ఫలితాలు చెప్పండి 10 లక్షల పట్టుకెళ్లండి

10 May, 2014 14:49 IST|Sakshi
ఫలితాలు చెప్పండి 10 లక్షల పట్టుకెళ్లండి

హైదరాబాద్ : భారత హేతువాద సమాఖ్య... జ్యోతిష్యులకు బంపర్ ఆఫర్ ఇచ్చింది. సార్వత్రిక ఎన్నికల ఫలితాలను కచ్చితంగా వెల్లడించిన వారికి రూ.10 లక్షల బహుమతిగా గెలుచుకోవచ్చని ప్రకటించింది. తాము గత నలభై సంవత్సరాలుగా ఈ సవాలు విసురుతున్నప్పటికి భవిష్యత్తు చెప్పే శక్తులు ఉన్నాయని చెప్పుకొనే వారెవ్వరూ ఇప్పటి వరకు బహుమతి గెలవలేదు అని ఐహెచ్ఈయూ(అంతర్జాతీయ హేతువాద, మానవవాద సంఘాల సమాఖ్య) సంచాలకుడు బాబు గోగినేని అన్నారు.

మరోవైపు సార్వత్రిక ఎన్నికల ఫలితాలతో పాటు మున్సిపల్, ఎంపీటీసీ, జడ్పీటీసీ  ఫలితాలు కూడా వెలువడనున్నాయి. ఈ నెల 12న మున్సిపల్, 13న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఫలితాలు,  16న సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెల్లడి కానున్నాయి. కాగా 2009 ఎన్నికల ఫలితాలు కూడా మే 16ననే వెలువడ్డాయి.

సరిగ్గా మరోసారి మే 16 వ తేదీనే ఫలితాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో అభ్యర్థులు జ్యోతిష్యుల చుట్టూ తిరుగుతున్నట్లు సమాచారం. అప్పట్లో  మే 16న శనివారం, విరోధినామ సంవత్సరం, బహుళ సప్తమి, శ్రవణ నక్షత్రం, వైశాఖ మాసం రోజున లెక్కింపు జరిగింది. ఇప్పుడు మే 16 శుక్రవారం, జయనామ సంవత్సరం, బహుళ విధియ, ధనుష్క నక్షత్రం, వైశాఖమాసంనాడు ఓట్ల లెక్కింపు జరుగనుంది. దీంతో జ్యోతిష్యులు కూడా ఫలితాలపై అంచనాలు వెల్లడిస్తున్నారు. మరి ఎవరి భవిష్యత్ ఎలా ఉందో తేలాలంటే మే 16వరకూ ఆగాల్సిందే.

 

Read latest Hyderabad News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు