జాతీయ ప్రాజెక్టులకు సాంకేతిక సాయం

19 Jun, 2015 01:14 IST|Sakshi
జాతీయ ప్రాజెక్టులకు సాంకేతిక సాయం

ఐఐసీటీ డెరైక్టర్ శ్రీవారి చంద్రశేఖర్ వెల్లడి
సాక్షి, హైదరాబాద్: దేశంలోని ముఖ్యమైన సమస్యలకు పరిశోధనల ద్వారా పరిష్కారాలను కనుక్కునేందుకు కౌన్సిల్ ఫర్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సీఎస్‌ఐఆర్) మరింత నిబద్ధతతో కృషి చేయాలని నిర్ణయించినట్లు ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసీటీ) నూతన డెరైక్టర్ డాక్టర్ శ్రీవారి చంద్రశేఖర్ తెలిపారు. ఇందులో భాగంగా  స్వచ్ఛ భారత్‌తోపాటు, స్వాస్థ్య భారత్, స్కిల్ ఇండియా, స్మార్ట్ సిటీస్ డిజిటల్ ఇండియా, నమామి గంగా వంటి ప్రాజెక్టుల సత్వర అమలుకు అవసరమైన సాంకేతికతను సీఎస్‌ఐఆర్‌కు చెందిన 37 పరిశోధన సంస్థలు అభివృద్ధి చేస్తాయని గురువారం ఆయన హైదరాబాద్‌లో మీడియాకు తెలిపారు.

ఇటీవల డెహ్రాడూన్‌లో ముగిసిన సీఎస్‌ఐఆర్ డెరైక్టర్ల సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్, సహాయమంత్రి వై.ఎస్.సుజనా చౌదరిలు పాల్గొన్న ఈ సమావేశంలో ‘డెహ్రాడూన్ డిక్లరేషన్’ పేరుతో ఓ కార్యచరణ ప్రణాళికను సిద్ధం చేశామని వివరించారు. పరిశోధన ఫలాలను అందరికీ అందుబాటులోకి తెచ్చేందుకు శాస్త్రవేత్తలు కంపెనీలు స్థాపించేలా చర్యలు తీసుకోవడం, ఏడాదికి కనీసం 12 టెక్నాలజీలను జనబాహుళ్యానికి అందుబాటులోకి తేవడం, పేదల జీవన ప్రమాణాలను పెంచే టెక్నాలజీలకు ప్రాధాన్యమివ్వడం వంటి అంశాలను ప్రణాళికలో పొందుపరిచినట్లు చంద్రశేఖర్ పేర్కొన్నారు.
 
చౌక మందులపై దృష్టి: డెహ్రాడూన్ డిక్లరేషన్‌లో భాగంగా తాము పారసిటమాల్, ఐబూబ్రూఫిన్ వంటి అత్యవసర మందుల తయారీకి అవసరమైన రసాయనాలను చౌకగా ఉత్పత్తి చేయడంపై దృష్టిపెట్టామని ఐఐసీటీ డెరైక్టర్ శ్రీవారి చంద్రశేఖర్ తెలిపారు. గంగా నది శుద్ధికి సంబంధించిన నమామి గంగ ప్రాజెక్టులోనూ ఐఐసీటీ  తనవంతు పాత్ర పోషిస్తుందని చెప్పారు.
 
నల్లగొండలో మరిన్ని నీటి శుద్ధి కేంద్రాలు: నీటిలోని ఫ్లోరైడ్‌ను తొలగించేందుకు ఐఐసీటీ అభివృద్ధి చేసిన టెక్నాలజీని నల్లగొండ జిల్లాలో మరింత విసృ్తతంగా వాడాలని నిర్ణయించామని చంద్రశేఖర్ తెలిపారు. ప్రస్తుతం ఆ జిల్లాలో మూడు డీ ఫ్లోరినేషన్ ప్లాంట్లు నడుస్తున్నాయని, ఏదైనా స్వచ్ఛంద సంస్థ సహకారంతో జిల్లాలోని అన్ని గ్రామాల్లో ఇలాంటి ప్లాంట్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించామని అన్నారు.

మరిన్ని వార్తలు