‘ఆరోగ్యానికి’ జీడీపీలో 1 శాతమే

22 Dec, 2016 03:16 IST|Sakshi
‘ఆరోగ్యానికి’ జీడీపీలో 1 శాతమే

భారత వైద్య పరిశోధనా మండలి డీజీ సౌమ్యా స్వామినాథన్‌
- పేదరికం ఊబిలోకి ఏటా 10 లక్షల మంది
భారీగా ఔషధ ఎగుమతులు... మనకేమో అందవు
బీపీ, షుగర్‌లతోనే గుండెపోటు మరణాలు
రాజకీయ చిత్తశుద్ధితోనే ప్రజారోగ్యం
సార్వత్రిక ఆరోగ్య బీమా రావాలి

సాక్షి, హైదరాబాద్‌: మన దేశంలో ప్రజారోగ్యంపై చేస్తున్న ఖర్చు స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)లో ఒక శాతం మాత్రమే! అదే కెనడా తన జీడీపీలో 7 శాతం వెచ్చిస్తోంది’’ అని భారత వైద్య పరిశోధనా మండలి డైరెక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ సౌమ్యా స్వామినాథన్‌ అన్నారు. వైద్య పరిశోధనకు దేశంలో ఎక్కువగా నిధులు కేటాయించడం లేదని ఆవేదన వెలిబుచ్చారు. ప్రజారోగ్య సాధనకు రాజకీయ చిత్తశుద్ధి అవసరమన్నారు. అడ్మినిస్ట్రేటివ్‌ స్టాఫ్‌ కాలేజీ ఆఫ్‌ ఇండియా (ఆస్కి) 60వ వ్యవస్థాపక దినోత్సవం బుధవారం ఇక్కడ ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ‘దేశంలోని పేదలకు అందుబాటులో ఆరోగ్య భద్రత’ అన్న అంశంపై ఆమె ప్రత్యేక ఉపన్యాసం ఇచ్చారు. కొన్ని దశాబ్దాల క్రితం అంటురోగాలతో ఎక్కువ మంది చనిపోయేవారని, ఇప్పుడు మాత్రం జీవన శైలి (దీర్ఘకాలిక) రోగాల కారణంగా అధికంగా మరణిస్తున్నారని వివరించారు. ‘‘ప్రాథమిక ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటే జీవిత కాలాన్ని పెంచవచ్చు.

అయితే ఇందుకోసం ముందుగా ఉప ఆరోగ్య కేంద్రాలను బలోపేతం చేయాల్సిన అవసరముంది. ఆరోగ్య, స్వస్థత కేంద్రాలను కూడా నెలకొల్పాలి. డాక్టర్ల కొరత తీర్చేందుకు ఆయుష్‌ వైద్యులకు ప్రత్యేక బ్రిడ్జ్‌ కోర్సు నిర్వహించి వారి సేవలను వాడుకోవాలి’’ అని సూచించారు. మన దేశంలో గుండె సంబంధిత మరణాలే అధికంగా చోటుచేసు కుంటున్నాయి. జీవనశైలిలో మార్పుల వల్ల బీపీ, షుగర్‌ వంటివి పెరిగిపోవడం ఇందుకు ప్రధాన కారణం. పట్టణాల్లో కాలు ష్యంతో అనేక వ్యాధులకు కారణమవు తోంది. గ్రామాల్లో ఇప్పటికీ మహిళలు కట్టెల పొయ్యి ఎక్కువగా వాడు తున్నారు. ఇది వారి ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతోంది. దేశంలో జననాల రేటు నమోదు కచ్చితంగా ఉంది గానీ కానీ మరణాల రేటు సరిగా నమోదవడం లేదు. అంతేగాక మరణాల కు కారణాలపై సరైన సమాచారమే ఉండట్లేదు. దాంతో ప్రజారోగ్యంపై అవగాహనకు రాలేకపోతున్నాం’’ అని ఆమె వివరించారు.

ఏటా 10 లక్షల మంది పేదరికం వైపు
దేశంలో ఏటా 10 లక్షల మంది పేదరికపు ఊబిలోకి కూరుకుపోతున్నారని సౌమ్య ఆవేదన వెలిబుచ్చారు. ‘‘ప్రపంచ ఔషధ ఎగుమతుల్లో మన దేశ వాటా 30 శాతం. కానీ మన ప్రజలకు మాత్రం అవి అందుబాటు ధరల్లో లభించడం లేదు. కాబట్టి సార్వత్రిక ఆరోగ్య కవరేజీ కల్పించే దిశగా ఓ సమగ్ర ప్యాకేజీ రావాల్సిన అవసరముంది’’ అని ఆమె అన్నారు. ‘‘ఆరోగ్య సంరక్షణ కోసం నూతన వైద్య విధానం రావాలి. రాష్ట్రాల్లోని ఆరోగ్య పథకాలతో కేంద్రం అనుసంధానం కావాలి. వైద్య ఖర్చులను ప్రజలు పెట్టుకునే దుస్థితి పోవాలి. దేశంలో 400 వైద్య కళాశాలలుంటే పరిశోధనలు జరుగుతున్న వాటి సంఖ్య 25ను మించడం లేదు. వైద్య కాలేజీల్లో పరిశోధనలు విస్తృతం కావాలి. దేశంలో ప్రత్యామ్నాయ వైద్య విధానాన్ని అధికారికంగా గుర్తించేందుకు ఒక కమిటీ వేయాలి’’ అని సూచించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం దేశంలో 80 శాతం డాక్టర్లు, 70 శాతం డిస్పెన్సరీలు పట్టణాల్లో ఉన్నాయని కేంద్ర హోంశాఖ మాజీ కార్యదర్శి పద్మనాభయ్య అన్నారు. ఆరోగ్య రంగం 80 శాతం ప్రైవేటు చేతిలోనే ఉంద న్నారు. ‘‘వ్యక్తుల జీవితకాలం కేరళలో 72 ఏళ్లుంటే మధ్యప్రదేశ్‌లో 56 ఏళ్లే. ఒకే దేశంలో ఇంతటి వ్యత్యాసముండటం నిజంగా బాధాకరం’’ అన్నారు.

Read latest Hyderabad News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు