బీజేపీపై అక్కసుతో ఉన్నారు: ఇంద్రసేనా

13 Sep, 2016 18:27 IST|Sakshi

హైదరాబాద్: సెప్టెంబర్ 17వ తేదీ తెలంగాణ విమోచన దినం అధికారికంగా నిర్వహించాలనే డిమాండ్‌పై బీజేపీకి అంతటా మద్దతు లభిస్తోందని బీజేపీ నేత ఇంద్రసేనారెడ్డి అన్నారు. ఆ మద్దతు చూడలేకనే బీజేపీపై అక్కసుతో టీఆర్‌ఎస్, కమ్యూనిస్టుపార్టీల నేతలు మాట్లాడుతున్నారని ఇంద్రసేనా అన్నారు. 1997లో బీజేపీ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంపై తీర్మానం చేసినప్పుడు ‘మీ నాయన కే సీఆర్ ఎక్కడ ఉన్నారు’ అని ఆయన ఎంపీ కవితను ప్రశ్నించారు. అధికారం, మీడియా ఉన్నాయి కదా అని ఏది పడితే అది మాట్లాడవద్దని ఇంద్రసేనా రెడ్డి కవితకు హితవు పలికారు.

కల్లు తాగిన కోతుల్లాగా కమ్యూనిస్టులు బీజేపీపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు. సీపీఐ నేత నారాయణ రజాకార్లతో పోరాటం చేశారా అని ప్రశ్నించారు. కమ్యూనిస్టులు ఆగస్టు 15వ తేదీన చైనాతో కలిసి భారత్‌తో యుద్ధం చేయాలనుకున్నారు కదా అని అన్నారు. నిజాంకు అనుకూలంగా భారత సైన్యంపై మీరు యుద్ధం చేయలేదా? హైదరాబాద్ సంస్థానం విలీనానికి మీరు వ్యతిరేకం కాదా? ఈవిషయాలపై చర్చకు రండి అని సవాల్ విసిరారు. కమ్యూనిస్టులకు హిడెన్ ఎజెండా ఉందని ఆనాడే దాశరథి చెప్పారని గుర్తు చేశారు. కమ్యూనిస్టుల వారసులు దేశద్రోహులని తీవ్రంగా ఆరోపించారు.

మరిన్ని వార్తలు