మంచంపైనే నిఖిల్

24 May, 2016 00:26 IST|Sakshi
మంచంపైనే నిఖిల్

ఆపరేషన్ జరిగి 50 రోజులైనా కదలలేని స్థితే
 
 హైదరాబాద్: నిఖిల్‌రెడ్డి... ఎత్తు పెరిగేందుకు నగరంలోని గ్లోబల్ ఆసుపత్రిలో శస్త్రచికిత్స చేయించుకున్న 22 ఏళ్ల యువకుడు ఇంకా మంచానికే పరిమితయ్యాడు. ఆపరేషన్ జరిగి యాభై రోజులయినా అడుగు కదపలేకపోతున్నాడు. జీడిమెట్లలోని మర్రి నారాయణరెడ్డినగర్‌లో నివసిస్తున్న నిఖిల్ పరిస్థితి ఇప్పుడు దయనీయంగా మారింది. వారం రోజుల్లో నడుస్తావని వైద్యులు చెప్పిన మాటలు అబద్ధాలని తేలింది. ఆరోగ్యం అంతకంతకూ క్షీణిస్తూ... నొప్పులు బాధిస్తూ... పెయిన్‌కిల్లర్లతో బతుకుతూ... వేరొకరు తోడుంటే గానీ నడవలేని దయనీయ స్థితిలో కాలం వెళ్లదీస్తున్నాడు.

ఈ బాధ చూసి అతడి తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమవుతున్నారు. కాగా, మూడంగుళాల ఎత్తు పెరుగుతావంటూ నిఖిల్‌రెడ్డికి గ్లోబల్ ఆసుపత్రి వైద్యులు ఏప్రిల్ 5న శస్త్రచికిత్స చేశారు. రెండు రోజుల్లో లేచి తిరుగుతావని ఆపరేషన్ చేసిన వైద్యుడు చంద్రభూషణ్ నాడు చెప్పినా... నేటికీ మంచం దిగలేకపోతున్నాడు నిఖిల్. ‘డిశ్చార్జి అయిన తరువాత నుంచి రోజూ ఇంటికి వచ్చి ఫిజియోథెరపీ చేయిస్తామన్న వైద్యులు, వారానికోమారు వచ్చి వెళ్లిపోతున్నారు. పెయిన్‌కిల్లర్ మాత్రలు రోజూ వేసుకోమంటూ ఫోన్‌లోనే సలహా ఇచ్చి తప్పించుకొంటున్నారు’ అని నిఖిల్ తండ్రి గోవర్ధన్‌రెడ్డి చెప్పారు.
 
 తప్పు చేశా...
 ‘నేను తీసుకున్న నిర్ణయం తప్పు. నా వల్ల ఇంట్లో వాళ్లు ఇబ్బందులు పడుతున్నారు. సర్జరీ జరిగి యాభై రోజులైనా కనీసం నిలబడలేకపోతున్నా. ఆపరేషన్ సమయంలో రోజుకు 1 ఎంఎం బోన్ పెరుగుతుందని వైద్యులు చెప్పిన మాటలన్నీ అబ ద్ధాలే. నాన్న సాయం లేనిదే ఏమీ చేయలేకపోతున్నా. ఆపరేషన్ చేసిన ప్రాంతమంతా దద్దుర్లు వచ్చి విపరీతమైన దురద పుడుతోంది. ఇన్‌ఫెక్షన్ అయి పుండ్లు వచ్చాయి. ఇన్ని రోజులు సెలవుల్లో ఉంటే తిరిగి జాబ్ ఇస్తారన్న గ్యారంటీ లేదు’ అని నిఖిల్ ఆవేదన వ్యక్తం చేశాడు.

>
మరిన్ని వార్తలు