పీఠాలు కదలాల్సిందే..!

19 Mar, 2015 02:40 IST|Sakshi
పీఠాలు కదలాల్సిందే..!

యూనిఫైడ్ సర్వీసు రూల్స్ అమలుకు సర్కార్ కసరత్తు
మంత్రి తుమ్మల అధ్యక్షతన కేబినెట్ సబ్‌కమిటీ
అర్బన్ డెవలప్‌మెంట్‌లోని వివిధ యాక్టుల సవరణకు నిర్ణయం
హెచ్‌ఎండీఏలో త్వరలో ఉద్యోగుల స్థానభ్రంశం

సాక్షి, సిటీబ్యూరో : మున్సిపల్ పరిపాలనా విభాగం పరిధిలోని వివిధ శాఖలను ఒకే గొడుకు కిందకు తెస్తూ  యూనిఫైడ్ సర్వీస్ రూల్స్‌ను అమలోకి తేవాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.

ఈ నేపథ్యంలో పట్టణాభివృద్ధి శాఖ పరిధిలోని వివిధ యాక్టులను సవరించాలని భావిస్తోంది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా గతంలో ఉన్న యాక్ట్‌లనే అనుసరిస్తుండటం వల్ల హెచ్‌ఎండీఏ, జీహెచ్‌ఎంసీ,  టౌన్ ప్లానింగ్ తదితర విభాగాల్లో పాతుకుపోయిన ఉద్యోగులను  ఇతర విభాగాలకు బదిలీ చేసే అవకాశం లేకుండా పోయింది. దీంతో ఆయా విభాగాల్లో పాతుకుపోయిన అక్రమార్కులపై చర్యలు తీసుకోలేని పరిస్థితి నెలకొంది.

దీంతో హెచ్‌ఎండీఏ, జీహెచ్‌ఎంసీ విభాగాల్లోని  కిందస్థాయి నుంచి  అధికారుల వరకు బదిలీ చేసినా ఒక సెక్షన్ నుంచి మరో సెక్షన్‌కు మార్చడం మినహా ఇతర విభాగాలకు పంపలేని పరిస్థితి. దీంతో ఎలాంటి పరిస్థితుల్లోనూ నగరం విడిచి వేరే ఊరికి బదిలీ అయ్యేది లేకపోవడంతో అక్రమార్కులు ఆడిందే ఆట, పాడిందే పాటగా సాగుతోంది. కొత్తగా యాదగిరిగుట్ట, గజ్వేలు పట్టణాలను డెవలప్‌మెంట్ అథార్టీలుగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించినందున మున్సిపల్ పరిపాలనా విభాగం పరిధిలోని అన్ని శాఖల్లో ఏకీకృత సర్వీసు రూల్స్ అమలు చేసేందుకు కసరత్తు ప్రారంభించారు.

ఇందులో భాగంగా అర్బన్ డెవలప్‌మెంట్ పరిధిలోకి వచ్చే హెచ్‌ఎండీఏ (2008యాక్ట్), జీహెచ్‌ఎంసీ (2007 యాక్ట్), ఏపీ అర్బన్ డెవలప్‌మెంట్ (1975) యాక్ట్, ఏపీ టౌన్ ప్లాన్‌నింగ్ (1920) యాక్ట్, ఏపీ మున్సిపల్  (1964) యాక్టులను సవరించాలని సర్కార్ నిర్ణయించింది.  దీనివల్ల మిడిల్, హయ్యర్ అధికారుల పరస్పర బదిలీలకు మార్గం సుగమం అవుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో స్పెషల్ చీఫ్ సెక్రటరీ ప్రదీప్‌చంద్ర అధ్యక్షతన యూనిఫైడ్ సర్వీసుల కమిటీ ఏర్పాటు చేయడమేగాక, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీని కూడా నియమించింది.

ఈ కమిటీ పట్టణాభివృద్ధి శాఖ పరిధిలోని వివిధ యాక్టులను సవ రణకు సంబంధించి డ్రాఫ్టు బిల్లును రూపొందించే పనిలో నిమగ్నమైంది. దీనికి ఓ రూపం వచ్చాక ‘లా’ విభాగానికి పంపి, అనంతరం క్యాబినెట్ సబ్ కమిటీ  ఆమోదంతో అసెంబ్లీలో పెడతారు. అక్కడ ఆమోదం పొందితే చట్టం అమల్లోకి వస్తుంది. ఈ ప్రక్రియను  త్వరగా పూర్తి చేసి వీలైతే ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాల్లోనే చర్చకు పెట్టాలన్న ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. అయితే... ఇందులో సాంకేతికంగా చాలా అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉన్నందున ఇప్పుడు సాధ్యం కాకపోవచ్చుననే వాదన కూడా విన్పిస్తోంది.
 
కదలనున్న పీఠాలు
ప్రభుత్వం ఏకీకృత సర్వీసు రూల్స్‌ను అమల్లోకి తెస్తే హెచ్‌ఎండీఏలో చాలా మంది ఉద్యోగుల పీఠాలు కదలనున్నాయి. ప్రధానంగా ప్లానింగ్ విభాగంలో అవినీతి, అక్రమాలపై ప్రభుత్వ చాలా సీరియస్‌గా ఉంది. గతంలో నీరబ్ కుమార్ కమిషనర్‌గా ఉన్న  సమయంలో మహబూబ్‌నగర్ జిల్లా కొత్తూరులో  ఓ ఎమ్మెన్సీ కంపెనీ తమ సంస్థను నెలకొల్పేందుకు భారీమొత్తంలో డబ్బులు వసూలు చేసిన విషయం బట్టబయలైంది. దీనిపై తీవ్రంగా స్పందించిన ముఖ్యమంత్రి సదరు కమిషనర్‌కు ఉద్వాసన పలికారు. అయితే... ఇందులో ప్రమేయం ఉన్న మరో ఇద్దరు అధికారులపై నిఘా ఉంచినట్లు సమాచారం.

హెచ్‌ఎండీఏ ప్లానింగ్, ఇంజనీరింగ్  విభాగాలను సమూలంగా ప్రక్షాళన చేసేందుకు సీఎం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఏసీబీ దాడులు జరగడంతో అక్రమార్కుల వెన్నులో వణుకు పుట్టింది. అయినా కొందరు అక్రమార్కులు తమ అక్రమ దందాను యథావిధిగా కొనసాగిస్తున్నట్లు విజిలెన్స్ వర్గాలు ప్రభుత్వానికి నివేదించినట్లు తెలిసింది. హెచ్‌ఎండీఏ, జీహెచ్‌ఎంసీ, టౌన్‌ప్లానింగ్ విభాగాల్లో అక్రమార్కుల జాబితా భారీగానే ఉండటంతో వారందరినీ కట్టడి చేసేందుకు ఇతర విభాగాలకు బదిలీ చేయడం ఒక్కటే మార్గమని సర్కార్ భావిస్తోంది.

>
మరిన్ని వార్తలు