కాసులిస్తే..సై!

20 Apr, 2016 00:58 IST|Sakshi
కాసులిస్తే..సై!

విచ్చలవిడిగా అక్రమ నిర్మాణాలు
నగరం నలుమూలలా ఇదే పరిస్థితి
నిబంధనలు బేఖాతరు... టౌన్ ప్లానింగ్
విభాగంలో అవినీతి రాజ్యం
అడ్డగోలుగా అనుమతుల మంజూరు

 

ఈ మహానగరం వాతావరణంతో సహ అన్ని విధాలా అందరికీ అనుకూలమైన నగరం. అక్రమ నిర్మాణాలు జరిపే వారికి మరింత అనుకూల నగరం. ఎందుకంటే కాసులిచ్చి అడ్డగోలుగా నిర్మాణాలు జరిపినా పట్టించుకునే వారుండరు. అధికారుల చేతులు తడిపి.. నిబంధనలకు చెల్లుచీటీ చెప్పి...అంతస్తుల మీద అంతస్తులు వేసుకుంటూ పోయినా...కుప్పకూలితే తప్ప పట్టించుకోరు. నివాస భవనానికి అనుమతి పొంది, వాణిజ్య కాంప్లెక్సులు నిర్మించినా కళ్లు తెరచి చూడరు. చెరువుల ఎఫ్‌టీఎల్‌లో నిర్మాణాలు జరిపినా మనకెందుకులే అని మిన్నకుంటారు. స్థలం దరఖాస్తుదారుది అవునో కాదో చూడరు. సర్కారు స్థలంలో నిర్మించినా సర్వే నెంబరు ఒకటే కనుక కరెక్టేననుకుంటారు.  భవనం కట్టకముందే కనికట్టుతో బీఆర్‌ఎస్‌కు దరఖాస్తు చేసుకోవచ్చిక్కడ. ఆ తర్వాత తాపీగా నిర్మాణం పూర్తిచేసి క్రమబద్ధీకరణా పూర్తిచేసుకోవచ్చు. మూడు రకాల అనుమతులు పొంది...అన్నీ కలిపి క్లబ్ చేసి కట్టడాలు చేపట్టొచ్చు. ఇన్ని అనుకూలతలు ఉండగా.. అక్రమనిర్మాణం జరపకుండా ఉంటారా..?!

 
మహానగరంలో అడ్డగోలు నిర్మాణాలు, జీహెచ్‌ఎంసీ, టౌన్‌ప్లానింగ్ అధికారుల నిర్వాకాలు..అవినీతి అక్రమాలు..పొంచి ఉన్న ప్రమాదాలపై ‘సాక్షి’  ఫోకస్... సాక్షి, సిటీబ్యూరో:   గడచిన దశాబ్దకాలంలో నగర జనాభా, విస్తీర్ణం ఎంతో పెరిగినప్పటికీ, అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం, సిబ్బంది పెరగ లేదు. దీంతో ఉన్న కొద్దిమందే ఎక్కువమందికి సేవలందించాల్సిన పరిస్థితి. శివారు మునిసిపాలిటీల విలీనంతో నగర విస్తీర్ణం 170  చ.కి.మీల నుంచి రూ. 625 చ.కి.మీలకు పెరిగినప్పటికీ అందుకనుగుణంగా సేవలు పెరగలేదు. పనుల్లో జాప్యం పెరిగింది. నాణ్యత కొరవడింది. దీంతో తమ పని వేగంగా జరగడం కోసం ముడుపులివ్వడం ప్రజలకు అలవాటైంది. దాన్ని రుచిమరిగిన అధికారులు పైసలు లేనిదే ఫైలు చూడని పరిస్థితికి చేరుకున్నారు. దాదాపుగా జీహెచ్‌ఎంసీలోని అన్ని విభాగాల్లో ఇదే పరిస్థితి ఉన్నప్పటికీ,  టౌన్‌ప్లానింగ్ విభాగంలో తీవ్రస్థాయికి చేరింది. లంచాలు తీసుకుంటూ పట్టుబడినవారిలో, అక్రమాస్తుల వలలో చిక్కిన వారిలో ఈ విభాగం వారే ఎక్కువగా ఉండటం ఇందుకు నిదర్శనం. అక్రమాలపై చర్యల లేమిని తప్పుపడుతూ హైకోర్టు తీవ్రంగా మందలించిన ఘటనలకూ కొదవలేదు. అయినప్పటికీ ఈ విభాగం తీరు మారలేదు. జీహెచ్‌ఎంసీలో వారం వారం జరిగే ప్రజావాణికి అందుతున్న ఫిర్యాదుల్లో 75 శాతం ఈ విభాగానివే. గడచిన ఏడాది కాలంలో 800కు పైగా ఫిర్యాదులు దీనివే.

 

సగం కూడా లేని సిబ్బంది...

టౌన్‌ప్లానింగ్ విభాగానికి 412 మంది సిబ్బంది అవసరం కాగా... కేవలం 123 మంది మాత్రమే ఉన్నారు. 289 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇందులో 199 టీపీఎస్, 31 బిల్డింగ్‌ఇన్‌స్పెక్టర్, 30 టౌన్‌ప్లాన్ సూపర్‌వైజర్ పోస్టులున్నాయి. దీంతో ఉన్న కొద్దిమందికి పని ఒత్తిడి ఎక్కువ కావడంతో చేయి తడపనిదే పనిచేయని పరిస్థితికి చేరుకున్నారని, లంచాల రుచి మరిగి విచ్చలవిడిగా అక్రమ నిర్మాణాలు జరుగుతున్నా చూసీ చూడనట్లు నటిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.  బీఆర్‌ఎస్‌గడువు ముగిశాక కూడా నగరంలో ఏ దిక్కున చూసి నా లెక్కకు మిక్కిలిగా అక్రమ నిర్మాణాలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. ఇందుకు కొన్ని ఉదాహరణలివీ...

 
ఈస్ట్‌జోన్‌లో  బెస్ట్ సంపాదన..

కొత్తపేట డివిజన్ మోహన్‌నగర్ చౌరస్తాలో 60 గజాల స్థలంలో ఎలాంటి సెట్‌బ్యాక్స్ లేకుండా ఐదంతస్తుల్లో వాణిజ్య భవన నిర్మాణం జరుగుతోంది. లక్షల రూపాయలు చేతులు మారాయనే ఆరోపణలున్నాయి. అన్నీ సవ్యంగా ఉన్నా  జీ+1 ఇంటి నిర్మాణానికి రూ.50 వేలు, కమర్షియల్ భవనం అయితే రూ.2 లక్షలు, అపార్ట్‌మెంట్ అయితే రూ.3 లక్షలు, కమర్షియల్ అపార్ట్‌మెంట్ అయితే రూ.5 లక్షల వరకు టౌన్‌ప్లానింగ్ అధికారులు, ప్లానర్స్ దండుకుంటున్నారని, లేకుంటే అడుగడుగునా కొర్రీవేస్తున్నారని బిల్డర్లు ఆరోపిస్తున్నారు.

 
వెస్ట్‌జోన్‌లో అడ్డే లేదు..

శేరిలింగంపల్లి-1 సర్కిల్  పరిధిలోని అంజయ్యనగర్‌లో యథేచ్చగాఅక్రమ నిర్మాణాలు కొనసాగుతున్నాయి. వంద గజాల ప్లాట్‌లో సెట్ బ్యాక్స్ లేకుండా ఐదంతస్తుల  భవనాలు నిర్మిస్తున్నారు.  గచ్చిబౌలి హౌసింగ్ బోర్డు, ఇందిరానగర్, జేవీ కాలనీ, గఫూర్‌నగర్, దుర్గం చెరువు ఎఫ్‌టీఎల్, పత్రికానగర్, శ్రీరాంనగర్ కాలనీ, రాఘవేంద్ర కాలనీ, నల్లగండ్ల, తారానగర్‌లలో యాభైకి పైగా అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయి. టౌన్‌ప్లానింగ్ విభాగంలోని చైన్‌మన్లు అధికారులకు, డిప్యూటీ కమిషనర్లకు ఏజెంట్లుగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. నల్లగండ్ల, తారానగర్‌లో ఓ మధ్యవర్తి రూ. 6 లక్షలు  వసూలు చేశారనే ఆరోపణలున్నాయి.


రెండు ఫ్లోర్లకు మాత్రం అనుమతులు పొంది అధికారుల అండతో మరో రెండు ఫ్లోర్లు అదనంగా నిర్మిస్తున్నారు. గుల్‌మోహర్‌పార్క్ కాలనీ ప్రధాన ముఖ ద్వారం సమీపంలో, భెల్ ఎంఐజీ కాలనీ, నల్లగండ్లలోని జరుగుతున్న నిర్మాణాలే ఇందుకు సాక్ష్యం. శేరిలింగంపల్లి -2 లో ఓల్డ్ ముంబై జాతీయ రహదారికి ఇరువైపులా అనేక అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయి. రెడ్డికాలనీ, చందానగర్, మియాపూర్, హఫీజ్‌పేట, మదీనాగూడ, కొండాపూర్, ఖానామెట్, అయ్యప్పసొసైటీ, రవీంద్ర సొసైటీలలో ఇలాంటి అక్రమ నిర్మాణాలు దాదాపు 70 వరకు ఉన్నట్లు అంచనా. గోకుల్  ప్లాట్‌లో అక్రమంగా నిర్మాణాలు చేసిన వారినుంచి టౌన్‌ప్లానింగ్ అధికారులు  కోటి రూపాయలు వసూలు చేశారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.  టీపీఎస్‌లు, ఏసీపీలు అక్రమ నిర్మాణదారులతో కుమ్ముక్కై అందినకాడికి దండుకుంటున్నారు.


సౌత్‌లోనూ షరా ‘మామూలు’
రాజేంద్రనగర్ సర్కిల్‌లోని రాజేంద్రనగర్, గోల్డెన్ హైట్స్, ఫోర్ట్‌వ్యూ కాలనీ, హైదర్‌గూడ, అత్తాపూర్, శివరాంపల్లి, సులేమాన్‌నగర్, శాస్త్రీపురం, మైలార్‌దేవ్‌పల్లి, టీఎన్‌జీవోస్ కాలనీ, గగన్‌పహాడ్ ప్రాంతాల్లో సైతం అక్రమ నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి.  ఈ జోన్ పరిధిలోని పాతబస్తీలోనూ అక్రమ నిర్మాణాలు తక్కువేం లేవు. అక్రమ నిర్మాణాలు కూల్చివేయకుండా కోర్టు నుంచి ఎలా స్టే తెచ్చుకోవాలో కూడా టౌన్‌ప్లానింగ్ వారే చెబుతున్నారని ఆరోపణలున్నాయి.

 
ఉత్తరాన  భారీగా..

వాణిజ్య సముదాయాలెక్కువగా ఉన్న నార్త్‌జోన్‌లోని సికింద్రాబాద్‌లో అక్రమ నిర్మాణాలకు అడ్డూ అదుపూ లేదు.  ప్రధాన రహదారులపైనే యధేచ్ఛగా అక్రమ నిర్మాణాలు జరుగుతున్నా  అధికారులు నామ్‌కేవాస్తేగా నోటీసులిచ్చి చేతులు దులుపుకుంటున్నారు.   సికింద్రాబాద్ సర్కిల్‌లో గడచిన రెండేళ్లలోనే 1072 అక్రమ నిర్మాణాలు జరిగినట్లు గుర్తించారు. మోండా మార్కెట్, రాంగోపాల్‌పేట్ తదితర ప్రాంతాల్లో ద్విచక్రవాహనాలు కూడా వెళ్లలేని ఇరుకు సందుల్లో  వాణిజ్య భవనాలు  వెలుస్తున్నాయి.  అధికారులకు లంచాలిచ్చి..  స్థానిక  ప్రజాప్రతినిధుల  మద్దతుతో నిర్మాణాలు సాగిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

 
సెంట్రల్ జోన్‌లోనూ అదే తీరు..

సంపన్నులుండే ఈ జోన్‌లో పైసలు ముడుతుండటంతో ఫైళ్లు చకచకా కదులుతాయనే ప్రచారం ఉంది. అదే వేగంతో అక్రమాలు సాగుతున్నాయి. రెంంతస్తులకు అనుమతి పొంది.. ఆరంతస్తులు నిర్మిస్తున్న భవనం గురించి కేంద్ర హోంశాఖ రిటైర్డు సెక్రటరీ ఫిర్యాదు చేసినా అధికారులు ఏమీ చేయలేకపోయారు. కడకు హైకోర్టు నాశ్రయించారు. నెల రోజుల్లో సదరు అక్రమ నిర్మాణానికి సంబంధించి చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించింది.

మరిన్ని వార్తలు