'టాయిలెట్ విధానం వల్లే కీళ్ల అరుగుదల'

15 May, 2016 18:22 IST|Sakshi
'టాయిలెట్ విధానం వల్లే కీళ్ల అరుగుదల'

హైదరాబాద్: కాల్షియం లోపంతో పాటు ఇండియన్ టాయిలెట్ విధానంలో తరచూ కింద కూర్చొని లేవడం వల్ల అనేక మందిలో చిన్న వయసులోనే మోకాలి కీళ్లు అరుగుతున్నాయని ప్రముఖ మోకీళ్ల మార్పిడి శస్త్రచికిత్సల నిపుణుడు డాక్టర్ అఖిల్‌దాడీ చెప్పారు. పురుషులతో పోలిస్తే మహిళల్లో ఈ సమస్య అధికంగా ఉందని స్పష్టం చేశారు. ఆదివారం హోటల్ మ్యారీగోల్డ్‌లో జరిగిన 'శ్రీకర' ఆస్పత్రి ఆధ్వర్యంలో జరిగిన ఫోర్త్ జాయింట్ రీప్లేస్‌మెంట్ లైవ్ సర్జరీ వర్క్‌షాప్‌కు రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన సుమారు 250 మంది ఆర్థోపెడిక్ నిపుణులు హాజరయ్యారు.

దీనికి రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై సదస్సును ప్రారంభించారు. ఈ సందర్భంగా రెండు తుంటి, ఒక పాడైపోయిన జాయింట్‌తో పాటు మరో నాలుగు మోకీళ్ల మార్పిడి శస్త్ర చికిత్సలు చేసి లైవ్ ద్వారా వర్క్‌షాప్‌కు హాజరైన వారికి చూపించారు. అనంతరం డాక్టర్ అఖిల్ దాడీ మాట్లాడుతూ... సంప్రదాయం పేరుతో ఇప్పటికీ చాలా మంది మహిళలు నేలపై కూర్చుంటున్నారని, ఇలా కూర్చొని లేవడం వల్ల మోకాళ్లు అరుగుతున్నాయని చెప్పారు. మోకాలి నొప్పితో బాధపడుతున్న ప్రతి ఒక్కరికి శస్త్రచికిత్స అవసరం లేదన్నారు. లక్ష మంది బాధితుల్లో కేవలం రెండు వేల మందికి మాత్రమే మోకీళ్ల మార్పిడి శస్త్రచికిత్స అవసరం ఉంటుందన్నారు. మిగిలిన వారికి మందులతోనే నయం అవుతుందని చెప్పారు.

మరిన్ని వార్తలు