సెల్‌ఫోన్‌లో ‘హైదరాబాద్ మెట్రో బస్’

18 Aug, 2015 08:48 IST|Sakshi
సెల్‌ఫోన్‌లో ‘హైదరాబాద్ మెట్రో బస్’

సాక్షి, సిటీబ్యూరో: ఐటీ ఆధారిత సేవలపై గ్రేటర్ ఆర్టీసీ మరో ముందడుగు వేసింది. నగరంలోని బస్సుల సమాచారాన్ని తెలుసుకునేందుకు ‘హైదరాబాద్ మెట్రో బస్’ పేరుతో ప్రత్యేక యాప్‌ను రూపొందించింది. వారం, పది రోజుల్లో ఈ సరికొత్త మొబైల్ అప్లికేషన్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ప్రయాణికులు స్మార్ట్‌ఫోన్ల ద్వారా సిటీబస్సుల సమాచారాన్ని పొందవచ్చు.

 

జీపీఎస్ వైఫల్యాలను అధిగమించి, సాంకేతిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టిన గ్రేటర్ ఆర్టీసీ... అందులో భాగంగానే మొబైల్ యాప్‌ను సిద్ధం చేసింది. దీని ద్వారా నగర ప్రయాణికులే కాకుండా కొత్తగా వచ్చేవారు, పర్యాటకులు, సందర్శకులు గైడ్స్ సాయం లేకుండా సిటీబస్సుల రాకపోకలపై సులువుగా సమాచారాన్ని పొందవచ్చు. ఎన్ని బస్సులు, ఏయే రూట్లు, ఏయే వేళల్లో అందుబాటులో ఉన్నాయనే వివరాలను తెలుసుకోవచ్చు. ప్రస్తుతం 1287 ఏసీ, మెట్రోడీలక్స్, మెట్రో ఎక్స్‌ప్రెస్, మెట్రో డీలక్స్, సూపర్‌లగ్జరీ బస్సులకు సంబంధించి యాప్ సేవలు అందుతాయి. దశల వారీగా ఆర్డినరీ బస్సులకు విస్తరిస్తారు.
 
 ఈ సేవలు ఇక సులువు
 * ‘హైదరాబాద్ మెట్రో బస్’ యాప్‌లో ‘రూట్ సెర్చ్’ ద్వారా రూట్ సమాచారం తెలుస్తుంది. ఉదాహరణకు  రూట్ నెంబర్ ’86’ను సెర్చ్ చేస్తే సికింద్రాబాద్-కోఠి, సికింద్రాబాద్-అఫ్జల్‌గంజ్‌కు రూట్‌లలో నడిచే బస్సుల్లో ఏది ఎక్కడ ఉందో తెలుస్తుంది.
 
 *‘ఫైండ్ బస్టాప్’ ద్వారా పర్యాటకులు, నగరానికి కొత్తగా వచ్చేవారు తాము ఉన్న చోటుకు సమీపంలో ఉన్న బస్ స్టాపులు తెలుసుకోవచ్చు. ఒక కిలోమీటర్ పరిధిలో ఉన్న స్టాపుల వివరాలు మ్యాప్‌తో సహా డిస్‌ప్లే అవుతాయి. ఉదాహరణకు ఆర్టీసీ క్రాస్‌రోడ్స్ నుంచి చిక్కడపల్లి, అశోక్‌నగర్, ముషీరాబాద్ రూట్‌లలో ఉన్న బస్ స్టాపుల వివరాలు తెలుసుకోవచ్చు.


*  ప్రస్తుతం సిటీ బస్సులకే పరిమితమైన యాప్ సేవలను దూరప్రాంత బస్సుల్లో కూడా ప్రవేశపెట్టేందుకు ఆర్టీసీ ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇందుకోసం మరో మొబైల్ యాప్‌ను రూపొందించనున్నారు. మొదట  ‘హైదరాబాద్-కరీంనగర్’,  హైదరాబాద్-బెంగళూరు సర్వీసుల్లో ప్రయోగాత్మకంగా పరీక్షించి మిగతా బస్సులకు విస్తరిస్తారు.

మరిన్ని వార్తలు