విమాన విలాసం.. అదరహో..!

17 Mar, 2016 07:56 IST|Sakshi
విమాన విలాసం.. అదరహో..!

ఆకాశాన్ని రంగుల తోరణాలతో అలంక రించినట్టుగా.. విను వీధిలో లోహ విహంగాల విహారం. విస్తుగొలిపే విన్యాసాల సమాహారం. విభిన్న రూపాలు... అత్యాధునిక సౌకర్యాలు... వినూత్న ఆవిష్కరణలు... దేశ ప్రథమ పౌరుడు ప్రణబ్ సైతం ముచ్చటపడేలా... అచ్చెరువొందేలా చేశాయి. ఇదీ బేగంపేట  విమానాశ్రయంలో సాగుతున్న  ‘ఇండియా ఏవియేషన్-2016’ ప్రత్యేకత.

 

బుధవారం ఏవియేషన్ షో ప్రారంభం అదిరింది. దేశ ప్రథమ పౌరుడి రాకతో బేగంపేట విమానాశ్రయం మురిసిపోయింది. స్వదేశీ, విదేశీ ప్రతినిధులతో కళకళలాడింది. రాజహంసల రాచఠీవిని చూసి సందర్శకులు ముగ్దులయ్యారు. విమానయాన ప్రదర్శన అనుభూతుల్ని పదిలపరుచుకునేందుకు సెల్ఫీలు క్లిక్ మనిపించారు. ‘వినువీధి వీరుల’ గగుర్పాటు విన్యాసాల్ని ఉత్కంఠతో తిలకించారు. బుధవారం మొదలైన ఈ ఎగ్జిబిషన్ మరో నాలుగురోజుల పాటు జరగనుంది.

గగన విన్యాసం
మార్క్ జెఫర్స్ బృందం ఆకాశంలో చేసిన విన్యాసాలను సందర్శకులు ఉత్కంఠతో వీక్షించారు. అంతవరకు ఎగిరిన విమానం భూమివైపునకు అతివేగంగా దూసుకువచ్చేలా చేసిన విన్యాసం వీక్షకుల్ని అబ్బురపరిచింది. ఈ షో గురువారం నుంచి ఈ నెల 20 వరకు ఉదయం 11.35 గంటలకు, మధ్యాహ్నం 3 గంటలకు ఉంటుంది.  

మరిన్ని ఫొటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

మరిన్ని వార్తలు