నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ!

28 Feb, 2016 03:08 IST|Sakshi
నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ!

► ఎంసెట్ తరహాలో ఇంటర్మీడియెట్ పరీక్షలు
► మార్చి 2 నుంచి ప్రారంభం
► హాజరుకానున్న విద్యార్థుల సంఖ్య 9.64 లక్షలు
► పరీక్ష కేంద్రాల్లో ఎలక్ట్రానిక్ పరికరాలు నిషేధం
► అధికారుల సెల్‌ఫోన్ వాడకంపై హైటెక్ నిఘా
► మాట్లాడినా, ఎస్‌ఎంఎస్ చేసినా జీపీఎస్ సహాయంతో గుర్తింపు

సాక్షి, హైదరాబాద్: వచ్చే నెల 2న ప్రారంభం కానున్న ఇంటర్ పరీక్షలకు ఏర్పాట్లను ఇంటర్మీడియెట్ బోర్డు పూర్తిచేసింది. ఈసారి ఇంటర్ పరీక్షల్లో మొదటిసారిగా నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ విధానాన్ని బోర్డు అమలు చేయనుంది. ఎంసెట్ తరహాలోనే ఇంటర్ పరీక్షల్లోనూ హైటెక్ కాపీయింగ్ జోరుగా జరుగుతున్నట్లు ఫిర్యాదులు వస్తుండటంతో నిమిషం నిబంధనను అమలు చేయాలని నిర్ణయించినట్లు బోర్డు కార్యదర్శి అశోక్ శనివారమిక్కడ విలేకరుల సమావేశంలో వెల్లడించారు.

విద్యార్థులు  వీలైనంత ముందుగా పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని, ఆలస్యం చే సి ఆ తరువాత నష్టపోవద్దని సూచించారు. ఇందుకనుగుణంగా ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. ఉదయం 9 గంటలకు పరీక్ష ప్రారంభం అవుతుందని, విద్యార్థులను 8:45 గంటల నుంచే  పరీక్ష కేంద్రంలోకి అనుమతి ఇస్తామని వెల్లడించారు. 9 గంటల తరువాత ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోమని స్పష్టం చేశారు. విద్యార్థులకు హాల్‌టికెట్లను ఏ కారణంతో (ఫీజులతో సహా) నిరాకరించినా.. ఆయా యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకుంటామని అశోక్ హెచ్చరించారు. అలాంటి వారిపై ఫిర్యాదు చేయాలని సూచించారు. ఆర్టీసీ ప్రత్యేక బస్సు సదుపాయం కల్పించేలా చర్యలు చేపట్టారు. పరీక్షల మూల్యాంకనం మార్చి 9 (అరబిక్, ఫ్రెంచి, సంస్కృతం)నుంచి, ఇతర సబ్జెక్టుల్లో మార్చి 18 నుంచి ప్రారంభిస్తారు.
 
వెబ్‌సైట్ నుంచి హాల్‌టికెట్లు..
 ► హాల్‌టికెట్లలో విద్యార్థులు ఇబ్బందులు లేకుండా బోర్డు చర్యలు చేపట్టింది. ఈనెల 29 నుంచి హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకొని విద్యార్థులు పరీక్షలకు హాజరు కావచ్చు.
► హాల్‌టికెట్లలో పొరపాట్లు ఉంటే ప్రిన్సిపాల్ దృష్టికి తీసుకెళ్లి మార్పు చేయించుకోవాలి.
►ఓఎంఆర్ బార్‌కోడ్‌లో పేరు, హాల్‌టికెట్ నంబరు, మీడియం వివరాలను సరిచూసుకోవాలి.
► జవాబుల బుక్‌లెట్‌లో 24 పేజీలు ఉన్నాయా? లే దా? చూసుకోవాలి. వేరు అడిషనల్ షీట్స్ ఇవ్వరు.
► కొత్త సిలబస్, పాత సిలబస్‌ను జాగ్రత్తగా చూసుకోవాలి. మొదటిసారి పరీక్షలు రాసే వారంతా కొత్త సిలబస్ ప్రశ్నపత్రంతోనే రాయాలి.
 
 విద్యార్థులు సెల్ ఫోన్లు తేవద్దు

 పరీక్ష కేంద్రాల్లోకి సెల్‌ఫోన్ సహా ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించరు. పరీక్ష కేంద్రాల్లో జామర్లు ఉంటాయి. కేవలం చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్‌మెంటల్ ఆఫీసర్లు, అనుమతి పొందిన వారు మాత్రమే సెల్‌ఫోన్ వినియోగించాలి. అదీ ప్రశ్నాపత్రాల చేరవేత కోసమే. వారి ఫోన్లపైనా ట్యాపింగ్ తరహా హైటెక్ నిఘా ఉంటుంది. జీపీఎస్ సహాయంతో వారి ఫోన్ నుంచి ఇతరులకు ఫోన్ వెళ్లినా, మెసేజ్ వెళ్లినా, ఇతరుల ఫోన్ల నుంచి వారి ఫోన్లకు కాల్ వచ్చినా, మెసేజ్ వచ్చినా రికార్డు చేస్తారు.
 
మాస్ కాపీయింగ్‌ను అడ్డుకునేందుకు 50 ఫ్లయింగ్ స్క్వాడ్‌లు, 200 వరకు సిట్టింగ్ స్క్వాడ్‌లను పోలీసు, రెవెన్యూ బృందాలతో ఏర్పాటు చేశారు. పరీక్షల ఇన్విజిలేషన్ విధుల్లో 24,651 మంది లెక్చరర్లు, 3,388 మంది టీచర్లు పాల్గొంటారు. పరీక్షలకు 1,257 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇందులో 478 ప్రభుత్వ కాలేజీలు, 34 ఎయిడెడ్ కాలేజీలు, 745 ప్రైవేటు కాలేజీలు ఉన్నాయి. 118 సమస్యాత్మక కేంద్రాల్లో ప్రత్యేక నిఘా ఉంటుంది.
 
మొత్తం 9,64,664 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. ప్రథమ సంవత్సరం 4,56,655 మంది, ద్వితీయ సంవత్సరం 5,08,009 (జనరల్: 4,73,882, వొకేషనల్: 34,127) మంది.
 

మరిన్ని వార్తలు