రూ.120 కోట్లతో ఐకానిక్‌ బ్రిడ్జి

27 Apr, 2018 01:19 IST|Sakshi

నగరంలో ఢిల్లీ తరహా పాలికా బజార్‌!

సాలార్‌జంగ్‌ మ్యూజియం నుంచి స్టేట్‌ లైబ్రరీ వరకు

మధ్యలో నిలువెత్తు క్లాక్‌టవర్‌

ముషాయిరాలు, వినోద కార్యక్రమాలకు ఏర్పాట్లు

నడుచుకుంటూ షాపింగ్‌.. పర్యాటకులకు మధురానుభూతి  

సాక్షి, హైదరాబాద్‌: వంతెనపై నడుస్తుంటే రెండు వైపులా రకరకాల దుకాణాలు.. రారమ్మని ఆహ్వానిస్తూ కొనుగోలు చేయమంటున్న సరుకులు. కాస్త అలసిపోయినట్లు అనిపిస్తే సేద తీరేందుకు బెంచీలు. వీటితోపాటు అక్కడక్కడా పచ్చని చెట్లు.. వాటి కింద కూర్చునే ఏర్పాట్లు. బృందంగా వెళ్లే వారు వినోదాలు చేసుకోవాలనుకుంటే తగిన స్థలం.వీనుల విందు.. కళ్లకు ఆనందం కలిగించేలా వినోద, సాంస్కృతిక కార్యక్రమాలు. ముషాయిరాలు తదితరమైన వాటికి ఎంతో సదుపాయం. షాపింగ్‌తోపాటే వ్యాహ్యాళి, మనసుకు ఆహ్లాదం.

వీటన్నింటితో పాటు నట్టనడుమ నిలువెత్తు క్లాక్‌టవర్‌. నాలుగు దిక్కుల నుంచీ సమయాన్ని చూపించే గడియారాలు. ఇవీ నగరంలో చారిత్రక మూసీపై కొత్తగా నిర్మించనున్న ఐకానిక్‌ బ్రిడ్జిపై ఉండే విశేషాలు.  నగరంలో వివిధ ప్రాజెక్టులతో సరికొత్త అందాలు సృష్టించేందుకు సిద్ధమైన రాష్ట్ర ప్రభుత్వం పాతబస్తీ, కొత్త సిటీ నడుమ మరో అద్భుతమైన వంతెనను అందుబాటులోకి తేనుంది. ఓవైపు నగర చారిత్రక, వారసత్వ సంపదలను పరిరక్షిస్తూనే మరోవైపు సరికొత్త పర్యాటక ఆకర్షణలను ఏర్పాటు చేస్తూ దీన్ని నిర్మించనుంది. వాహనాలకు ఎలాంటి అనుమతుల్లేకుండా కేవలం పాదచారుల కోసమే ఈ ప్రత్యేక ప్రాజెక్టును చేపట్టింది.

పర్యాటకులను ఆకట్టుకునే ఈ ప్రాజెక్టుతో చార్మినార్‌ పాదచారుల పథకంలో భాగంగా ఉపాధి కోల్పోతున్న చిరు వ్యాపారులకు ఇక్కడ వ్యాపారావకాశం కల్పించనుంది. స్వచ్ఛ భారత్‌ కార్యక్రమాల్లో భాగంగా చార్మినార్‌ ప్రాంతాన్ని కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ ఐకానిక్‌ ప్రదేశంగా గుర్తించగా, చార్మినార్‌ వద్ద నుంచి తరలించే చిరు వ్యాపారుల కోసం ప్రభుత్వం ఈ ఐకానిక్‌ బ్రిడ్జిని నిర్మించనుంది.  

పాతబస్తీకి కొత్త సిటీకి వారధి  
చారిత్రక మూసీపై అటు సాలార్‌జంగ్‌ మ్యూజియం నుంచి ఇటు స్టేట్‌ సెంట్రల్‌ లైబ్రరీ వైపు ఈ బ్రిడ్జిని నిర్మించనున్నారు. 200 మీటర్ల పొడవు, 72 మీటర్ల వెడల్పుతో ఉండే ఈ బ్రిడ్జిపై వివిధ వరుసల్లో 25*25 మీటర్ల సైజుతో చిరు వ్యాపారులకు దుకాణాలు ఏర్పాటు చేస్తారు. చార్మినార్‌ పాదచారుల పథకంలో భాగంగా అక్కడి వ్యాపారులను ఇక్కడకు తరలిస్తారు. వర్షం వస్తే తల దాచుకునేందుకు మూడు ప్రాం తాల్లో షెల్టర్లుంటాయి. విదేశాల్లో మాదిరిగా షాపింగ్‌ చేసే వారి కోసం రిక్రియేషన్‌ జోన్‌ ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తారు.

అక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. దాదాపు 200 మంది వీక్షించేలా ఏర్పాట్లుంటాయి. ప్రభుత్వ ఆధ్వర్యంలోనూ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ బ్రిడ్జి అంచనా వ్యయం దాదాపు రూ.120 కోట్లు. తుది ప్రతిపాదనలు పూర్తయ్యాయని, ప్రభుత్వం ఓకే చేయాల్సి ఉం దని ఈ ప్రాజెక్టు పనులు చేపడుతున్న హైదరా బాద్‌ రోడ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌(హెచ్‌ఆర్‌డీసీఎల్‌) చీఫ్‌ ఇంజనీర్‌ మోహన్‌నాయక్‌ ‘సాక్షి’కి తెలిపారు.

ప్రాజెక్టు పూర్తయ్యేందుకు పనులు మొదలయ్యాక ఏడాది పడుతుందన్నారు. ఈ ప్రాజెక్టుతో చార్మినార్‌ దగ్గరి వ్యాపారుల ఉపాధికి ఢోకా లేకపోవడమే కాక, మరింత వ్యాపారాభివృద్ధికి అవకాశం ఉందని జీహెచ్‌ఎంసీ సౌత్‌జోన్‌ కమిషనర్‌ శ్రీనివాసరెడ్డి చెప్పారు. నగర హెరిటేజ్‌కు, ఆధునికతలకు ఇది వారధి కానుందని జీహెచ్‌ఎంసీ ప్లానింగ్‌ డైరెక్టర్‌ శ్రీనివాసరావు అభిప్రాయపడ్డారు.


మరో పాలికా బజార్‌..!
ఢిల్లీ కనాట్‌ ప్లేస్‌ ఇన్నర్, ఔటర్‌ సర్కిళ్ల మధ్య అండర్‌గ్రౌండ్‌లో పాలికా బజార్‌ ఉంది. అక్కడ దాదాపు 400 దుకాణాలున్నాయి. ఏ సమయంలో చూసినా అక్కడ దాదాపు 15వేల మంది ఉంటారు. ఢిల్లీకి వచ్చే పర్యాటకులు, ముఖ్యంగా విదేశీ పర్యాటకులు పాలికాబజార్‌ను సందర్శించకుండా పోరు. అక్కడి పాలికాబజార్‌ భూగర్భంలో ఉంటే , ఇక్కడి ‘పాలికాబజార్‌’భూమిపైన వెలిసే వంతెనపై రానుంది.

మరిన్ని వార్తలు