ఆక్రమణల కూల్చివేత మంచిదే

1 Oct, 2016 07:55 IST|Sakshi
ఆక్రమణల కూల్చివేత మంచిదే

కానీ చట్ట ప్రకారం వ్యవహరించండి: హైకోర్టు
రాష్ట్రంలో నాలాలు, చెరువులను ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలను కూల్చివేసేందుకు ప్రభుత్వం చేపట్టిన చర్యలు అభినందనీయమేనని హైకోర్టు వ్యాఖ్యానించింది. అయితే ఈ కూల్చివేతల విషయంలో చట్ట ప్రకారం వ్యవహరించాలని స్పష్టం చేసింది. ఆక్రమించినవారిగా పేర్కొంటున్నవారికి నోటీసులు ఇవ్వకుండా, వాదనలను వినిపించే అవకాశమివ్వకుండానే కూల్చివేతలకు ఉత్తర్వులు జారీ చేయరాదని మున్సిపల్, రెవెన్యూ శాఖల అధికారులను ఆదేశించింది. రెండు వారాల గడువు ఇచ్చి వారి వాదన వినాలని.. తర్వాతే కూల్చివేతలపై నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేసింది. చట్టాల అమలు విషయంలో సమతుల్యత పాటించాల్సిన బాధ్యత అటు ప్రభుత్వంపై, ఇటు న్యాయస్థానంపై ఉందని పేర్కొంది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు.    
 - సాక్షి, హైదరాబాద్
 
 రెండో రోజు విచారణలో..
 తమవి అక్రమ నిర్మాణాలంటూ కూల్చివేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారని హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు చెందిన కొందరు హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై గురువారం జరిగిన విచారణ సందర్భంగా.. ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా, నిబంధనలకు విరుద్ధంగా అధికారులు వ్యహరిస్తున్నారని పిటిషనర్లు కోర్టుకు విన్నవించారు. అయితే నాలాలు, చెరువులను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టినందునే కూల్చివేస్తున్నామని జీహెచ్‌ఎంసీ, రెవెన్యూశాఖల తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) కె.రామకృష్ణారెడ్డి కోర్టుకు నివేదించారు. దశల వారీగా కూల్చివేత చేపడుతున్నామని.. అన్ని అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తామని చెప్పారు. దీంతో అందరికీ వర్తించేలా ఉత్తర్వులు జారీ చేస్తామని చెప్పిన న్యాయమూర్తి జస్టిస్ రామచంద్రరావు.. ఎటువంటి సందిగ్ధతకు తావు లేకుండా శుక్రవారం నిర్దిష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ‘‘జీహెచ్‌ఎంసీ పరిధిలో నాలాలు, చెరువులను ఆక్రమించుకుని 28 వేల నిర్మాణాలు వెలిశాయన్న విషయంలో ఎటువంటి వివాదం లేదు.
 
ఈ ఆక్రమణలున్న విషయం నిర్దిష్ట కాలం నుంచే అధికారులకు తెలుసు (పత్రికా కథనాల ప్రకారం నాలుగు సంవత్సరాలుగా). అయినా అధికారులు వాటివైపు కన్నెత్తి చూడలేదు. మరిన్ని అక్రమ నిర్మాణాలు వెలిసేందుకు అనుమతిచ్చారు. జీహెచ్‌ఎంసీ, రెవెన్యూశాఖల్లో అవినీతి ఉందన్న విషయంలోనూ వివాదం లేదు. ఓ నిర్మాణం కూల్చివేత సమర్థనీయమా, కాదా? అది ఏకపక్షమా.., కపట ఉద్దేశాలున్నాయా? అన్న విషయాలను న్యాయస్థానాలు పట్టించుకోకుండా పక్కకు వెళ్లవు. ఇటువంటి వ్యవహారాల్లో పౌరుల వైపు నుంచి ఆలోచించాలని ఓ కేసులో సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అక్రమ నిర్మాణాలకు పౌరులు మాత్రమే ఎందుకు బాధితులుగా మారాలని, ప్రభుత్వానికి ఎందుకు బాధ్యత ఉండకూడదని ఆ తీర్పులో ప్రశ్నించింది.

దశాబ్దాల తరబడి చట్టాలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైన నేపథ్యంలో... బాధితులకు న్యాయస్థానం అండగా ఉండకపోవడానికి ఎటువంటి కారణం కూడా లేదని సుప్రీం పేర్కొంది. ఆ తీర్పు ఇప్పుడు ఈ కేసులకు కూడా వర్తిస్తుంది. ఆక్రమణలంటూ మున్సిపల్, రెవెన్యూ అధికారులు పెద్ద సంఖ్యలో కూల్చివేతలకు దిగారు. ముందు నోటీసులు ఇవ్వడం గానీ, అధికారుల చెబుతున్న వాటితో విభేదించేందుకు అవకాశం గానీ ఇవ్వడం లేదు. ప్రాథమిక ఆధారాలను బట్టి చూస్తే ఇది చెల్లుబాటు కాదు..’’ అని న్యాయమూర్తి పేర్కొన్నారు.
 
 కుటుంబాలన్నీ రోడ్డున పడతాయి
 సహజ న్యాయసూత్రాలను పాటించాల్సిన అవసరం లేదని చట్టం స్పష్టంగా చెబుతుంటే తప్ప.. ఉత్తర్వులు జారీ చేసే ముందు వాదన వినిపించే అవకాశమివ్వడం తప్పనిసరని న్యాయమూర్తి పేర్కొన్నారు. అంతేగాకుండా ఆ చర్య వల్ల వ్యక్తిగత హక్కులు, ఆస్తి, వస్తు నష్టం వంటి పరిణామాలు ఏర్పడే అవకాశమున్నన్నప్పుడు కూడా వాదనలకు అవకాశం ఇవ్వాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే దీనికి మినహాయింపు ఉంటుందని.. ఆ అత్యవసర పరిస్థితేమిటో చెప్పి సమర్థించుకోవాల్సిన బాధ్యత అధికారులపైనే ఉంటుందని చెప్పారు. ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా, తమ నిర్మాణాలు సక్రమమైనవేననే ఆధారాలు చూపే అవకాశం కూడా ఇవ్వకపోతే అధికారుల ఏకపక్ష చర్యల నుంచి ప్రజలకు రక్షణ ఉండదన్నారు. తద్వారా పౌరులకు తీరని నష్టం వాటిల్లుతుందని న్యాయమూర్తి పేర్కొన్నారు.
 
  ‘‘మహిళలు, పిల్లలు, వృద్ధులు, అనారోగ్యంతో బాధపడుతున్న వారు కుటుంబాలతో సహా రోడ్డునపడతారు. తీవ్ర మనోవేదనకు, ఇబ్బందులకు గురవుతారు. ఆక్రమణల గురించి తెలిసీ అధికారులు ఇంత కాలం మౌనంగా ఉన్నారు. ఆక్రమణలుగా చెబుతున్న స్థలాల్లో ఉంటున్న వారి వాదనలను వినిపించేందుకు.. ఆ స్థలాన్ని ఖాళీ చేసి వెళ్లేందుకు తగిన గడువు ఇవ్వడం ప్రజాప్రయోజనాల దృష్ట్యా ఎంతో సముచితం. నాలాలు, చెరువులను ఆక్రమించుకుని నిర్మాణాలు చేపట్టారని ఎవరినైతే అనుమానిస్తున్నారో వారందరికీ నోటీసులు జారీ చేయండి.

అవి అక్రమ నిర్మాణాలనేందుకు ఉన్న ఆధారాలు ఇవ్వండి. కూల్చివేతలకు దారి తీసిన పరిస్థితులను ప్రస్తావించండి. నోటీసులకు స్పందించేందుకు, స్థలాన్ని విడిచి వెళ్లేందుకు రెండు వారాల గడువు ఇవ్వండి. తరువాత తగిన నిర్ణయం వెలువరించి, కూల్చివేత ఏ విధంగా సమర్థనీయమో వివరించండి. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశాకే కూల్చివేతల చర్య తీసుకోండి..’’ అని అధికారులకు న్యాయమూర్తి ఆదేశించారు. ఇక ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు ఆ స్థలంలో తదుపరి నిర్మాణాలేవీ చేపట్టడానికి వీల్లేదని స్పష్టం చేస్తూ.. విచారణను అక్టోబర్ 18కి వాయిదా వేశారు.

మరిన్ని వార్తలు