రిక్షాలో దర్జాగా తిరిగేవాళ్లం..

24 Jan, 2016 02:26 IST|Sakshi
రిక్షాలో దర్జాగా తిరిగేవాళ్లం..

జ్ఞాపకం
గొల్లపూడి మారుతీరావు.. పరిచయం అక్కరలేని ప్రముఖ రచయిత, గొప్ప నటుడు. కాలమిస్టు. భాగ్యనగరంతో ఆయనది 64 ఏళ్ల బంధం. ఇక్కడ జరిగిన ప్రతి మార్పును దగ్గర నుంచి చూసిన వ్యక్తి. ఆ జ్ఞాపకాల దొంతరలను ‘సాక్షి’తో పంచుకున్నారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే..
- సాక్షి, సిటీబ్యూరో


‘విసిరేసినట్లు జనం..!
విపరీత చలి..
సాయంత్రమైతే నక్కల అరుపులు..

దాదాపు 40 ఏళ్ల క్రితం వరకు హైదరాబాద్ ఓ పల్లె వాతావరణాన్ని తలపించేది. ఇప్పుడు మహానగరంగా మారిపోయింది.
1952లో నాకు 12 ఏళ్ల వయసులో తొలిసారి హైదరాబాద్ వచ్చాను. పంజగుట్టలో నా బాల్య స్నేహితుల ఇళ్లు ఉండేది. అక్కడకు వచ్చేవాడిని. అప్పుడు బిక్కు బిక్కు మనేలాంటి పరిస్థితి. అక్కడక్కడ విసిరేసినట్టుగా జనం కన్పించేవారు. మడతలో కూర్చొని ప్రయాణించే రిక్షాలు రవాణా సాధనాలు. అప్పుడు లక్డీకాపూల్ చిన్న సెంటర్‌లా ఉండేది. తర్వాత ఖైరతాబాద్ ఉన్నట్టు లేనట్టు కన్పించేది. ఖైరతాబాద్‌కు ఎడమవైపు పెద్ద పెద్ద గుట్టలు దర్శనమిచ్చేవి.

పంజగుట్ట ఎత్తు భాగంలోని ప్రస్తుత శ్రీనగర్ కాలనీ రోడ్డులో మా మిత్రుని ఇల్లు చివరగా ఉండేది. ఆ తర్వాత ఎటు చూసినా ఖాళీ ప్రదేశమే. అమీర్‌పేట, మైత్రీవనం, భరత్ నగర్ ఇవేమీ అప్పటికి లేవు. అక్కడక్కడ చిన్నచిన్న పల్లెలు మాత్రమే ఉండేవి. సాయంత్రం 4 దాటిందంటే నక్కల అరుపులు విపరీతంగా వినిపించేవి. కొత్తవాళ్లు జడుసుకునే వారు. ఇప్పటి జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ప్రాంతాలు లేవు. ఆ ప్రాంతమంతా కొండలే. పక్షుల కిలకిల రావాలు వినసొంపుగా వినిపించేవి. పిచ్చుకలు, గువ్వల సవ్వడులు ప్రతిధ్వనించేవి.
 
40 ఏళ్ల తర్వాత..
సుమారు 40 ఏళ్ల క్రితం మద్రాసు నుంచి అక్కినేని నాగేశ్వరరావు వచ్చి ఇక్కడ అన్నపూర్ణ స్టూడియో నిర్మించారు. అప్పటికి బంజారాహిల్స్‌కు కొంత రాకపోకలు ప్రారంభమయ్యాయి. ఉదయం, సాయంత్రం విపరీతమైన చలి ఉండేది. పంజగుట్ట నుంచి ఇప్పటి బంజారాహిల్స్, అమీర్‌పేట, హుస్సేన్‌సాగర్ వైపు చూస్తే పచ్చని పొలాలతో చూడచక్కని నిర్మానుష్య ప్రాంతం. కార్లు ఎక్కడా కనిపించేవి కావు. దూరప్రాంతాలకు రిక్షాలే దిక్కు. వాటిలో దర్జాగా కాలుమీద కాలు వేసుకొని కూర్చొని ప్రయాణించే అమరిక ఉండేది.

రిక్షాలు చాలా పొడవుగా ఉండేవి. పబ్లిక్‌గార్డెన్ ఒక ఆకు పచ్చని మహావనం. ఇప్పటి మారుమూల ఏజెన్సీ ప్రాంతాలను తలపించే వాతావరణం హైదరాబాద్ సొంతం. చల్లటి, సుందర, ప్రశాంత నగరం మన హైదరాబాద్. ఎంత మధురంగా ఉండేదో వర్ణించలేను. ఆ వాతావరణాన్ని మళ్లీమళ్లీ ఆస్వాదిద్దామా! అన్నట్టు మనసు పులకించేది. ఆ చల్లటి వాతావరణం గుర్తు చేసుకుంటే ఇప్పుడు కూడా మనసు పులకిస్తుంది. ఇప్పుడు ఆ పచ్చదనం పోయి జనం మహావృక్షంలా పెరిగిపోయారు. నగరం మెట్రో స్థాయికి చేరింది’.

మరిన్ని వార్తలు