నేను మీ అభ్యర్థిని..

30 Jan, 2016 01:43 IST|Sakshi
నేను మీ అభ్యర్థిని..

హోరెత్తుతోన్న ఐవీఆర్‌ఎస్ ప్రచారం
ఓటర్లకు వెల్లువెత్తుతోన్న మొబైల్ కాల్స్
సామాజిక సైట్లలోనూ అదే జోరు

 
సిటీబ్యూరో: ‘నేను  ------- మీ పార్టీ అభ్యర్థిని. మీ డివిజన్ నుంచి పోటీచేస్తున్నాను. నన్ను గెలిపిస్తే డివిజన్‌ను అన్ని విధాలా అభివృద్ధి చేస్తాను. మీ అమూల్యమైన ఓటు నాకు వేసి గెలిపించాలి. మీరు తప్పకుండా ఫిబ్రవరి 2న మీ ఓటు హక్కు వినియోగించుకోవాలి’. ఏంటీ సందేశం అనుకుంటున్నారా.. ఇప్పుడు ఇంటింటి ప్రచారం మాటెలా ఉన్నా.. ఓటర్ల మొబైల్ ఫోన్లకు పోటీచేస్తున్న అభ్యర్థుల తరఫు నుంచి ఈ తరహా ఫోన్ రికార్డు సందేశాలు వెల్లువెత్తుతున్నాయి. ఫోన్ మోగితే చాలు సిటీజన్లు ఇది ఏ అభ్యర్థి రికార్డు సందేశమో అని నిట్టూరుస్తున్నారు గ్రేటర్ సిటీజన్లు. ఈ తరహా ఐవీఆర్‌ఎస్ (ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టం) ప్రచారం జోరు ఇపుడు సిటీలో పతాక స్థాయికి చేరింది. అభ్యర్థుల అవసరాలకు తగ్గట్టుగా పలు ప్రైవే టు ఏజెన్సీలు రంగంలోకి దిగి ఈ తరహా ప్రచారం చేసిపెడుతున్నాయి. ఇంటింటి ప్రచారానికి వెళ్లినప్పుడుడు అందరు ఓటర్లను కలుసుకోలేకపోయినా.. ఈ ఐవీఆర్‌ఎస్ విధానం ద్వారా ముందుగా రికార్డు చేసిన సందేశాన్ని యువకులు, ఉద్యోగులు, కార్మికులకు వినిపిస్తే వారి ఓటు తమ ఖాతాలో పడుతుందని భావిస్తున్నారు మన నేతశ్రీలు. మహానగరంలో సొంత వాహనం లేకున్నా సెల్‌ఫోన్ లేని వారు అరుదు.

దీంతో పలు ప్రధాన పార్టీల అభ్యర్థులు ఈ తరహా ప్రచారం వైపు మొగ్గుచూపుతున్నారు. ఇక పనిలోపనిగా సంక్షిప్త సందేశాల ద్వారా కూడా ‘మీ ఓటు మాకే వేయాలన్న’ సందేశాలను పంపిచేస్తున్నారు. ఇక సోషల్ మీడియా సైట్లు ఫేస్‌బుక్, వాట్సప్ గ్రూపులు సైతం ఎన్నికల ప్రచారానికి కరదీపికలుగా మారడం ఈసారి గ్రేటర్ ఎన్నికల వైచిత్రి. ఫలానా అభ్యర్థికి మీ అమూల్యమైన ఓటేయాలని ఫేస్‌బుక్‌లో ఎవరైనా పోస్టు చేస్తే చాలు లైకులే లైకులు.. కామెంట్లే కామెంట్లు. ఇక వాట్సప్ గ్రూపుల్లోనూ చాంతాడంత సందేశాలతో పలు గ్రూపుల్లో ఉన్న మహానగర ఓటరు మహాశయులు ఎన్నికల ప్రచారంలో తరిస్తున్నారు మరి. అభ్యర్థుల గుణగణాలు, వ్యక్తిత్వం, చేస్తున్న ఖర్చు, గతంలో అభ్యర్థులు స్థానికంగా చేసిన సేవలు.. విద్యార్హతలు, ఆస్తిపాస్తులు ఒక్కటేమిటి ఇప్పుడిలాంటి అంశాలన్నీ సామాజిక సైట్లలో హాట్ టాపిక్‌గా మారి చర్చోపచర్చలకు దారితీస్తున్నాయంటే అతిశయోక్తి కాదు. ఈ హైటెక్ ప్రచార బాణీ చూసి సామాన్యుడు మాత్రం ముక్కున వేలేసుకుంటున్నాడు.
 
 

మరిన్ని వార్తలు