విశాఖ కలెక్టర్‌కు జైలుశిక్ష

19 Mar, 2017 02:28 IST|Sakshi
విశాఖ కలెక్టర్‌కు జైలుశిక్ష

సాక్షి, హైదరాబాద్‌: కోర్టు ధిక్కార కేసులో గ్రేటర్‌ విశాఖపట్నం నగర పాలక సంస్థ (జీవీఎంసీ) పూర్వ కమిషనర్, ప్రస్తుత జిల్లా కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌కు ఉమ్మడి హైకోర్టు జైలుశిక్ష విధించింది. ఉద్దేశ పూర్వకంగా కోర్టు ఆదేశాలను ఉల్లంఘించినందుకు ఆయనకు 30 రోజుల సాధారణ జైలుశిక్ష, రూ.1,500 జరిమానా విధించింది. 4 వారాల్లో జరిమానా చెల్లిం చాలని, లేకుంటే మరో నెలపాటు జైలుశిక్ష అనుభవించాలని స్పష్టం చేసింది. దీనిపై అప్పీల్‌ దాఖలు చేసుకునేందుకు వీలుగా ఈ తీర్పు అమలును 4 వారాల పాటు నిలుపుదల చేసింది. జైలుశిక్ష అనుభవించే సమయంలో ప్రవీణ్‌ కుమార్‌కు రోజుకు రూ.300 జీవన భృతి కింద చెల్లించాలని అధికారులను ఆదే శించింది. ఈ మేరకు న్యాయ మూర్తి జస్టిస్‌ ఎం.ఎస్‌.రామచంద్రరావు ఇటీ వల తీర్పు చెప్పారు.

విశాఖకు చెందిన జుపిటర్‌ ఆటోమొబైల్స్‌ వాల్తేర్‌ వార్డు లోని ప్లాట్‌ నంబరు 44లో భవన నిర్మాణం నిమిత్తం జీవీఎంసీకి 2009లో చేసుకున్న దరఖాస్తును జీవీఎంసీ అధి కారులు తిరస్కరించారు. దీన్ని సవాలు చేస్తూ జుపిటర్‌ ఆటోమొబైల్స్‌ హైకోర్టులో వేర్వేరు సంవత్సరాల్లో పలు పిటిషన్లు దాఖలు చేసింది. వీటిపై విచారణ జరిపిన జస్టిస్‌ రామచంద్రరావు.. భవన నిర్మాణానికి అనుమతి మంజూరు చేయాలని  ఆదేశిం చినా దరఖాస్తును జీవీఎంసీ అధికారులు   తిరస్కరించారు. దీంతో జుపిటర్‌ జీవీఎంసీ అప్పటి కమిషనర్‌ ప్రవీణ్‌కుమార్‌పై కోర్టు ధిక్కార పిటిషన్‌ దాఖలు చేశారు.

>
మరిన్ని వార్తలు