ఆమెపై అలక్ష్యం..

31 Jan, 2018 03:08 IST|Sakshi

మహిళలపై నేరాల కేసుల్లో ఏళ్లకేళ్లు దర్యాప్తు, విచారణ

నేర పరిశోధనలో లోపాలెన్నో, కోర్టుల చుట్టూ ప్రదక్షిణలు  

సంవత్సరాలు గడుస్తున్నా దక్కని న్యాయం

సాక్షి, హైదరాబాద్‌: మహిళలపై నేరాలకు సంబంధించిన కేసుల విచారణ, దర్యాప్తులో తీవ్రజాప్యం జరుగుతోంది. సంచలన కేసులు సైతం ఇందుకు మినహాయింపేమీ కాదు. ఈ ఆలస్యమే మృగాళ్లు మరింత రెచ్చిపోయేందుకు కారణమవుతోంది. గతనెలలో హైదరాబాద్‌ లాలాగూడ ప్రాంతంలో సంధ్యారాణి... ఈ నెలలో కూకట్‌పల్లిలో జానకి.. సోమవారం చందానగర్‌లో అపర్ణ, ఆమె తల్లీ, నాలుగేళ్ల చిన్నారి.. మంగళవారం హయత్‌నగర్‌లో అనూష, గచ్చిబౌలిలో బొటానికల్‌ గార్డెన్‌ వద్ద ముక్కలుగా దొరికిన గుర్తుతెలియని మహిళ.. రాజధానిలోని మూడు కమిషనరేట్ల పరిధిలో వెలుగులోకి వచ్చిన దారుణాలివీ. మహిళలు, యువతులపై జరిగే నేరాల్లో దోషులకు సత్వరమే శిక్షలు పడకపోవడం వల్లే దారుణాలు పెరిగిపోతున్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు.

నాలుగు రోజులే హడావుడి
ఆడపిల్లలపై ప్రేమోన్మాదులు కత్తులు, యాసిడ్‌తో దాడులకు తెగబడిన సమయాల్లో పోలీసులు నాలుగు రోజులు హడావుడి చేస్తున్నారు. కళాశాలలు, హాస్టల్స్‌ ఉన్న ప్రాంతాల్లో పెట్రోలింగ్‌ చేస్తున్నారు. తర్వాత కేసు దర్యాప్తు పూర్తయి, కోర్టులో విచారణ ముగిసి దోషులకు శిక్ష పడటం మాత్రం ప్రహసనంగా మారిపోయింది. ‘నేరగాళ్లను కఠినంగా శిక్షిస్తాం. ఇలాంటివి పునరావృతం కాకుండా చూస్తాం’అంటూ గంభీరంగా ప్రకటించే అధికార యంత్రాంగం, పాలకుల హామీలు కూడా నీటి మూటలుగా మిగిలిపోతున్నాయి.

నేరగాళ్ల ‘ధైర్యం’అదే..!
మహిళలపై నేరాలు పెరగడానికి వ్యవస్థాగత లోపాలు, కుటుంబ వ్యవస్థలు పతనం కావడం, చట్టమంటే భయం లేకుండా పోవడం వంటివి ప్రధాన కారణాలుగా నిపుణులు చెప్తున్నారు. నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో (ఎన్‌సీఆర్బీ)–206 గణాంకాల ప్రకారం మహిళలపై జరిగిన నేరాల్లో.. ఏపీలో 9.3 శాతం, తెలంగాణలో 8.1 శాతం కేసుల్లో మాత్రమే దోషులకు శిక్షలు పడ్డాయి. కేసుల విచారణ పూర్తవడానికి ఏళ్లు పడుతుండటంతో అప్పటివరకు బాధితులు పోరాడలేకపోతున్నారు. ఇలాంటి కారణాల వల్లే ‘ఏం చేసినా.. ఏం కాదు’అన్న ధైర్యం నేరగాళ్లలో పెరిగిపోతోంది. ఈ పరిస్థితి మారేందుకు పోలీసులు.. దోషులకు వీలైనంత త్వరగా శిక్షలు పడేలా చూడాలని, ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులు ఏర్పాటు చేసి విచారణ వేగవంతం చేయాలని బాధితులు కోరుతున్నారు.

మరింత ‘భరోసా’కావాలి..
బాధిత మహిళలకు అన్ని విధాల సహాయ సహకారాలు అందించడానికి హైదరాబాద్‌లో భరోసా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అయితే దీన్ని కేవలం అత్యాచారం, చిన్నారులపై జరిగే అఘాయిత్యాలు, తీవ్రమైన గృహహింస కేసుల్లోనివారికి మాత్రమే పరిమితం చేశారు. ఈ కేంద్రం బాధితులకు అండగా ఉండటంతోపాటు వైద్య, న్యాయ సహాయం చేస్తోంది. పునరావాసం కూడా కల్పిస్తోంది. ఈ తరహా కేంద్రాలు ప్రతి జిల్లాలో ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. అలాగే మహిళలపై జరిగే ప్రతి నేరంలోనూ స్పందించేలా మార్పుచేర్పులు చేయాల్సి ఉంది.

బెయిల్‌ ఇవ్వొద్దు
మహిళలపై జరిగే నేరాలకు తక్షణం ఫుల్‌స్టాప్‌ పెట్టాలంటే నేరస్తులకు విచారణ పూర్తయ్యేదాకా బెయిల్‌ రాకుండా చూడాలి. బెయిల్‌ వచ్చిందంటే సాక్షులను ప్రభావితం చేయటం, రాజీ కోసం ఒత్తిడి చేస్తున్న ఘటనలు పెరుగుతున్నాయి. మహిళలపై జరిగే నేరాలను రుజువు చేసేందుకు ప్రాసిక్యూషన్‌ కూడా ఇన్వెస్టిగేషన్‌ నుంచి జడ్జిమెంట్‌ వరకు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మహిళల కేసుల సత్వర పరిష్కారానికి ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టులు తేవాలి.
– కాటేపల్లి సరళ, హైకోర్టు అడ్వకేట్‌

తక్షణ న్యాయం జరగాలి
ఢిల్లీలో నిర్భయ ఘటన తర్వాత స్పందన చూస్తే మహిళలకు మంచిరోజులు వచ్చాయనిపించింది. కానీ కొన్నాళ్ల తర్వాత మళ్లీ పాతరోజులే రిపీట్‌ అవుతున్నాయి. నేరం జరిగిన వెంటనే కఠిన శిక్షలు అమలు చేయాలి. ఆ దిశగా న్యాయ వ్యవస్థను క్రియాశీలం చేయాలి. హైదరాబాద్‌లో పోలీస్‌స్టేషన్లు మరింత విమెన్‌ ఫ్రెండ్లీగా తయారు కావాలి. న్యాయం కోసం వెళ్లిన వారిని ప్రశ్నలతో భయపెట్టే పరిస్థితి ఉండొద్దు. 
– నీలిమా పొనుగోటి,సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్, గచ్చిబౌలి

ఏపీలో ఇలా..
- 2015కు సంబంధించిన 9,349 కేసుల దర్యాప్తు 2016లోనూ కొనసాగాయి
- వీటిలో 66 కేసులను ఆయా పోలీస్‌ స్టేషన్లకు బదిలీ చేశారు. 153 కేసులు సరైన ఆధారాల్లేక మూతబడ్డాయి. 1,323 కేసులు తప్పుడు ఫిర్యాదులుగా, 226 కేసుల్లో వాస్తవాలు వక్రీకరించినట్లు తేలింది
- 14,774 కేసుల్లో మాత్రమే దర్యాప్తు పూర్తయి కోర్టులో అభియోగపత్రాలు దాఖలయ్యాయి
- విచారణ పూర్తయిన 9,882 కేసుల్లో 922 (9.3 శాతం) కేసుల్లో మాత్రమే దోషులకు శిక్షలు పడ్డాయి

తెలంగాణలో ఇలా..
- 2015కు సంబంధించిన 6,585 కేసుల దర్యాప్తు 2016లోనూ కొనసాగింది
- 50 కేసులను ఆయా ఠాణాలకు బదిలీ చేశారు. 569 కేసులు సరైన ఆధారాల్లేక మూతబడ్డాయి. 642 కేసులు తప్పుడు ఫిర్యాదులుగా, 438 కేసుల్లో వాస్తవాలు వక్రీకరించినట్లు తేలింది.
- 12,185 కేసుల్లోనే దర్యాప్తు పూర్తయి కోర్టులో అభియోగపత్రాలు దాఖలయ్యాయి
- విచారణ పూర్తయిన 5,809 కేసుల్లో 471 (8.1 శాతం) కేసుల్లో మాత్రమే దోషులకు శిక్షలు పడ్డాయి

మరిన్ని వార్తలు