అధికారుల అండతోనే అక్రమ నిర్మాణాలు

31 Dec, 2017 03:22 IST|Sakshi

జీహెచ్‌ఎంసీ అధికారులపై హైకోర్టు మండిపాటు 

సాక్షి, హైదరాబాద్‌: అక్రమ నిర్మాణం జరుగుతున్నప్పుడు ఉదాసీనంగా వ్యవహరించి.. ఆ తర్వాత కూల్చివేత నోటీసులతో చేతులు దులుపుకుంటున్నారని జీహెచ్‌ఎంసీ అధికారులపై ఉమ్మడి హైకోర్టు తీవ్రస్థాయిలో మండిపడింది. అక్రమ నిర్మాణదారులు కింది కోర్టును ఆశ్రయించి సానుకూల ఉత్తర్వులు పొందేందుకు సహకరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. అధికారుల తీరు వల్లే అక్రమ నిర్మాణాలు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయని ఆక్షేపించింది.

హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ఎంతమంది అక్రమ నిర్మాణదారులు కింది కోర్టులను ఆశ్రయించి సానుకూల ఉత్తర్వులు పొందారో జాబితా తమ ముందుంచాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ను ఆదేశించింది. అక్రమ నిర్మాణాలకు అడ్డుకట్ట వేసేందుకు ఏం ప్రణాళికలు సిద్ధం చేశారో కూడా వివరించాలని పేర్కొంది. తదుపరి విచారణను జనవరి 30కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ చల్లా కోదండరాం ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో జరుగుతున్న ఓ అక్రమ నిర్మాణంపై హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది.  

మరిన్ని వార్తలు