త్వరలో దేశవ్యాప్తంగా మందుల దుకాణాల బంద్

26 Jun, 2016 04:20 IST|Sakshi

అఖిల భారత కెమిస్ట్స్, డ్రగ్గిస్ట్స్ సంఘం ప్రకటన
సాక్షి, హైదరాబాద్: మందుల దుకాణాదారులకు నష్టం కలిగించేలా కేంద్రం తీసుకున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా త్వరలో దేశవ్యాప్తంగా మందుల దుకాణాల బంద్ చేపడతామని అఖిల భారత కెమిస్ట్స్, డ్రగ్గిస్ట్స్ సంఘం ప్రకటించింది. సంఘం అత్యున్నత స్థాయి సమావేశం ఆదివారం హైదరాబాద్‌లో జరుగనుంది. సమావేశం ఎజెండాను సంఘం అధ్యక్షుడు జేఎస్ షిండే, ప్రధాన కార్యదర్శి సురేష్‌గుప్తా, రాష్ట్ర అధ్యక్షుడు వెంకటపతి శనివారం ఇక్కడ విలేకరులకు వెల్లడించారు. బంద్ తేదీని సమావేశంలో నిర్ణయిస్తామన్నారు. అవసరమైతే నిరవధిక సమ్మె చేయాలన్న ఆలోచన కూడా ఉందన్నారు.  

కేంద్రం 344 అత్యవసర మందులను నిషేధించిందని, అయినా కొందరు స్టే తెచ్చుకొని వాటిని విక్రయిస్తున్నారన్నారు. ఆన్‌లైన్‌లో విక్రయాల వల్ల యువత నిద్ర మాత్రలు, మత్తు కలిగించే ఇతరత్రా మందులను కొనుగోలు చేస్తున్నారని, దీనివల్ల వారు శారీరకంగా, మానసికంగా నష్టపోతారన్నారు. అందుకే ఆన్‌లైన్‌లో మందుల విక్రయాలను నిలిపివేయాలన్నారు. లెసైన్స్ ఫీజును రూ.3 వేల నుంచి రూ.30 వేలకు పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుందని, దీన్ని ఉపసంహరించుకోవాలని సంఘం నాయకులు డిమాండ్ చేశారు.

మరిన్ని వార్తలు