ఐస్ కాదు.. రైస్ బకెట్

25 Aug, 2014 02:12 IST|Sakshi
ఐస్ కాదు.. రైస్ బకెట్

ఎఎల్‌ఎస్ (అమియోట్రోపిక్ లేటరల్ స్ల్కెరాసిన్) వ్యాధి గురించి ఎంతమందికి తెలుసోకాని ఇప్పుడు ప్రతిఒక్కరూ ఐస్ బకెట్లతో ఒళ్లంతా తెగతడుపుకుంటున్నారు. హాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు... సెలబ్రెటీల నుంచి సామాన్యుల వరకు.. బకెట్‌లతో క్యూ కడుతూ సోషల్ నెట్‌వర్క్ సైట్‌లను ‘తడి’పేస్తున్నారు. అసలే మంచినీటికి మహా కరువున్న మనదేశంలో ఇదంతా అవసరమా..? కూటికి గతిలేని కోట్లాది పేదలున్న భారత్‌లో ఐస్‌బకెట్‌ల గోలెందుకు ...? అనుకునేవారు ఉన్నారు. అయితే ఇదే ఐస్‌బకెట్ చాలెంజ్‌ను స్ఫూర్తిగా తీసుకొని ఓ మహిళ దేశీ స్టైల్‌లో ‘రైస్‌బకెట్ చాలెంజ్’ అనే వినూత్న దాతృత్వ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రపంచవ్యాప్తంగా మారిమోగిపోతున్న ఐస్ బకెట్ చాలెంజ్‌కే సవాలు విసిరింది. ఇంతకీ ఆమె ఎవరో కాదు హైదరాబాద్‌కు చెందిన మంజులతా కళానిధి.. తన చుట్టుపక్కలున్న పేదవారి ఆకలి తీర్చేందుకు ఆమె ఈ మార్గాన్ని ఎంచుకుంది.
 
 ఒక బకెట్ రైస్‌ను ఒక పేదవాడికి ఉచితంగా ఇచ్చి ఆ ఫొటోలను ఫేస్‌బుక్‌లో పోస్టు చేసి‘మీరు కూడా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించండి, రైస్ బకెట్ వీలుకాకుంటే కనీసం రూ.100 ల విలువైన ముందులను రోగులకు ఇవ్వండి’అని విజ్ఞప్తి చేసింది. ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్ అయిన గంటల్లోపే ఆమె ఫ్రెండ్స్ నుంచి ఈ పోస్టుకు విపరీతమైన స్పందన వచ్చింది. వేలల్లో లైక్స్ వచ్చాయి. ఆమెను స్ఫూర్తిగా తీసుకొని ఇప్పటికే దేశవ్యాప్తంగా వందలమంది రైస్ బకెట్ చాలెంజ్‌ను మొదలుపెట్టారు. ఇంకొంతమంది ఏకంగా రైస్ బకెట్ చాలెంజ్ మీద ఫేస్‌బుక్ పేజీనే ఏర్పాటు చేశారు. ప్రపంచం ఐస్‌బకెట్ చాలెంజ్‌తో మునుగుతుంటే రైస్‌బకెట్‌తో ఓ తెలుగు మహిళ సవాలు విసిరడం నిజంగా అభినందనీయం. మరి ఇంకెందుకు ఆలస్యం ఆమెను స్ఫూర్తిగా తీసుకొని మీరు పట్టండి ఒక రైస్ బకెట్‌ను..!

మరిన్ని వార్తలు