పేరుతో ఫేక్ మెయిల్స్.. జాగ్రత్త!

6 Apr, 2017 12:25 IST|Sakshi
స్టేట్‌బ్యాంక్ పేరుతో ఫేక్ మెయిల్స్.. జాగ్రత్త!

మీరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతాదారులా? మీకు ఆన్‌లైన్ అకౌంటు కూడా ఉందా? అయితే కాస్తంత జాగ్రత్తగా ఉండండి. ఆన్‌లైన్ ఎస్‌బీఐ అనేది అందరికీ బాగా తెలిసిన సైటే. అయితే, అచ్చం ఇదే పేరు పోలి ఉండేలా ఒక ఫేక్ మెయిల్ ప్రస్తుతం చాలా మంది కస్టమర్లకు వెళ్తున్నట్లు తెలిసింది. ఇలాంటి ఫేక్ మెయిల్స్ విషయంలో అప్రమత్తంగా ఉండాలని, వీళ్ల వలలో పడొద్దని హైదరాబాద్ అదనపు పోలీసు కమిషనర్ (క్రైమ్స్) స్వాతి లక్రా ట్విట్టర్ ద్వారా తెలిపారు. దీనికి సంబంధించి ఒక స్క్రీన్ షాట్‌ను కూడా ఆమె షేర్ చేశారు. అందులో అచ్చం స్టేట్‌బ్యాంకు నుంచే వచ్చినట్లుగా ఉన్న మెయిల్ కనిపిస్తుంది. స్టేట్‌బ్యాంక్ లోగో కూడా ఉంటుంది.

తమ బ్యాంకు ఐటీ వ్యవస్థను అప్‌గ్రేడ్ చేస్తున్నామని చెబుతూ, మీ రికార్డులను కూడా అప్‌డేట్ చేసుకోవాల్సి ఉంటుందని, అందుకోసం ఈ లింకును క్లిక్ చేయాలని సూచిస్తూ ఒక లింకు పెడుతున్నారు. అందులో onlinesbi.me అనేది కనిపిస్తోంది. అలాగే, customercare@onlinesbi.me అనే మెయిల్ ఐడీని కూడా వైట్ లిస్ట్ / సేఫ్ సెండర్స్ లిస్టులో యాడ్ చేసుకోవాలని ఆ మెయిల్‌లో ఉంటోంది. అంటే, ఫేక్ మెయిల్ నుంచి వచ్చినవి స్పాంలోకి వెళ్లిపోకుండా నేరుగా ఇన్‌బాక్సులోకి వచ్చేలా మనంతట మనమే చేసుకునేలా ఈ సైబర్ నేరగాళ్లు మనల్ని వాళ్ల వలలోకి లాక్కుంటారన్న మాట. అలా చేయకపోతే ఇక మీదట ఎలాంటి అప్‌డేట్స్ రాకుండా మెయిల్ బాక్స్ ఫిల్టర్ లేదా ఐఎస్‌పీ ఫిల్టర్ ఆపేస్తాయని కూడా హెచ్చరిస్తున్నారు. ఇలాంటి మోసగాళ్ల బారిన పడి, పొరపాటున వాళ్లు పంపిన లింకును క్లిక్ చేసినా, లేదా ఆ మెయిల్‌ను నాట్ స్పాం అని పెట్టినా ఇక మన పని అయిపోయినట్లే. కాబట్టి తస్మాత్ జాగ్రత్త!

 

 

మరిన్ని వార్తలు