ఐటీఐల్లో తనిఖీ బృందాలు

18 May, 2018 03:56 IST|Sakshi

ప్రమాణాలు పాటించకుంటే గుర్తింపు రద్దు

సాక్షి, హైదరాబాద్‌: పారిశ్రామిక శిక్షణ సంస్థ (ఐటీఐ)ల్లో ప్రమాణాల పరిస్థితిని పరిశీలించేందుకు కార్మిక ఉపాధి కల్పన శాఖ ఉపక్రమించింది. ప్రైవేటు ఐటీఐల్లో కనీస ప్రమాణాలు పాటించడం లేదంటూ వస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలో ప్రమాణాల పరిశీలనకు ప్రత్యేకంగా తనిఖీ బృందాలను ఏర్పాటు చేసింది.

పరిశీలన అనంతరం తనిఖీ బృందాలు ఇచ్చే నివేదిక ఆధారంగా వాటి గుర్తింపును కొనసాగించే అవకాశం ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 291 ఐటీఐలున్నా యి. నైపుణ్యాభివృద్ధి కార్యక్రమంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఐటీఐలకు ప్రాధాన్యతనిస్తోంది. ప్రతి ఐటీఐలోనూ పూర్తిస్థాయి ప్రమాణాలుండేలా కార్మిక ఉపాధి కల్పన శాఖ చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగా తనిఖీలకు ఉపక్రమించింది.

త్రిసభ్య కమిటీలు ఏర్పాటు
ఐటీఐల తనిఖీలకు ఆ శాఖ జిల్లాల వారీగా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో ముగ్గురు సభ్యులుంటారు. శాఖ ప్రాంతీయ ఉప సంచాలకుడు, జిల్లా ఉపా ధి కల్పనాధికారితో పాటు ప్రభుత్వ ఐటీఐ నుంచి సీనియర్‌ ఫ్యాకల్టీతో ఏర్పా టు చేసిన త్రిసభ్య కమిటీ జిల్లా పరిధిలో ఉన్న ప్రైవేటు ఐటీఐల్లో మౌళిక వసతులు, మిషనరీ, బోధనా సిబ్బంది తదితర అంశాలను ప్రాధాన్యత క్రమంలో పరిశీలిస్తారు. ప్రత్యేక ఫార్మాట్‌తో కూడిన ప్రొఫార్మా ఆ శాఖ తయారు చేసి బృందాలకు అందించింది. తనిఖీ అనంతరం వీరు ఉన్నతాధికారులకు నివేదికలు సమర్పిస్తారు.

కేంద్ర ప్రభుత్వానికి కమిటీ నివేదికలు...
పారిశ్రామిక శిక్షణ సంస్థల అనుమతిలో కేంద్ర కార్మిక శాఖ పరిధిలోని డీజీఈటీ(డైరెక్టర్‌ జనరల్‌ ఎంప్లాయిమెంట్‌ అండ్‌ ట్రైనింగ్‌)కి కీలక పాత్ర ఉంటుంది. అనుమతులు, రెన్యువల్‌ తదితరాలన్నీ వీటి పరిధిలోనే ఉంటాయి. ఐటీఐల తనిఖీలు చేపట్టే త్రిసభ్య కమిటీలు సమర్పించే నివేదికలను కేంద్ర కార్మిక శాఖకు సమర్పించనున్నట్లు రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ చెబుతోంది. దీంతో కమిటీ తనిఖీలపై ప్రైవేటు ఐటీఐలు ఆందోళన చెందుతున్నాయి.

మరిన్ని వార్తలు