వీటికి ఏ ఆధారాలున్నాయి?

15 Mar, 2016 03:16 IST|Sakshi
వీటికి ఏ ఆధారాలున్నాయి?

♦ విపక్షనేతపై ఎడాపెడా ఆరోపణలు.. అనుచిత వ్యాఖ్యలు
♦ కోర్టు పరిధిలోని అంశాలూ ప్రస్తావన..
 
 సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రభుత్వంపై ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై అధికారపక్ష సభ్యులు, మంత్రులు ఎడాపెడా ఆరోపణల వర్షం కురిపించారు. నోటికి వచ్చిందల్లా మాట్లాడుతూ తిట్ల దండకాన్ని వల్లించారు. కోర్టులో విచారణలో ఉన్న అంశాలపై కూడా ఎడాపెడా వ్యాఖ్యలు చేసి కోర్టు ధిక్కారనేరానికి కూడా పాల్పడ్డారు. విచారణలో ఉన్న అంశాలపై విక్షణారహిత వ్యాఖలు చేయడమేకాక వ్యక్తిత్వ హననానికి కూడా ప్రయత్నించడం గమనార్హం. అధికారపక్ష సభ్యులు చేసిన ఏ ఆరోపణకూ ఎలాంటి ఆధారాలూ లేవు. ఏవీ విచారణకు నిలిచేవి కావు. అయినా అసెంబ్లీ సాక్షిగా ఎడాపెడా ఆరోపణల వర్షం కురిపించారు. వాటిలో కొన్నిటిని చూద్దాం..

► అలిపిరి బాంబుదాడిలో పాల్గొన్న నక్సలైట్లకు ఆశ్రయమిచ్చిన గంగిరెడ్డి వైఎస్ జగన్ ఇంట్లో మనిషి. రాజశేఖరరెడ్డి పెంచిన మొక్క. ఒక క్రిమినల్‌ను ప్రతిపక్షనేత కాబట్టి మేం కూడా గౌరవించాల్సి వచ్చింది.
     - బోండా ఉమామహేశ్వరరావు, ఎమ్మెల్యే
► మైనర్‌గా ఉండగానే ఎర్రగడ్డ జంక్షన్‌లో సూట్‌కేసు బాంబుతో వచ్చిన వ్యక్తి జగన్‌మోహన్‌రెడ్డి. వైఎస్‌ఆర్ పదేళ్ల హయాంలో జరిగిన హత్యలన్నిటింటికీ కారణం ఆయన. ఆ మనస్తత్వం ఇంకొకరికి ఆపాదిస్తున్నారు.
     - కిమిడి కళా వెంకట్రావు, ఎమ్మెల్యే
►  అరాచకాలు సృష్టించి రాజకీయంగా పబ్బం గడుపుకోవడానికి ప్రయత్నించడం ఆయన తండ్రి వైఎస్‌ఆర్‌కు, వైఎస్ జగన్‌కు అలవాటు. హైదరాబాద్లో నరమేధం సృష్టించి అధికారంలోకి రావాలనుకున్న వ్యక్తి రాజశేఖరరెడ్డి. తునిలో ఇలాంటి అరాచకశక్తులు (జగన్‌వైపు చేయి చూపుతూ) చేరి హింసాత్మక ఘటనలు ప్రేరేపించారు.    
     - తోట త్రిమూర్తులు, ఎమ్మెల్యే
 
 ఇడుపుల పాయలోని బంకర్లలో అవినీతి డబ్బు దాచినందుకు గాను కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. వారం వారం కోర్టు బోనుల్లో నిలబడుతున్నారు.
 - యనమల రామకృష్ణుడు,శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి
 
 కాపు ఉద్యమం సందర్భంగా ట్రెయిన్ తగులబెట్టిన ఘటనలో కృష్ణా, గుంటూరు జిల్లాల్లో గొడవలు రెచ్చగొట్టడానికి వాళ్ల పార్టీ వాళ్లను జగన్ బ్రతిమలాడాడు. వాళ్లు కుదరదంటే సిగ్గుతో ఫోన్ పెట్టేశాడు.
     - దేవినేని ఉమామహేశ్వరరావు,జలవనరుల శాఖ మంత్రి
 
 ఇంత నీచమైన నాయకుడి దగ్గర పనిచేయడానికి కష్టంగా ఉందని మీ ఎమ్మెల్యేలు మాతో మాట్లాడుతున్నారు. నిన్ను అసహ్యించుకుని నీ ఎమ్మెల్యేలు మా దగ్గరకు వస్తున్నారు. ఇలాంటి ప్రతిపక్ష నాయకుడు ఉండడం మా దౌర్భాగ్యం. 11 చార్జిషీట్లలో ముద్దాయిగా ఉన్న వ్యక్తి నీతులు చెబుతుండడం, మనం ఆలకించాల్సి రావడం మన ఖర్మ.        
     - కింజరాపు అచ్చెన్నాయుడు, కార్మిక శాఖ మంత్రి
 
 ఎస్సీ ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులను దారిమళ్లించి దోపిడీ చేసి దుర్మార్గం చేసి దలితులను నిరుద్యోగంలో పేదరికంలో ముంచిన ఘనత వైఎస్ రాజశేఖరరెడ్డిది.. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిది.  
 - రావెల కిశోర్ బాబు,సాంఘిక సంక్షేమశాఖ మంత్రి

మరిన్ని వార్తలు