అమెరికాలో హైదరాబాదీ దారుణ హత్య

20 Jul, 2016 07:05 IST|Sakshi
అమెరికాలో హైదరాబాదీ దారుణ హత్య

నిందితుడూ నగరవాసే.. టెక్సాస్ రాజధాని అస్టిన్‌లో ఘటన
అస్టిన్‌లో ఉద్యోగం చేస్తున్న సంకీర్త్
ఆయన రూమ్‌లో 15 రోజుల క్రితమే చేరిన సందీప్
ఆదివారం ఇద్దరి మధ్య గొడవ.. సోమవారం తెల్లవారుజామున సంకీర్త్‌ను కత్తితో పొడిచిన సందీప్
ఆసుపత్రికి తీసుకువెళ్లినా దక్కని ఫలితం
మరో రూమ్‌మేట్ ద్వారా మృతుడి తల్లిదండ్రులకు సమాచారం.. నిందితున్ని అరెస్టు చేసిన పోలీసులు


సాక్షి, హైదరాబాద్: అమెరికాలో హైదరాబాద్ యువకుడొకరు మరో హైదరాబాదీ చేతిలో దారుణ హత్యకు గురయ్యాడు. రూమ్‌మేట్ చేతిలోనే కత్తిపోట్లకు గురై కన్నుమూశాడు. సోమవారం తెల్లవారుజామున టెక్సాస్ రాజధాని అస్టిన్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. హైదరాబాద్‌లోని కుద్బిగూడకు చెందిన గుండం సంకీర్త్ (24) రెండున్నరేళ్ల క్రితం ఎంఎస్ చదివేందుకు అమెరికా వెళ్లాడు. చదువు పూర్తి చేసి అక్కడే ఉద్యోగం చేస్తున్నాడు. 15 రోజుల కిందటే సంకీర్త్ రూమ్‌లో హైదరాబాద్‌కు చెందిన కుర్రెముల సాయి సందీప్‌గౌడ్ (27) చేరాడు. ఆదివారం వీరిరువురి మధ్య చిన్నపాటి గొడవ జరిగింది. సోమవారం తెల్లవారుజామున సందీప్.. సంకీర్త్‌ను కత్తితో పొడిచి పారిపోయాడు. అనంతరం అక్కడి పోలీసులు సందీప్‌ను అరెస్ట్ చేశారు. హత్య కేసు నమోదు చేసి ట్రావీస్ జైలుకు తరలించారు.
 
 ప్రభుత్వ ఉద్యోగం.. హెచ్-1 వీసా..
 మెదక్ జిల్లా నర్సాపూర్‌కు చెందిన గుండం విజయ్‌కుమార్, రమాదేవి వైద్య, ఆరోగ్య శాఖలో అధికారులుగా పనిచేస్తూ కాచిగూడ కుద్బిగూడలో నివసిస్తున్నారు. వీరికి ఒక కుమారుడు, ఒక కుమార్తె. పెద్దవాడైన సంకీర్త్ రెండున్నరేళ్ల కిందటే అమెరికా వెళ్లాడు. యూనివర్సిటీ ఆఫ్ న్యూ హెవెన్‌లో ఎంఎస్ పూర్తి చేసి ఇటీవల ప్రభుత్వ ఉద్యోగంతోపాటు హెచ్-1 వీసా పొందాడు. అస్టిన్‌లోని కొలోనియల్ విలేజ్‌లోని క్యూరీ ఓక్స్ అపార్ట్‌మెంట్‌లో హైదరాబాద్‌కు చెందిన మరో యువకుడు ప్రణీత్‌తో కలసి ఉంటున్నాడు.

గతేడాది డిసెంబర్‌లో ఇంటికి వచ్చి వెళ్లిన సంకీర్త్.. ప్రతిరోజూ స్కైప్ ద్వారా కుటుంబీకులతో మాట్లాడుతుంటాడు. అయితే సోమవారం మాట్లాడకపోవడంతో తల్లిదండ్రులు కొంత ఆందోళనకు గురయ్యారు. మంగళవారం ఉదయం 7.30 గంటలకు ప్రణీత్.. సంకీర్త్ కుటుంబ సభ్యులకు ఫోన్ చేశాడు. సంకీర్త్‌కు ప్రమాదం జరిగిందని ఓసారి, కోమాలో ఉన్నాడని మరోసారి చెప్పాడు. ఆపై కొద్దిసేపటికి హత్యకు గురయ్యాడని చెప్పడంతో కుటుంబీకులు షాక్‌కు గురయ్యారు. వెంటనే అమెరికాలోని తమ పరిచయస్తులతో వాకబు చేశారు. వారు అక్కడి పత్రికల్లో ప్రచురితమైన హత్య వార్తలోని వివరాలు చదివి చెప్పడంతో సంకీర్త్ కుటుంబీకులు కుప్పకూలారు.
 
 నివసిస్తున్న రూమ్‌లోనే హత్య
 ఓ కన్సల్టెన్సీ ద్వారా అమెరికా వెళ్లిన సాయి సందీప్ 15 రోజులు క్రితం సంకీర్త్ రూంలో చేరాడు. సందీప్, సంకీర్త్ మధ్య ఆదివారం మధ్యాహ్నం చిన్న గొడవ జరిగిందని అక్కడి పోలీసులు చెప్పినట్లు కుటుంబ సభ్యులు చెప్తున్నారు. గదిలో సంకీర్త్, ప్రణీత్, సాయి సందీప్ ఆ రాత్రి నిద్రకు ఉపక్రమించారు. అమెరికా కాలమానం ప్రకారం సోమవారం తెల్లవారుజామున 3.51 గంటలకు (భారత కాలమానం ప్రకారం సాయంత్రం 4 గంటలు) సంకీర్త్‌ను సాయి సందీప్ కత్తితో పొడిచాడు. అలికిడి విన్న ప్రణీత్ నిద్రలేవడంతో సాయి సందీప్ పారిపోయాడు. వెంటనే సంకీర్త్‌ను రౌండ్ రాక్ ఆస్పత్రికి తరలించినా అప్పటికే చనిపోయాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సాయి సందీప్‌ను అదుపులోకి తీసుకున్నారు. ప్రణీత్‌ను సైతం అదుపులోకి తీసుకుని విడిచిపెట్టారు. ఆ తర్వాత ప్రణీత్ జరిగిన విషయాన్ని మంగళవారం సంకీర్త్ కుటుంబీకులకు ఫోన్ ద్వారా తెలిపాడు.
 
 కుద్భుగూడలో విషాదఛాయలు
 సంకీర్త్ హత్య వార్తతో కాచిగూడ పరిధిలోని కుద్భుగూడలో విషాదఛాయలు అలముకున్నాయి. సంకీర్త్ ఎంతో చురుకైన విద్యార్థి అని స్థానికులు తెలిపారు. బడిచౌడిలోని కేంబ్రిడ్జి స్కూల్‌లో ప్రాథమిక విద్య, నారాయణగూడలోని శ్రీచైతన్య కళాశాలలో ఇంటర్ చదివిన సంకీర్త్.. నాదర్‌గుల్‌లోని ఎంవీఎస్‌ఆర్ కాలేజీలో ఇంజనీరింగ్ చదివాడు. పరాయి దేశంలో తెలుగువాడి చేతిలోనే హత్యకు గురయ్యాడని తెలియంతో సంకీర్త్ కుటుంబీకులు దుఃఖసాగరంలో మునిగిపోయారు. తల్లి రమాదేవి ఆరోగ్య దృష్ట్యా ఆమెకు హత్య విషయం తెలియకుండా జాగ్రత్త పడుతున్నారు. ఆమె ముందు బాధ కనిపించకుండా దిగమింగుకుంటున్నారు. సంకీర్త్ తండ్రి విజయ్‌కుమార్ మెదక్ జిల్లా నర్సాపూర్ మాజీ ఎమ్మెల్యే గుండం వీరయ్య కొడుకు కావడం గమనార్హం. ప్రస్తుతం విజయ్ భూదాన్‌పోచంపల్లిలో ప్రభుత్వ ఆస్పత్రిలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు.
 
 మూడో వ్యక్తి ఎవరు?
 ఆదివారం సంకీర్త్, సందీప్ మధ్య గొడవ జరిగిందని చెబుతున్న ప్రణీత్.. తొలుత ఎవరి వల్ల వాగ్వాదం చోటు చేసుకుందన్న అంశాన్ని మాత్రం వెల్లడించట్లేదు. ఈ ఘటన తర్వాత ఇద్దరు వ్యక్తులు మరో వ్యక్తిని కారులోకి తరలిస్తున్నారని, వారి చర్యలు అనుమానాస్పదంగా ఉన్నాయంటూ వీరి అపార్ట్‌మెంట్‌లోనే నివసించేవారు ‘911’ ద్వారా సమాచారం ఇవ్వడంతో అస్టిన్ పోలీసులు రంగంలోకి దిగారు. సంకీర్త్‌ను పొడిచిన తర్వాత సందీప్ పారిపోయాడు. అయితే ప్రణీత్‌తో కలసి సంకీర్త్‌ను కారులోకి తరలించిన మరో వ్యక్తిని గుర్తించడం కోసం అస్టిన్ పోలీసులు యత్నిస్తున్నారు.

మరిన్ని వార్తలు