అప్పటికీ అభ్యంతరం పెడితే టైటిల్ మార్చుతాం..

27 Apr, 2016 16:44 IST|Sakshi
అప్పటికీ అభ్యంతరం పెడితే టైటిల్ మార్చుతాం..

హైదరాబాద్ : 'మెంటల్ పోలీస్' సినిమా టైటిల్ మార్చాలని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ పోలీస్ సంఘాల నుంచి వినతులు వచ్చాయని ఆ చిత్ర దర్శక, నిర్మాతలు తెలిపారు. రెండు రాష్ట్రాల పోలీస్ సంఘాల నేతలకు సినిమా చూపిస్తామని, అప్పటికీ టైటిల్ మార్చాలంటే మార్పు చేస్తామని వారు బుధవారమిక్కడ వెల్లడించారు.

శ్రీకాంత్ హీరోగా మెంటల్ పోలీస్ చిత్రం తెరకెక్కిన విషయం తెలిసిందే. అయితే పోలీసుల మనోభావాలు దెబ్బతినేలా సినిమా పేరు ఉందంటూ ఆ చిత్ర  నిర్మాత, దర్శకులతోపాటు హీరో శ్రీకాంత్‌కు పోలీసు అధికారుల సంఘం లీగల్ నోటీసులు పంపిన విషయం తెలిసిందే. సమాజంలో పోలీసులకున్న గౌరవ మర్యాదలను కించపరిచేలా సినిమా పేరు పెట్టారని, దాన్ని వెంటనే తొలగించాలని డిమాండ్ చేసింది.

మరోవైపు మెంటల్ పోలీస్ సినిమా విడుదలపై హైకోర్టు స్టే విధించింది. ఈ సినిమా టైటిల్పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ పోలీసు అధికారుల సంఘం దాఖలు చేసిన పిటిషన్ను విచారించిన కోర్టు సినిమా విడుదలపై స్టే విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.  కాగా శ్రీకాంత్, అక్ష జంటగా కరణం పి.బాబ్జీ దర్శకత్వంలో వీవీఏఎన్ ప్రసాద్ దాసరి, వీవీ దుర్గాప్రసాద్ అనగాని ఈ చిత్రాన్ని నిర్మించారు.

మరిన్ని వార్తలు