నగరంలో ‘నాలా’ రహస్యం..?

21 Sep, 2016 02:44 IST|Sakshi
నగరంలో ‘నాలా’ రహస్యం..?

* భాగ్యనగరానికి సంకటంగా మారిన నాలాలు  
* చిన్నపాటి వర్షానికే కాల్వలుగా మారుతున్న రోడ్లు

 
ఈ నగరానికేమైంది? ఓ వైపు కాస్త వర్షానికే చెరువును తలపించే రోడ్లు.. మరోవైపు ముంపు బారిన పడుతున్న లోతట్టు ప్రాంతాలు.. ఎవరూ నోరుమెదపరేంటి?
 

పేరడీని తలపిస్తున్నా.. ఇది పచ్చి నిజం.. వర్షమంటేనే విశ్వనగరం వణుకుతోంది.. నగరవాసి కలవరపడుతున్నాడు..  అసలు నీళ్లు పారాల్సిన నాలాలు ఏమయ్యాయి?  చిన్న వర్షానికే ఎందుకు పొంగిపొర్లుతున్నాయి? ఇంతకీ నగరంలోని నాలాల రహస్యమేంటి?
 
సాక్షి, హైదరాబాద్:
నగరంలో వాన పడిందంటే చాలు.. రహదారులు కాల్వలను తలపిస్తున్నాయి. గంటల తరబడి ట్రాఫిక్‌లో చిక్కుకుని నగరవాసులు అల్లాడుతున్నారు. బస్తీలు, లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లలోకి నడుంలోతు నీరు చేరడంతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. దీనికి కారణం.. నీళ్లు పారాల్సిన నాలాలను కబ్జా చేయడమే.. ఎక్కడికక్కడ అక్రమాల అడ్డుగోడలు.. నేలపై కట్టాల్సిన నిర్మాణాలను నాలాల్లో కట్టేస్తున్నారు. గ్రేటర్‌లో మైనర్, మేజర్ నాలాలపై మొత్తం 30 వేల అక్రమ నిర్మాణాలు ఉన్నాయని అంచనా.

ఇది పదేళ్ల క్రితం నాటి లెక్క మాత్రమే. ఇప్పుడు పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది. దీనికితోడు నాలాల్లోకి చేరుతున్న వ్యర్థాలు కూడా ముంపు కష్టాలకు కారణమవుతోంది. ప్రతి రోజు నాలాల్లో సుమారు 60 మెట్రిక్ టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు చేరుతున్నాయి. ఇవి నీటి ప్రవాహానికి అడ్డుపడుతుండటంతో భారీ వర్షాలు వచ్చినప్పుడు వర్షపు నీరు రోడ్లపైకి వస్తోంది. నాలాలను ఆక్రమించి అపార్ట్‌మెంట్లు, ఇళ్లు నిర్మిస్తున్నా.. డ్రైనేజీ కనెక్షన్లు నాలాల్లోకే ఇస్తున్నా పట్టించుకోని జీహెచ్‌ఎంసీ అధికారులకు ఈ పాపంలో భాగస్వామ్యం ఉంది. గ్రేటర్ దుస్థితిని మారుస్తామని రెండేళ్ల క్రితం అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రకటించింది.

సమస్యకు నాలాల ఆధునీకరణే శాశ్వత పరిష్కారమని, ఆ పని తాము చేస్తామని ప్రభుత్వ పెద్దలు హామీలు గుప్పించారు. ఇందుకు ప్రణాళికలు కూడా రూపొందించారు. రెండేళ్లు గడిచింది.. ఇప్పటి వరకూ కార్యాచరణ మాత్రం లేదు. జీహెచ్‌ఎంసీ పాలకమండలి సమావేశంలో గళమెత్తినా మార్పు లేదు. రూ.10 వేల కోట్లతో నాలాలను ఆధునీకరిస్తే నగరానికి ముంపు తప్పుతుందని ఈ అంశంపై ఏర్పాటు చేసిన కిర్లోస్కర్ కమిటీ నివేదిక చెబుతోంది. సమస్య తెలుసు. పరిష్కార మూ తెలుసు. కానీ.. కర్ణుని చావుకు సవాలక్ష కారణాలు అన్నట్టుగా పనులు ముందుకు జరగడం లేవు. ఇందుకు నిధుల లేమి ఓ కారణమైతే.. పాలనా యంత్రాంగం తగిన శ్రద్ధ చూపకపోవడం మరో కారణం.
 
సిఫార్సులు బుట్టదాఖలు
ఆక్రమణల తొలగింపు ఒకేసారి సాధ్యం కానందున తొలిదశలో అత్యం త సమస్యాత్మకంగా ఉన్న 26 కి.మీ. మేర ఆక్రమణలు తొలగించాలని ఏడాది క్రితం స్వచ్ఛ కమిటీ ప్రభుత్వానికి సిఫారసు చేసింది. మొత్తం 1,152 నిర్మాణాలను తొలగించేందుకు రూ. 223 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేసింది. ఇంకా అనేక సిఫార్సులు చేసింది అయితే ఇవన్నీ బుట్టదాఖలయ్యాయి.
 
ఎప్పుడు ఆపద వస్తే అప్పుడే..
మరికొద్ది రోజులు భారీ వ ర్షాలు తప్పవనే సూచనలతో అధికారులు తాత్కాలిక చర్యలకు సిద్ధమయ్యారు. నాలాలు తెగే ప్రమాదం ఉండటంతో ఇప్పటికే జామ్ అయిన నాలాల్లో ప్లాస్టిక్, ఇతరత్రా వ్యర్థాలేవీ వేయకుండా ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేశారు. నాలాల్లో వ్యర్థాలు వేయకుండా ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ముందుకొచ్చేవారికి నెలకు రూ.10 వేల వంతున ప్రోత్సాహకం ఇవ్వాలని నిర్ణయించారు. స్వచ్ఛ వలంటీర్లనూ నియమించాలని భావించారు. స్వయం సహాయక సంఘాల మహిళలను గుర్తించి, వారి ద్వారా అవగాహన కల్పించే ఏర్పాటు చేశారు. వీటికి సంబంధించి ఆరు మాసాలకు కార్యాచరణ సిద్ధం చేయాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్ సంబంధిత అధికారులకు ఆదేశించారు.

మరిన్ని వార్తలు