వేసవిలో జూనియర్ లెక్చరర్లకు పదోన్నతులు

9 Jan, 2016 03:42 IST|Sakshi
వేసవిలో జూనియర్ లెక్చరర్లకు పదోన్నతులు

♦ 3,670 మంది కాంట్రాక్టు లెక్చరర్ల క్రమబద్ధీకరణ
♦ జేఎల్స్ సంఘం డైరీ ఆవిష్కరణలో మంత్రి కడియం
 
 సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పని చేసే జూనియర్ లెక్చరర్లకు వేసవి సెలవుల్లో పదోన్నతులు, బదిలీలు కల్పించనున్నట్లు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి వెల్లడించారు. సచివాలయంలో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో కడియం ముఖ్య అతిథిగా పాల్గొని ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల సంఘం డైరీ, క్యాలెండర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 3,670 మంది కాంట్రాక్టు లెక్చరర్లను రెగ్యులరైజ్ చేస్తామని చెప్పారు. ప్రస్తుత పీఆర్సీ ద్వారా అందరికి వేతనాలు బాగున్నాయని, కాలేజీల్లో సరిపడా సిబ్బంది ఉంటారని, అందరూ బాగా పని చేయాలన్నారు. ప్రజల సొమ్మే వేతనాలుగా పొందుతున్నారు కాబట్టి ఉద్యోగులు కూడా ప్రజలకు జవాబుదారులేనని అన్నారు. ఇక ఇంటర్మీయెట్ బోర్డులో ఇప్పటికే 22 సేవలను ఆన్‌లైన్ చేశామని, త్వరలోనే మొత్తం సేవలను ఆన్‌లైన్ చేస్తున్నట్లు వెల్లడించారు.

 నేను ఇదే కుటుంబ సభ్యుడిని..
 ‘మొదట జూనియర్ లెక్చరర్‌గా పని చేశాను కాబట్టి నేను ఇదే కుటుంబ సభ్యుడిని. ఇంటర్ విద్యాభివృద్ధి కోసం చర్యలు చేపడుతున్నాం. ప్రభుత్వ కళాశాలలు ప్రైవేటు కాలేజీలతో పోటీ పడలేకపోతున్నాయి. అందుకే ఈ విద్యా సంవత్సరం నుంచే ఇంటర్మీడియెట్ విద్యను ఉచితంగా అందిస్తున్నాం’ అని కడియం తెలిపారు. రూ.200 కోట్లతో భవనాలు, తాగునీరు, టాయిలెట్ వంటి అన్ని సదుపాయాలు కల్పిస్తున్నామని వివరించారు.

 2 లక్షలకు పెరగాలి..
 ప్రస్తుతం ప్రభుత్వ కాలేజీల్లో 1.5 లక్షల మంది చదువుకుంటున్నారని, లెక్చరర్లు బాగా పని చేసి వచ్చే ఏడాది ఈ సంఖ్యను 2 లక్షలకు పెంచాలని కడియం శ్రీహరి సూచించారు. కాలేజీల్లో నాణ్యతా ప్రమాణాల పెంపునకు సీసీ కెమెరాలు, బయోమెట్రిక్ విధానం అమలుకు నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. వచ్చే 2 నెలల్లో వీటిని ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇంటర్మీడియెట్ బోర్డు కార్యదర్శి అశోక్ మాట్లాడుతూ, వసతుల కల్పన, లెక్చరర్ల నియామకం, ఉచిత విద్యతో దేశంలోనే రాష్ట్రం ఆదర్శంగా నిలుస్తోందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత ఇంటర్మీడియెట్ విద్యతో 408 ప్రైవేటు జూనియర్ కాలేజీల్లో ఈసారి ఒక్కరూ చేరలేదని, ప్రభుత్వ చర్యల వల్లే ఇది సాధ్యమైందని ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల సంఘం అధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డి తెలిపారు.

మరిన్ని వార్తలు