‘ఇందిరమ్మ’ బిల్లులొస్తున్నాయ్!

6 Jan, 2016 03:17 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: మూడు లక్షల పేద కుటుంబాలకు శుభవార్త. ప్రభుత్వం నుంచి బిల్లులు అందక అర్ధంతరంగా నిలిచిపోయిన ఇందిరమ్మ ఇళ్లకు మోక్షం లభించనుంది. పెండింగ్ బిల్లులు సహా భవిష్యత్తు బిల్లులు చెల్లించేందుకు సీఎం కేసీఆర్ పచ్చజెండా ఊపారు. దీంతో ఏడాదిన్నరగా మొండిగోడలతో దర్శనమిస్తున్న ఇందిరమ్మ ఇళ్లు పూర్తయ్యేందుకు మార్గం సుగమమైంది. ఇప్పటికే నిర్మాణాలు పూర్తి చేసుకున్న 39,429 ఇళ్లకు సంబంధించి బిల్లులు చెల్లించేందుకు రెండు నెలల క్రితమే అంగీకరించిన ప్రభుత్వం... మిగతా ఇళ్ల విషయాన్ని పెండింగ్‌లో ఉంచింది.
 
ఇప్పుడు వాటికి కూడా బిల్లులు చెల్లించాలని నిర్ణయించటంతో అధికారులు అందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. నిర్మాణంలో ఉన్న ఇళ్ల వివరాలను కలెక్టర్లు పరిశీలించి వాటిల్లో అక్రమాలు జరిగినట్టు తేలితే అలాంటి లబ్ధిదారుల పేర్లు తొలగించాలని ప్రభుత్వం జిల్లాల కలెక్టర్లను ఆదేశించింది. దీంతో మండలాలవారీగా అధికారుల బృందాలు తనిఖీ ప్రారంభించాయి.   ఈ నెలాఖరుకల్లా ఆ కసరత్తు పూర్తి చేసి ప్రభుత్వానికి జాబితా సమర్పించనున్నారు. ఫిబ్రవరి నుంచి బిల్లులు విడుదల చేసే అవకాశం ఉంది.

మరిన్ని వార్తలు