పార్కుల్లో భద్రతపై ఆరా..!

29 Jan, 2016 01:10 IST|Sakshi
పార్కుల్లో భద్రతపై ఆరా..!

లుంబినీ, ఎన్టీఆర్, సంజీవయ్య పార్కును పరిశీలించిన నిఘా బృందం
అన్ని పార్కుల్లో బయటపడ్డ  భద్రతా లోపాలు

 
సిటీబ్యూరో : హుస్సేన్‌సాగర్ తీరంలో నిత్యం సందర్శకులతో కిటకిటలాడే లుంబిని పార్కు, ఎన్టీఆర్ గార్డెన్, సంజీవయ్య పార్కుల్లో ప్రజాభద్రతపై పోలీసు అధికారుల నిఘా బృందం లోతుగా అధ్యయనం చేసింది. లష్కరే తోయిబా, హిజుబుల్ ముజాహిద్దీన్, ఐఎస్‌ఐఎస్ వంటి తీవ్రవాద సంస్థలు మెట్రోపాలిటన్ నగరాల్లో విధ్వంసాలకు పాల్పడే అవకాశం ఉందన్న కేంద్ర నిఘా వర్గాల సమాచారంతో హైదరాబాద్ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ మేరకు సాగర్ పరిసరాల్లో సందర్శనీయ ప్రాంతాలైన పార్కుల ను బుధ, గురువారాల్లో సందర్శించి క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా లుంబినీ, ఎన్టీఆర్‌గార్డెన్, సంజీవయ్య పార్కుల్లోని భద్రతాపరమైన అనేక లోపాలు బయటపడ్డాయి. లుంబిని లేజర్ షో ప్రాంగణంలో అగ్నిప్రమాదం సంభవిస్తే నివారించేందుకు ఎలాంటి పరికరాలు ఏర్పాటు చేయకపోవడాన్ని నిఘా బృందం గుర్తించింది. గతంలో ఇక్కడ తీవ్రవాదులు జరిపిన మారణ హోమంలో 11 మంది అసువులుబాసినా హెచ్‌ఎండీఏ ప్రజాభద్రతపై ప్రత్యేకంగా దృష్టి పెట్టక పోవడాన్ని పోలీసు అధికారులు తప్పుబట్టారు. ఎన్టీఆర్ మెమోరియల్ వెనుక సెక్రటేరియట్ వైపు ఉన్న గుడిసెలను వెంటనే తొలగించాలని నిర్ణయించారు.  వీఐపీల కదలికలు అధికంగా ఉండే ఈ ప్రాంతంలో రోడ్డుపక్కనే ఉన్న గుడిసెల వల్ల ముప్పు ఉందని నిఘా అధికారులు భావిస్తున్నారు. అలాగే ఐమాక్స్ థియేటర్ వెనుక వైపున ఫెన్షింగ్ పటిష్టంగా లేకపోవడాన్ని నిఘా అధికారులు గుర్తించారు.

ఐమాక్స్ థియేటర్ నుంచి ఎన్టీఆర్ గార్డెన్‌లోకి, అలాగే గార్డెన్ నుంచి థియేటర్ వైపునకు వెళ్లేందుకు మార్గం సులభంగా ఉండటంతో ఇక్కడ పటిష్టమైన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు.  సుమారు 90 ఎకరాల విస్తీర్ణం ఉన్న సంజీవయ్య పార్కులో తగినన్ని సీసీ కెమెరాలు లేని విషయాన్ని, అలాగే సాగర్ గట్టు వెంట నిర్మించిన రెయిలింగ్ ఎత్తు చాలా తక్కువ ఉండటాన్ని నిఘా బృందం గమనించింది. పీవీ ఘాట్ వెనుక ప్రాంతంలో పడిపోయిన కాంపౌండ్ వాల్‌ను తిరిగి నిర్మించకపోవడాన్ని అధికారులు గుర్తించారు.  సందర్శకులతో రద్దీగా ఉండే ఈ పార్కుల్లో నామమాత్రంగా సెక్యూరిటీ సిబ్బందిని కొనసాగిస్తున్న తీరుపై అధికారులు విస్మయం వ్యక్తం చేశారు. ముఖ్యంగా లుంబినీ పార్కు, ఎన్టీఆర్ గార్డెన్‌లకు వస్తున్న వాహనాలపై ఎలాంటి తనిఖీలు చేయకపోవడం, పార్కింగ్ లాట్ వద్ద సెక్యూరిటీ సిబ్బంది లేకపోవడం వ ంటి లోపాలను అధికారులు గుర్తించారు. దీనిపై సమగ్ర నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి అందిస్తామని సంబధిత అధికారి ఒకరు తెలిపారు. తనిఖీల్లో ఏసీపీ సురేందర్‌రెడ్డి, ఇంటిలిజెన్స్, స్పెషల్ బ్రాంచి అధికారులు, సైఫాబాద్ పోలీసులు, హెచ్‌ఎండీఏ ఏఓ, రేణుకాశక్తి సెక్యూరిటీ ఏజెన్సీ సిబ్బంది పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు