మంద కృష్ణపై అక్రమ కేసులను ఎత్తివేయాలి

24 Jan, 2018 01:05 IST|Sakshi
సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో మాట్లాడుతున్న గద్దర్‌

     రౌండ్‌ టేబుల్‌ సమావేశం డిమాండ్‌

     అఖిలపక్షాన్ని ఢిల్లీకి ఎప్పుడు తీసుకెళ్తారు: గద్దర్‌  

హైదరాబాద్‌: ఎంఆర్‌పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని, ఆయనను బేషరతుగా విడుదల చేయాలని పలువురు వక్తలు డిమాండ్‌ చేశారు. మంగళవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మాదిగ స్టూడెంట్‌ ఫెడరేషన్, మాదిగ మేధావుల వేదిక ఆధ్వర్యంలో రౌండ్‌ టేబుల్‌ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రజా గాయకుడు గద్దర్, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు డాక్టర్‌ చెరుకు సుధాకర్, టీపీసీసీ నేత మల్లు రవి, ప్రొఫెసర్‌ గాలి వినోద్‌కుమార్‌ తదితరులు ప్రసంగించారు.

గద్దర్‌ మాట్లాడుతూ దళితుల ఆత్మగౌరవం కోసం పోరాడుతున్న నాయకుడిని అక్రమంగా అరెస్ట్‌ చేయడం సరైంది కాదన్నారు.  ఎస్సీ వర్గీకరణపై పార్లమెంట్‌లో బిల్లు పెట్టాలని, అందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ అఖిలపక్షాన్ని ఢిల్లీకి ఎప్పుడు తీసుకెళ్తారో స్పష్టం చేయాలని డిమాండ్‌ చేశారు. అత్యంత అరాచకంగా, అప్రజాస్వామికంగా మంద కృష్ణమాదిగను అరెస్ట్‌ చేశారని డాక్టర్‌ చెరుకు సుధాకర్‌ ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయబద్ధమైన హక్కుల కోసం పోరాడుతున్న మంద కృష్ణను అక్రమంగా అరెస్ట్‌ చేయడం హేయమైన చర్య అని మల్లురవి అన్నారు. రాష్ట్రంలో కోటి మంది మాదిగలు ఉన్నారని, ఈ మాదిగలు తలుచుకుంటే ప్రభుత్వాన్ని కూల్చివేస్తారని గాలి వినోద్‌కుమార్‌ అన్నారు.

తెలంగాణలో జరుగుతున్న నిర్బంధాలకు వ్యతిరేకంగా ఫిబ్రవరి 4న ఓయూలో నిర్వహించే భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు. ప్రొఫెసర్‌ కాశీం అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఉ. సాంబశివరావు, అద్దంకి దయాకర్, నల్లా రాధాకృష్ణ, ప్రొఫెసర్లు మధు, జి. లక్ష్మణ్, ముత్తయ్య, ఇటుకాల పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు