గ్లోబల్ సిటీగా హైదరాబాద్

25 Jul, 2014 04:24 IST|Sakshi
గ్లోబల్ సిటీగా హైదరాబాద్

రక్షణకు ప్రత్యేక చర్యలు
జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేష్‌కుమార్
‘పబ్లిక్ సేప్టీ
ఎన్‌ఫోర్స్‌మెంట్ యాక్ట్’పై సదస్సు
హాజరైన వివిధ శాఖల అధికారులు
 సనత్‌నగర్:
 ‘మన నగరం-మన రక్షణ-మన బాధ్యత’ నినాదంతో హైదరాబాద్‌ను గ్లోబల్ సిటీగా మార్చే ప్రాజెక్టుకు రూపకల్పన చేసినట్లు జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్ స్పష్టం చేశారు. ప్రతి సిటిజన్ రక్షణ బాధ్యత తనదిగా భావించే విధంగా వినూత్న కార్యక్రమాల రూపకల్పనతో ముందుకు సాగనున్నట్లు చెప్పారు. అమీర్‌పేటలోని సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ స్టడీస్ (సెస్) ఆడిటోరియంలో గురువారం జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో ‘పబ్లిక్ సేప్టీ (మెజర్స్) ఎన్‌ఫోర్స్‌మెంట్ యాక్ట్-2013 అండ్ రూల్స్-2014’పై వర్క్‌షాప్ నిర్వహించారు.

దీనికి జీహెచ్‌ఎంసీ కమిషనర్‌తో పాటు హైదరాబాద్, సైబరాబాద్ పోలీసు కమిషనర్లు మహేందర్‌రెడ్డి, సీవీ ఆనంద్ హాజరయ్యారు. జీహెచ్‌ఎంసీ జోనల్ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లు, పట్టణ ప్రణాళికాధికారులు, అగ్నిమాపక, ఎక్సైజ్, ఆర్టీసీ, విద్యాశాఖ తదితర విభాగాల అధికారులు పాల్గొని పబ్లిక్ సేప్టీ కోసం తీసుకోవాల్సిన అంశాలపై అభిప్రాయాలను వెలిబుచ్చారు. అధికారులు మాట్లాడుతూ.. నగరంలో అగ్ని ప్రమాదం జరిగితే కనీసం ఫైరింజన్ కూడా వెళ్లలేని పరిస్థితులు ఉన్నాయని, చాలా వ్యాపార, వాణిజ్య సముదాయాలకు అగ్నిమాపక శాఖ అనుమతులు లేవన్నారు. నిర్మాణ అనుమతుల సందర్భంలోనే రక్షణకు సంబంధించి అన్ని కోణాలను
పరిశీలించాలని నిర్ణయించారు.

పోలీసింగ్ వ్యవస్థ నిఘాతో పాటు నగరంలోని ప్రజల భద్రతపై పూర్తిస్థాయి చైతన్యం తీసుకురావాలన్నారు. ఆర్టీసీపరంగా ఎంజీబీఎస్, జూబ్లీ, పికెట్‌తో పాటు ఐటీ సెక్టార్‌పై ప్రత్యేక దృష్టిసారించాలని నిర్ణయించారు. కార్యక్రమంలో జోనల్ కమిషనర్లు రోనాల్డ్ రోజ్, సత్యనారాయణతో పాటు డిప్యూటీ కమిషనర్లు సోమరాజు, విజయ్‌రాజ్, వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు. ప్రాంగణంలో ఏర్పాటు చేసిన స్టాళ్లలోని అధునాత సేఫ్టీ పరికరాలు ఆకట్టుకున్నాయి.
 
‘పబ్లిక్ సేప్టీ (మెజర్స్) ఎన్‌ఫోర్స్‌మెంట్ యాక్ట్ కింద నగరంలో ముందస్తుగా లక్ష కెమెరాల ఏర్పాటు చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు.
చిన్నచిన్న షాపుల నుంచి పెద్ద పెద్ద షాపింగ్‌మాల్స్ వరకు లోపల, బయట సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునేలా చైతన్యం తీసుకురానున్నారు. రహదారులు, పబ్లిక్ ప్రాంతాలు, కూడళ్లలో ప్రభుత్వం తరుపున సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తారు.
తాగి అల్లరి చేసేవారి ఆట క ట్టించేందుకు మద్యం దుకాణాలు, బార్ అండ్ రెస్టారెంట్ల వద్ద ప్రత్యేక నిఘా వ్యవస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. పబ్లిక్ ప్రదేశాల్లో మద్యం తాగేందుకు ఆస్కారం లేకుండా చేయనున్నారు.

Read latest Hyderabad News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా