విహారం..కారాదు విషాదం..

28 Apr, 2015 23:49 IST|Sakshi
విహారం..కారాదు విషాదం..

స్టడీ టూర్‌కు వెళ్లే విద్యార్థులకు బీమా తప్పనిసరి..!
యూజీసీ తాజా మార్గదర్శకాలు అమలు చేయాలని
కోరుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు..
బియాస్ బాధితుల కేసుపై తుదితీర్పు మే 23కు వాయిదా..
నేటికీ అందని కమిటీ నివేదిక..

 
సిటీబ్యూరో: మొన్న బియాస్...తాజాగా నేపాల్ దుర్ఘటన...రాష్ట్రం నుంచి ఏటా విజ్ఞాన, విహార, సాహస యాత్ర లకు వెళుతున్నవారి ఆచూకీ గల్లంతవుతుండడంతో వారి కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోతున్నాయి.  గతేడాది జూన్8 వ తేదీన నగరంలోని బాచుపల్లి వీఎన్‌ఆర్-వీజేఐటీ కళాశాలకు చెందిన 24 మంది విద్యార్థులు హిమాచల్ ప్రదేశ్‌లోని బియాస్ డ్యామ్ వద్ద అసువులు బాసిన విషయం విదితమే. ఈ దారుణ సంఘటన నుంచి విద్యార్థుల కుటుంబ సభ్యులు ఇప్పటికీ కోలుకోలేకపోతున్నారు. ఈ దుర్ఘటనకు కళాశాల యాజమాన్యం, బియాస్ డ్యామ్ అధికారుల నిర్లక్ష్యమేకారణమని వారు ఆరోపిస్తున్నారు. స్టడీటూర్‌కు ఎలాంటి ప్రాంతాలకు వెళ్లాలి అన్న అంశంపై విద్యార్థులకు అవగాహన కల్పించడంతోపాటు, ప్రతి బృందానికి ఓ వైద్యుడు ఉండాలని, ప్రతి విద్యార్థికి బీమా సౌకర్యం కల్పించాల్సి బాధ్యత కళాశాలల యాజమాన్యాలపై ఉందన్నారు. ఇటీవల యూజీసీ విడుదల చేసిన మార్గదర్శకాల్లో ఈ అంశాన్ని స్పష్టం చేసిందని వారు పేర్కొంటున్నారు.

యూజీసీ తాజా మార్గదర్శకాలివే...

స్టడీటూర్‌కు వెళ్లే విద్యార్థుల బృందంలో వైద్యుడు తప్పనిసరిగా ఉండాలి, సందర్శనా ప్రాంతాలపై  క్షుణ్ణంగా తెలిసిన ఓ గైడ్‌ను ఏర్పాటు చేసుకోవాలి. ఆయా ప్రాంతాల్లోని వాతావరణ, భౌగోళిక పరిస్థితులపై విద్యార్థులకు అవగాహన కల్పించాలి. అక్కడి వాతావరణ పరిస్థితులు, లోయలు, వంకలు, వాగులు, కొండలు, నదీప్రవాహాలు, డ్యామ్‌లపై విద్యార్థులకు సమాచారం అందజేయాలి. సందర్శించాల్సిన ప్రాంతాలు, అక్కడి పరిస్థితులపై వారికి ముందుగానే వివరించాలి.బృందం వెంట ప్రథమ చికిత్స కిట్ ఉంచుకోవాలి.విద్యార్థుల క్షేమ సమాచారాన్ని ఎప్పటికప్పుడు వారి తల్లిదండ్రులకు అందజేసేందుకు ఆధునిక మొబైల్‌ఫోన్లు అందుబాటులో ఉంచుకోవాలి. స్టడీటూర్ లేదా సహాసయాత్రకు వెళ్లే వారి రక్షణ, భద్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి. ఈ మార్గదర్శకాలను అమలు చేయని కళాశాలలపై కఠిన చర్యలు తీసుకోవాలని కూడా యూజీసీ పేర్కొంది.
 
మానని గాయం..
 
గతేడాది జూన్ 8న హిమాచల్ ప్రదేశ్‌లోని లార్జీ డ్యామ్ అధికారుల నిర్లక్ష్యంకారణంగా 24 మంది విద్యార్థులు గల్లంతుకావడం అప్పట్లో సంచలనం సృష్టించింది. ఈ ఘటనపై హిమాచల్ ప్రదేశ్ హైకోర్టులో కేసు నడుస్తోంది. ఇందుకు సంబందించి తుదితీర్పును  మే 23 వ తేదీకి వాయిదా వేసినట్లు బాధిత విద్యార్థుల తల్లిదండ్రులు ‘సాక్షి’కి తెలిపారు. తమకు ఏపీ, తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వాలు పరిహారం అందించినా బిడ్డలను కోల్పోయిన బాధ నుంచి కోలుకోలేకపోతున్నామన్నారు. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.
 
నేటికీ  అందని నివేదిక..
.
 
బియాస్ ఉదంతంపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన శైలజారామయ్యర్ కమిటీ నివేదిక అందించడంలో తాత్సారం చేస్తోందని బాధిత విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటన తమ తప్పేమీ లేదని, స్టడీటూర్‌ను విద్యార్థులే ఏర్పాటు చేసుకున్నారని యాజమాన్యం బాధ్యతారాహిత్యమైన ప్రకటనలు చేస్తున్నప్పటికీ కమిటీ నివేదిక అందజేయడంలో జాప్యం చేయడం తగదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

Read latest Hyderabad News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా