గ్రేటర్‌కు జలగండం

6 Aug, 2015 00:54 IST|Sakshi
గ్రేటర్‌కు జలగండం

- నగరంలో తీవ్ర వర్షాభావం
- అడుగంటుతున్న భూగర్భ జలం
- జలాశయాల్లోనూ పడిపోతున్న నీటిమట్టం
సాక్షి,సిటీబ్యూరో:
గ్రేటర్‌లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ఫలితంగా మహా నగర దాహార్తిని తీరుస్తున్న జలాశయాలతో పాటు భూగర్భ జలమట్టాలు శరవేగంగా అడుగంటుతున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే సెప్టెంబర్ నెలలో గ్రేటర్ పరిధిలో తాగునీటికి కటకట తప్పదని జలమండలి వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు గత ఏడాదితో పోలిస్తే ప్రతి మండలంలోనూ భూగర్భ జల మట్టాలు ఆందోళన కలిగించే స్థాయిలో పడిపోయాయి.

జలమండలి మంచినీటి సరఫరా నెట్‌వర్క్ లేని శివారు ప్రాంతాల్లో భూగర్భ జలాలు అడుగంటడంతో బోరుబావులు వట్టిపోయి.. ప్రైవేటు నీటి ట్యాంకర్లు, ఫిల్టర్‌ప్లాంట్లను ఆశ్రయించి జనం జేబులు ఖాళీ చేసుకుంటున్నారు. గ్రేటర్ పరిధిలో గత ఏడాది జూలై చివరి నాటికి సగటున 9.59 మీటర్ల లోతున పాతాళ గంగ దొరకగా.. ఈసారి 11.21 మీటర్ల లోతునకు వెళితే గానీ నీటిజాడ కనిపించడం లేదు. గ త సంవత్సరం కంటే సుమారు 1.63 మీటర్ల లోతున భూగర్భ జలాలు తగ్గడం ఆందోళన కలిగిస్తోంది.

‘బోరు’మంటున్నాయ్...
నగరంలో సుమారు 23 లక్షల బోరుబావులు ఉన్నాయి. ఇళ్లలో ఉన్న వీటికి ఆనుకొని ఇంకుడు గుంతలు లేకపోవడంతోనే నీటి సమస్య ఉత్పన్నమవుతోంది. గతజూలైతో పోలిస్తే ప్రస్తుత ఏడాది జూలై చివరి నాటికి నాంపల్లి మండలంలో అత్యధికంగా 6.75 మీటర్ల మేర భూగర్భ జలమట్టాలు తగ్గుముఖం పట్టాయి. మారేడ్‌పల్లి మండలంలో 4.25 మీటర్లు, ఖైరతాబాద్‌లో 1.55 మీటర్లు, ఆసిఫ్‌నగర్‌లో 4.37 మీటర్లు, బండ్లగూడలో 0.30 మీటర్లు, బహదూర్‌పురాలో 0.48 మీటర్లు, హయత్‌నగర్‌లో 0.58 మీటర్లు, మహేశ్వరంలో 3.15 మీటర్లు, ఉప్పల్‌లో 0.55 మీటర్లు, బాలానగర్‌లో 0.80 మీటర్ల మేర నీటిమట్టాలు తగ్గాయి. దీంతో ఆ ప్రాంతాల  ప్రజలు నీటి కోసం అవస్థలు పడుతున్నారు.
 
జలాశయాల్లోనూ అదే దుస్థితి
ఎగువ ప్రాంతాల్లో వర్షాలు లేకపోవడంతో గ్రేటర్ దాహార్తిని తీరుస్తున్న జలాశయాల్లోనూ నీటి మట్టాలు అనూహ్యంగా పడిపోతున్నాయి. ఉస్మాన్ సాగర్ (గండిపేట్) గరిష్ట మట్టం 1790 అడుగులకు గాను ప్రస్తుతం 1756.800 అడుగుల మేరకు నిల్వలు ఉన్నాయి. ఈ జలాశయం నుంచి నిత్యం 5 మిలియన్ గ్యాలన్ల నీటిని జలమండలి సేకరిస్తోంది. ఇదే రీతిన సేకరిస్తే మరో 24 రోజుల పాటు మాత్రమే ఈ నిల్వలు సరిపోతాయని జలమండలి వర్గాలు తెలిపాయి.

ఇక హిమాయత్‌సాగర్ గరిష్ట మట్టం 1763.500 అడుగులు. ప్రస్తుతం 1742.110 అడుగుల మేర నీళ్లున్నాయి. ఈ జలాశయం నుంచి జలమండలి నిత్యం 16.90 మిలియన్ గ్యాలన్ల నీటిని సేకరిస్తోంది. ఈ నిల్వలు మరో 117 రోజుల పాటు నగర అవసరాలకు సరిపోతాయని అంచనా. ఇక సింగూరు గరిష్ట మట్టం 1717.932 అడుగులు కాగా.. ప్రస్తుతం 1686.509 అడుగుల మేర నిల్వలు ఉన్నాయి. ఈ జలాశయం నుంచి నిత్యం 75 ఎంజీడీల జలాలను సేకరిస్తున్నారు.  ఈ నిల్వలు 365 రోజుల అవసరాలకు సరిపోనున్నాయి. మంజీర జలాశయం గరిష్ట మట్టం 1651.750 అడుగులకు..ప్రస్తుతం 1644.900 అడుగుల మేర నిల్వలు ఉన్నాయి. ఈ జలాశయం నుంచి నిత్యం 45 ఎంజీడీల నీటిని సేకరిస్తున్నారు. ఈ నిల్వలు 365 రోజుల పాటు నగర తాగునీటి అవసరాలకు సరిపోనున్నాయి.

ఇక అక్కంపల్లి (కృష్ణా) జలాశయం గరిష్టమట్టం 245 మీటర్లకు ప్రస్తుతం 244.400 మీటర్ల మేర నిల్వలున్నాయి. ఇవి మరో 365 రోజులపాటు నగర అవసరాలకు సరిపోనున్నాయి. నాగార్జునసాగర్(కృష్ణా) గరిష్ట మట్టం 590 అడుగులకు ప్రస్తుతం 510.600 అడుగుల మేర నిల్వలున్నాయి. ఇవి మరో ఏడాది పాటు నగర అవసరాలకు సరిపోతాయని జలమండలి ప్రకటించింది. మొత్తంగా అన్ని జలాశయాల నుంచి రోజువారీ 366.90 ఎంజీడీల నీటిని సేకరించి... శుద్ధిచేసి 8.64 లక్షల నల్లాలకు సరిపెడుతున్నట్లు తెలిపింది. ఈ నెలలోనూ వర్షాభావ పరిస్థితులు కొనసాగితే సెప్టెంబర్‌లో నీటి కటకట తప్పదని జలమండలి వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

మరిన్ని వార్తలు