కూలిన అక్రమ నిర్మాణం

12 Jun, 2016 02:00 IST|Sakshi
కూలిన అక్రమ నిర్మాణం
  • ఇద్దరి మృతి.. మరో ఇద్దరికి తీవ్రగాయాలు
  •  వివాదాస్పద స్థలంలో అర్ధరాత్రి హడావుడిగా నిర్మాణం
  •  
     హైదరాబాద్: అర్ధరాత్రి అక్రమ నిర్మాణ పనులు చేస్తుండటం.. హడావుడి పనుల కారణంగా స్లాబ్ ఒక్కసారిగా కుప్పకూలింది. దీంతో ఇద్దరు కార్మికులు అక్కడికక్కడే మృతిచెందగా, మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన హైదరాబాద్‌లోని హుస్సేనీఆలం ఖబూతర్‌ఖానాలో శుక్రవారం అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో చోటు చేసుకుంది. రెండంతస్తుల ఎత్తులో నామమాత్రపు ఆధారంతో అక్రమంగా నిర్మిస్తున్న స్లాబ్ ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ సంఘటనలో నందు (26), వెంకటయ్య (40) అనే ఇద్దరు కార్మికులు మృతి చెందారు. పోలీసులు, ఇతర కార్మికులు తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబ్‌నగర్ జిల్లా పానగల్ మండలంలోని దావస్‌పల్లి గ్రామానికి చెందిన


    ఆనంద్ ఆలియాస్ నందు(26)కు భార్య, ఓ బాబు ఉన్నారు. అదే జిల్లా వనపర్తికి చెందిన వెంకటయ్య(40) సైదాబాద్‌లో ఉంటున్నాడు. ఈయనకు భార్య, కుమారుడు, కూతురు ఉన్నారు. వీరిద్దరు రెండు నెలలుగా ఖబూతర్‌ఖానాలోని మహేశ్వరి సేవా ట్రస్టు విద్యాలయ భవనం నిర్మాణ పనులకు వెళ్తున్నారు. శుక్రవారం రాత్రి రెండో అంతస్తులో స్లాబ్ వేసేందుకు అంతా పని ప్రారంభించారు. కింది నుంచి 30 అడుగుల ఎత్తులో ఉన్న స్లాబ్‌కు గోవాలు, కట్టెలు, రాడ్లను ఆధారంగా పెట్టి పనులు నిర్వహిస్తున్నారు. అర్ధరాత్రి ఒంటి గంటకు స్లాబ్ ఒక్కసారిగా కుప్పకూలింది. ఇనుప చువ్వలు గుచ్చుకొని వెంకటయ్య, నందు అక్కడికక్కడే మృతి చెందారు. జయప్రకాశ్, శివకుమార్ తీవ్రంగా గాయపడగా, మరికొందరికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న హుస్సేనీఆలం పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని గాయపడిన వారిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. వెంకటయ్య, నందు మృతదేహాలను ఉస్మానియా మార్చురీకి తరలించారు. వెంకటయ్య భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.


     కేసు నమోదు: నిర్లక్ష్యంతో స్లాబ్ నిర్మాణాన్ని చేపట్టిన మహేశ్వరి విద్యాలయ సేవా ట్రస్టు నిర్వాహకుడు శివ కుమార్ బంగ్, బిల్డర్ అమీనుద్దీన్, సైట్ ఇంజనీర్ శివకుమార్, సెంట్రింగ్ వర్కర్ అనంత్ రెడ్డిలపై పోలీసులు 334ఏ, 337 ఆర్/డబ్ల్యూ 34 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రభుత్వ స్థలంలో అక్రమ నిర్మాణాలు చేపట్టి ఇద్దరు అమాయకుల మృతికి కారణమైన మహేశ్వరి సేవా ట్రస్టు ప్రతినిధులపై క్రిమినల్ కేసు నమోదు చేయాల్సిందిగా జీహెచ్‌ఎంసీ దక్షిణ మండలం టౌన్ ప్లానింగ్ అధికారులు హుస్సేనీఆలం పోలీస్‌స్టేషన్‌లో లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు.
     

>
మరిన్ని వార్తలు