సూదిగాడి కలకలం వట్టిదే

15 Sep, 2015 09:07 IST|Sakshi

మానవత్వం చూపబోతే అపార్థం చేసుకున్న స్థానికులు
పాపకు వైద్యపరీక్షల్లో సూది గుచ్చిన అనవాళ్లు లేవని వెల్లడి



బంజారాహిల్స్: హైదరాబాద్ బంజారాహిల్స్‌రోడ్ నెం. 2 లోని ఇందిరానగర్‌లో సూది కలకలం అంతా వట్టిదేనని తేలింది. సూదితో ఆడుకుంటున్న పాపకు అది పొరపాటున గుచ్చుకుంటుందోనని స్థానిక యువకుడు సురేశ్ మానవత్వం చూపితే, అది తప్పుగా అర్థం చేసుకున్న స్థానికులు అతడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. తర్వాత పాపకు వైద్య పరీక్షలు చేస్తే సూదిగుచ్చిన అనవాళ్లు లేవని నీలోఫర్ ఆస్పత్రి వైద్యులు ధ్రువీకరించారు. పాపకు సూది గుచ్చుకుంటే ఏమైనా జరుగుతుందని సాయం చేయబోయిన నా స్నేహితుడినే సూది అనుమానితుడిగా చిత్రీకరిచడం బాధాకరమని అతడి రూమ్మేట్ అన్నారు. సురేశ్‌తో పాటు తనను ఈ కేసులో విచారించేందుకు తీసుకుపోతే, ఇంకా పాపకు సూది గుచ్చిందన్న విషయం రూఢి కాకముందే ఫొటోలు తీసి మీడియాలో చూపించడం వ్యక్తిగత ప్రతిష్ఠను దెబ్బతీసిందని ఆవేదన వ్యక్తం చేశారు.

జరిగింది ఇదీ...
ఇందిరానగర్‌ పోచమ్మ దేవాలయం సమీపంలో ఉదయం 11.15 నుంచి 11.30 గంటల మధ్య పాండురంగరావు, శ్రావణి దంపతుల కుమార్తె గ్రేసీ కావ్య (9) ఆడుకుంటోంది. అదే సమయంలో ఆ పాప సూదితో ఆడుకోవడాన్ని గమనించిన సురేశ్.. ఆ సూది గుచ్చుకుంటుందని తీసి పారేశాడు. తర్వాత వారి తల్లికి చెప్పగా, పాపకు సూది ఏమైనా గుచ్చుకుందన్న భయంతో ఆస్పత్రికి తీసుకెళ్లింది. ఇంతలో చుట్టుపక్కలవాళ్లు సూది సైకో అనుకుని చుట్టుముట్టారు. విషయం ఎంత చెప్పినా వినిపించుకోకుండా సురేశ్‌పై చెయ్యి చేసుకున్నారు. ఇంతలోనే సురేశ్ తన రూమ్మేట్‌కు కాల్ చేశాడు. ఘటనాస్థలికి చేరుకున్న అతను వారందరినీ విడదీశాడు. గత నాలుగేళ్ల నుంచి ఇందిరానగర్‌లోనే అద్దెకు ఉంటున్నామని, అవసరమైతే యజమానిని వివరాలు అడిగి తెలుసుకోవచ్చన్నారు. ఇంతలోనే పోలీసులు వచ్చి సురేశ్‌తో పాటు అతడి స్నేహితుడిని తీసుకెళ్లారు. అయితే ఆ తర్వాత పోలీసులు వారిని విచారించగా... ల్యాప్‌టాప్ మాత్రమే లభ్యమైంది. మరే ఇతర అనుమానిత సామగ్రి వారి గదిలో దొరకలేదు. దీంతో సురేశ్ స్నేహితుడిని పోలీసులు వదిలేశారు. కాగా, పాపకు నీలోఫర్ ఆస్పత్రిలో వైద్యపరీక్షలు చేయగా, ఎటువంటి సూది గుచ్చిన ఆనవాళ్లు లేవని తేలింది. అందుకే ఇంతవరకు కేసు నమోదు చేయలేదని, కేవలం అదుపులోకి తీసుకొని విచారించామని చెబుతున్నారు.  

ఫొటో పొరపాటు

సాక్షి దినపత్రిక మెయిన్ ఐదో పేజీలో సోమవారం ప్రచురించిన బంజారాహిల్స్ సూదిగాడి కలకలం కథనంలో ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేని సురేశ్ స్నేహితుడి ఫొటో ప్రచురితమైంది. సురేశ్‌తో పాటు అతడి రూమ్మేట్‌ను పోలీసు వాహనంలో తరలిస్తుండగా తీసిన ఫొటోలో...సురేశ్ ఫొటోకు బదులుగా అతడి స్నేహితుడి ఫొటో పొరపాటున ప్రచురితమైంది. ఈ పొరపాటుకు చింతిస్తున్నాం.

మరిన్ని వార్తలు