మహిళా డాక్టర్‌తో అసభ్యప్రవర్తన

9 Nov, 2014 00:04 IST|Sakshi

వైద్య సదస్సులో పాల్గొనేందుకు ముంబై నుంచి వచ్చిన డాక్టర్
హోటల్‌లో బస మారు తాళం చెవితో తలుపులు తెరచిన ఐదుగురు నిందితులు
 

నాగోలు: వైద్య సదస్సులో పాల్గొనేందుకు ముంబై నుంచి నగరానికి వచ్చిన ఓ మహిళా డాక్టర్‌పై ఇద్దరు హోటల్ సిబ్బందితో పాటు మరో ముగ్గురు యువకులు అసభ్యకరంగా ప్రవర్తించారు. ఎల్బీనగర్ పోలీసు స్టేషన్ పరిధిలో శుక్రవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.  ముంబైకి చెందిన మహిళా డాక్టర్ (35), మరో డాక్టర్‌తో కలిసి ఓ ప్రైవేటు ఆస్పత్రిలో జరిగే వైద్య సదస్సులో పాల్గొనేందుకు ఎల్‌బీనగర్‌కు వచ్చారు. నిర్వాహకులు అభినందన గ్రాండ్ హోటల్‌లో బస ఏర్పాటు చేశారు. మహిళా డాక్టర్‌కు ఒకగది, ఆమెతో పాటు వచ్చిన  డాక్టర్‌కు మరో గది కేటాయించారు. రాత్రి 10.30 గంటలకు  అదే హోటల్‌లో గదిని అద్దెకు తీసుకున్న భూపాల్‌రెడ్డి, యాదగిరి, దిలీప్, హోటల్ సూపర్‌వైజర్ నర్సింహ్మ మద్యం సేవించి మహిళా డాక్టర్ గది గడియను కొట్టారు. దీంతో ఆమె గది తలుపులు తెరిచింది. ఒంటరిగా ఉన్న విషయాన్ని వారు గుర్తించారు. సారి మేడమ్..మేము వేరే గదికి వెళ్లాలని వారు అక్కడి నుంచి వెళ్లిపోయారు.

అరగంట తరువాత హోటల్ మేనేజర్‌తో కలిసి మొత్తం ఐదుగురు మారు తాళం చెవితో గది తలుపులు తెరిచి లోనికి చొరబడ్డారు. ప్రమాదం పసిగట్టిన బాధితురాలు వెంటనే అవేర్ ఆస్పత్రి డాక్టర్లకు సమాచారం అందించారు. వారు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పది నిమిషాల్లో  హోటల్‌కు చేరుకున్నారు. పోలీసుల రాకను గమనించిన నిందితులు పారిపోయేందుకు యత్నించారు. వారిని వెంబడించి పట్టుకుని ఠాణాకు తరలించారు. డాక్టర్ ఫిర్యాదు మేరకు పై ఐదుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేస్తున్నారు. అభినందన గ్రాండ్ హోటల్‌లో సీసీ కెమెరా పుటేజీలను పోలీసులు పరిశీలిస్తున్నారు.  
 
 

Read latest Hyderabad News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు