అగ్ని ప్రమాదాలు పెరిగాయి

31 Dec, 2017 03:19 IST|Sakshi

అగ్నిమాపక శాఖ డీజీ రాజీవ్‌ రతన్‌

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఈ ఏడాది అగ్నిప్రమాదాల సంఖ్య పెరిగినట్టు అగ్నిమాపక శాఖ డైరెక్టర్‌ జనరల్‌ రాజీవ్‌ రతన్‌ వెల్లడించారు. శనివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ, అగ్నిమాపక శాఖ వార్షిక నివేదిక విడుదల చేశారు. 2016లో 9,286 అగ్నిప్రమాదాలు జరిగితే ఈ ఏడాది 9,811 ప్రమాదాలు చోటు చేసుకున్నాయని చెప్పారు. గతేడాది కంటే 5.3 శాతం అధికంగా ప్రమాదాలు సంభవించాయని తెలిపారు. 499 మంది ప్రాణాలను తమ సిబ్బంది కాపాడారన్నారు. ఈ ఏడాది ప్రమాదా ల్లో రూ.154 కోట్ల ఆస్తినష్టం జరిగిందని, రూ.685 కోట్ల ఆస్తిని కాపాడామని రాజీవ్‌రతన్‌ తెలిపారు.

అగ్నిప్రమాదాల నివారణపై అవగాహనకు మూడు, ఎనిమిదో తరగతుల సిలబస్‌లో పాఠ్యాంశాలను చేర్చినట్టు చెప్పారు. ఘటనాస్థలికి ఫైరింజన్లు చేరుకోవడానికి గ్రీన్‌చానల్‌ ఏర్పాటు చేశామని, ప్రమాదం జరిగిన వెంటనే క్షణాల్లో ప్రభుత్వ విభాగాలకు సమాచారం చేరుతోందన్నారు. గ్రీన్‌చానల్‌ వల్ల హైదరాబాద్‌ పోలీస్, వాటర్‌బోర్డు, జీహెచ్‌ఎంసీ, హెల్త్‌ విభాగాలు తక్షణమే స్పందిస్తున్నాయని చెప్పారు. ప్రాణాలకు తెగించి పనిచేసిన ఫైర్‌మెన్‌ అర్జున్, సుధాకర్‌కు రాష్ట్రపతి అవార్డులు సైతం వచ్చాయన్నారు.

సులువుగా ఫైర్‌ ఎన్‌వోసీ పొందేందుకు ఆన్‌లైన్‌ ద్వారా అన్ని అనుమతులు మంజూరు చేస్తున్నట్టు తెలిపారు. ఈ ఏడాది 5 వేలకుపైగా అనుమతులిచ్చామని, వీటి ద్వారా రూ.14.46 కోట్ల ఆదాయం సమకూరిందని తెలిపారు. రాష్ట్రంలో త్వరలో 18 అగ్నిమాపక స్టేషన్లు ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు.  కాగా, ముంబై పబ్‌లో జరిగిన అగ్నిప్రమాదం వంటి ఘటనల నివారణపై డీజీని మీడియా ప్రశ్నించగా, పబ్‌లతో తమకు సంబంధంలేదని, తాము భవనాలకు మాత్రమే ఫైర్‌ ఎన్‌వోసీ ఇస్తామని స్పష్టం చేశారు. పబ్‌లకు పోలీస్, ఎక్సైజ్‌ విభాగాలు అనుమతిస్తాయన్నారు. పబ్‌ నిర్వాహకులు ఎంట్రీ, ఎగ్జిట్‌ పాయింట్లను తప్పకుండా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. 

మరిన్ని వార్తలు